3-Things-to-Know-about-Haggai
హగ్గయి గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
31/07/2025
3-Things-about-Ezekiel
యెహెజ్కేలు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
07/08/2025
3-Things-to-Know-about-Haggai
హగ్గయి గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
31/07/2025
3-Things-about-Ezekiel
యెహెజ్కేలు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
07/08/2025

హోషేయ గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

3-Things-You-Should-Know-about-Hosea

1. హోషేయ పేరుకు ‘రక్షణ’ అనే అర్థం ఉంది, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు పౌరుడై ఉంటూ, ఉత్తర ప్రాంత ప్రజలకు బోధించినందున, ప్రవక్తలలో అతను ప్రత్యేకమైనవాడు.

హోషేయ 1:1 ప్రకారం, హోషేయ పరిచర్య ఉత్తర రాజ్యపు రాజైన రెండవ యెరోబాము కాలంలో మొదలై, దక్షిణ యూదా రాజ్యంలోని ఉజ్జీయా, యోతాము, అహాజు, హెజ్కియా రాజుల పాలనల వరకు కొనసాగింది. దీని ప్రకారం, హోషేయ, రెండవ యెరోబాము పరిపాలనా కాలంలో పరిచర్య చేసిన ఉత్తర రాజ్యానికి చెందిన మరొక  ప్రవక్త అయిన యోనాకు సమకాలీనుడయ్యాడు (2 రాజులు 14:25). అయితే, యోనా తన స్వీయ అనుభవాలను నినెవె పట్టణంతో సంబంధించి రచించగా, హోషేయ మాత్రం తన దృష్టిని ఇశ్రాయేలుపైనే కేంద్రీకరించాడు.

హోషేయ, ఉత్తర రాజ్యపు మిషనరీగా పరిచర్య చేసిన దక్షిణ ప్రాంతపు ఆమోసుకు సమకాలీనుడు. అంతేకాదు, అతను దక్షిణ యూదా రాజ్యంలోని ప్రవక్తలైన యెషయా, మీకాలతో కూడా సమకాలీనంగా ఉన్నాడు. రాజుల పాలనా సంవత్సరాలను బట్టి చూస్తే హోషేయ పరిచర్య కాలం వంద సంవత్సరాలకు పైగా ఉన్నట్లు అనిపించినా, వాస్తవానికి అతని పరిచర్య రెండవ యెరోబాము చివరి సంవత్సరాల్లో (సుమారు క్రీ.పూ. 753) మొదలై, హిజ్కియా తొలి సంవత్సరాల వరకు (సుమారు క్రీ.పూ. 725) కొనసాగినట్లు భావిస్తున్నారు. ఇది క్రీ.పూ. 722లో అష్షూరీయుల చేతిలో సమరయ పతనానికి కొద్దిగా ముందున్న కాలం. అది రాజకీయ సంక్షోభం, మతపరమైన గందరగోళం నెలకొన్న కాలం. దేశమంతా వినాశన అంచున ఉన్న ఆ తరుణంలో, హోషేయ ఎంతో అత్యవసర భావంతో ప్రజలకు దైవసందేశాన్ని ప్రకటించాడు.

2. హోషేయ వ్యక్తిగత జీవితం అతని సందేశాన్ని ప్రతిబింబించింది.

గోమెరుతో హోషేయ వివాహం, అతను ప్రకటించిన సందేశానికి ఒక జీవన పాఠంగా, కళ్ళముందు కనిపించే ఉదాహరణగా నిలిచింది. హోషేయ 3:1, హోషేయ గోమెరు వివాహాన్ని దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న వివాహ బంధంతో స్పష్టంగా అనుసంధానిస్తుంది. హోషేయకు గోమెరుతో ఉన్న సంబంధం, అలాగే దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సంబంధం రెండూ ప్రేమతో (దైవిక కృపతో) ప్రారంభమయ్యాయి; పాపం కారణంగా తిరస్కరించబడ్డాయి (దైవిక అసంతృప్తికి/కోపానికి గురయ్యాయి); అయినా విశ్వసనీయతతో (దైవిక నమ్మకమైన ప్రేమతో) కొనసాగించబడ్డాయి. గోమెరు పట్ల హోషేయ చూపిన నిరంతర ప్రేమ మరియు స్థిరమైన విశ్వసనీయత, తన ప్రజలైన ఇశ్రాయేలు పట్ల యెహోవాకు గల విశ్వసనీయతకు, మారని ప్రేమకు ఓ అద్భుత చిత్రణ. గోమెరు హోషేయ పట్ల చూపిన విశ్వాసఘాతుకత, తమ ప్రభువైన యెహోవాకు ఇశ్రాయేలు చేసిన ద్రోహాత్మక విశ్వాసఘాతుకానికి ఒక విషాదకరమైన, స్పష్టమైన చిత్రణ. పాత నిబంధన అంతటా, వివాహ బంధం దేవుడు తన ప్రజలతో కలిగి ఉన్న సంబంధానికి ప్రతీకగా కనిపిస్తుంది. అయితే, హోషేయ గ్రంథంలో ఈ సత్యం మరింత బలంగా, హృదయాన్ని హత్తుకునే విధంగా వ్యక్తమవుతుంది.

హోషేయ వివాహం ఈ గ్రంథ సందేశానికి అత్యంత కీలకం అయినప్పటికీ, బైబిలు వివరణలో ఇది ఒక పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఈ సమస్యలోని ప్రధాన అంశం ఏమిటంటే, దేవుడు హోషేయకు మొదట ఇచ్చిన ఆజ్ఞ “వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి చేసుకో” అనే ఆదేశం చుట్టూనే తిరుగుతుంది (హోషేయా 1:2). పైకి చూస్తే, ఇది నైతిక, ధార్మిక సందిగ్ధతను సృష్టిస్తుంది, ఎందుకంటే యాజకులకు దేవుడు ఇచ్చిన స్పష్టమైన నియమాలకు ఇది విరుద్ధంగా కనిపిస్తుంది, వారు వేశ్యలను వివాహం చేసుకోకూడదని స్పష్టంగా నిషేధించబడింది (లేవీయకాండము 21:7, 13). ఒక యాజకుడు వేశ్యను వివాహం చేసుకోవడం అపకీర్తికరమైతే, అది ఒక ప్రవక్తకు కూడా అవమానకరంగానే అనిపిస్తుంది. అంతేకాదు, ద్వితీయోపదేశకాండము 22:13, 20–21 ప్రకారం, వివాహ సమయంలో కన్యత్వాన్ని కోల్పోయినట్లు రుజువైన ఏ స్త్రీకైనా మరణశిక్ష విధించబడాలి. ఈ పరిస్థితిలో, హోషేయ తన పరిచర్యను వివాహంతో కాకుండా అంత్యక్రియలతో మొదలుపెట్టి ఉంటే మరింత సముచితంగా అనిపించి ఉండేది. ఈ సమస్యకు రెండు ప్రధాన పరిష్కారాలు/వివరణలు ఉన్నాయి: ఒకటి, హోషేయా వివాహాన్ని ఊహాజనితంగా భావించేది; మరొకటి, ఆ వివాహాన్ని అక్షరాలా జరిగినదిగా పరిగణించేది.

ఊహాత్మక దృక్పథం ప్రకారం, హోషేయ వివాహ చిత్రాలు కేవలం రూపకాలుగా, దేవునికి ఇశ్రాయేలుకు మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే ఇశ్రాయేలు ఆత్మీయ అవిశ్వాసాన్ని అలంకారికంగా తెలియజేసే మార్గాలుగా వివరించబడతాయి. ఈ దృక్పథం యొక్క ప్రయోజనం ఏమిటంటే, ఇది నైతిక, ధార్మిక సమస్యలను నివారిస్తూనే, వివాహ రూపకం ద్వారా అర్హతలేని ప్రజల పట్ల దేవుని ప్రేమ అనే వేదాంతపరమైన అంశాన్ని తెలియజేస్తుంది. అయితే, ఈ దృక్పథం యొక్క బలహీనత ఏమిటంటే, ఇది గ్రంథాధారిత ఆధారాల కంటే వేదాంతపరమైన సౌలభ్యంపై ఎక్కువగా ఆధారపడుతుంది.

హోషేయ వివాహానికి సంబంధించిన సాహిత్యపరమైన వ్యాఖ్యానాలలో అనేక రకాలున్నప్పటికీ, ఒక నిజమైన వివాహం జరిగిందనే విషయంలో అవన్నీ ఏకీభవిస్తాయి. అయితే, గోమెరు వ్యభిచారం యొక్క స్వభావం లేదా సమయంపై మాత్రం వాటి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ అంశంపై కొంతమంది వ్యాఖ్యాతలు ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. వారి వాదన ప్రకారం, హోషేయ గోమెరును పెళ్ళాడే నాటికే ఆమె వేశ్యగా ఉంది. దేవుడు ముందుగా ప్రకటించిన తన నైతిక నియమాలను పక్కనపెట్టి, అర్హత లేని పాపుల పట్ల తన కృపాపూరితమైన ప్రేమను బలంగా చాటిచెప్పడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడని ఈ దృష్టికోణం నొక్కి చెబుతుంది. 

మరికొందరు వ్యాఖ్యాతలు  గోమెరు వ్యభిచారం శారీరక వ్యభిచారాన్ని కాకుండా, దేవునికి అవిశ్వాసంగా ఇతర దేవతలను పూజించడమనే ఆత్మీయ విగ్రహారాధనకు ప్రతీక అని వాదిస్తారు. హోషేయ లైంగికంగా అనైతికమైన స్త్రీని వివాహం చేసుకున్నాడనే సమస్యను ఇది తొలగించినప్పటికీ, మరొక తీవ్రమైన సమస్యను సృష్టిస్తుంది. అదేమిటంటే, దేవుడు తన ప్రవక్తను ఒక విగ్రహారాధకురాలితో వివాహం చేసుకోవాలని ఆజ్ఞాపించినట్లు ఇది సూచిస్తుంది. మతాంతర వివాహాలపై దేవుని నిషేధం చాలా స్పష్టంగా ఉంది (ద్వితీయోపదేశకాండము 7:3–4).

“ప్రోలెప్టిక్ దృష్టికోణం” (proleptic view) అని పిలువబడే మరొక యథార్థ వివాహ వివరణ  ప్రకారం, గోమెరు వివాహం నాటికి పరిశుద్ధురాలిగానే ఉంది, అయితే ఆ తర్వాత ఆమె వేశ్యగా మారింది. కానీ ఆ గ్రంథ వచనం గోమెరు అప్పటికే ఏమై ఉందో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది, భవిష్యత్తులో ఆమె ఎలా మారుతుందో అనే ఊహను కాదు. మరొక పరిష్కారం ఏమిటంటే, “వ్యభిచారం” అనే పదాన్ని బాహ్య ప్రవర్తనకు బదులుగా, ఒక అంతర్గత లక్షణాన్ని వర్ణించేదిగా అర్థం చేసుకోవడం. ఇది గోమెరులో దాగి ఉన్న అనైతిక ధోరణిని సూచిస్తుంది; ఆమె పెళ్లయిన కొద్దికాలానికే అది బయటపడింది. హోషేయా 3:1 ప్రకారం, గోమెరు నిజంగా వ్యభిచారిణిగా మారింది, అంటే ఆమెలోని దురాశలు చివరికి శారీరక వ్యభిచారంగా వ్యక్తమయ్యాయి అని ఇది స్పష్టం చేస్తుంది. ఈ దృక్పథం ప్రకారం, దేవుడు హోషేయకు గోమెరు అంతరంగ స్వభావం గురించి ముందుగానే వెల్లడించాడు, అది వివాహ పవిత్రతకు ముప్పు కలిగిస్తుందని. హోషేయాకు ఆమె వల్ల తాను గాయపడతాడని మొదటి నుంచీ తెలిసినప్పటికీ, ఆమెను ప్రేమించడమే అతని ప్రేమలోని నిస్వార్థ స్వభావాన్ని స్పష్టం చేస్తుంది. విశ్వాసులకు ఇదే కీలకమైన ఆత్మీయపాఠం: దేవుడు మన గురించి అంతా తెలిసినప్పటికీ, మనల్ని ప్రేమిస్తాడు.

3. హోషేయ సందేశం క్రీస్తులో దేవుని కృపను ముందే ఊహించింది.

హోషేయా పశ్చాత్తాపపడమని ఇచ్చిన హెచ్చరికలను, ఆహ్వానాలను ప్రజలు పట్టించుకోలేదు, ఫలితంగా ఆ దేశంపై తీర్పు అనివార్యంగా మారింది. అయినప్పటికీ, ప్రవక్త సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు అజ్ఞానంగా, అవివేకంగా తిరస్కరించడం వల్ల వచ్చిన పరిణామాలు భవిష్యత్తులో రానున్న సువార్త కృపను ముందుగానే సూచించాయి. 2 రాజులు 15:29 ప్రకారం, దేవుని తీర్పును ముందుగా అనుభవించిన ప్రాంతం నఫ్తాలి దేశం. కానీ మత్తయి 4:12–16 ప్రకారం, ఇదే నఫ్తాలి ప్రాంతం యేసు పరిచర్యను మొదట చూసింది. హోషేయా కాలపు చీకటి క్రీస్తు వెలుగుకు దారి తీస్తుంది. ఆ చీకటి కాలం, వెలుగు ప్రకాశించే సంపూర్ణ సమయం వైపు దైవికంగా నిర్దేశించిన ఒక అడుగు. ఇది దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు ఎల్లప్పుడూ నెరవేరుతాయని నిరూపిస్తుంది.

ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

మైఖేల్ పి.వి. బారెట్
మైఖేల్ పి.వి. బారెట్
డా. మైకేల్ పి.వి. బారెట్ మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌లో ఉన్న ప్యూరిటన్ రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో పాత నిబంధన సీనియర్ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. "బిగినింగ్ విత్ మోసెస్: ఎ గైడ్ టు ఫైండింగ్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్" (Beginning with Moses: A Guide to Finding Christ in the Old Testament) మరియు "విస్డమ్ ఫర్ లైఫ్: 52 ఓల్డ్ టెస్టమెంట్ మెడిటేషన్స్" (Wisdom for Life: 52 Old Testament Meditations) వంటి అనేక పుస్తకాలు ఆయన రచించారు.