
సవాలుతో కూడిన సమయాల్లో ఒక తండ్రి యొక్క మార్గాలు
17/11/2026పశ్చాత్తాపం అంటే ఏమిటి?
మార్కు 1:14–15, యేసు ఆయన బహిరంగ బోధనా పరిచర్యలో పలికిన మొదటి మాటలను నమోదు చేస్తుంది: “కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి.” యేసు సువార్తను మొదట ప్రకటించినప్పుడు పాపము విషయమై మారుమనస్సు పొందమని పిలుపునిచ్చారు కాబట్టి, పశ్చాత్తాపం క్రైస్తవ శిష్యరికంలో ఒక ముఖ్యమైన అంశం అని మనం నిర్ధారించవచ్చు. యేసును విశ్వాసంగా అనుసరించాలంటే, మనం ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలగాలి: పశ్చాత్తాపం అంటే ఏమిటి?
జీవితానికి పశ్చాత్తాపం
వెస్ట్మిన్స్టర్ విశ్వాస ప్రకటన మరియు కాటుకిజమ్స్ “జీవమునకు దారితీసే పశ్చాత్తాపం”తో సహా అనేక విషయాలపై బైబిల్ బోధనను సహాయకరంగా సంగ్రహిస్తాయి. దీనిని ఇతర దైవశాస్త్రవేత్తలు కొన్నిసార్లు “సువార్త సంబంధమైన పశ్చాత్తాపం” అని పిలుస్తారు. ఈ రెండు పదబంధాలు, నిజమైన పశ్చాత్తాపాన్ని, అసలు నిజమైన పశ్చాత్తాపం కాని ప్రాపంచిక దుఃఖం నుండి వేరు చేస్తాయి. పౌలు, పశ్చాత్తాపం లేకుండా రక్షణకు నడిపించే దైవభక్తితో కూడిన దుఃఖం గురించి మాట్లాడతాడు మరియు మరణాన్ని మాత్రమే కలుగజేసే ప్రాపంచిక దుఃఖం గురించి మనలను హెచ్చరిస్తాడు (2 కొరింథీ. 7:10–11). సారాంశంలో, మన పాపం దేవుణ్ణి ఎలా కలత చెందించిందో మరియు ఇతరులను ఎలా బాధించిందో అనే దుఃఖాన్ని, పాపం యొక్క పర్యవసానాల గురించిన మన దుఃఖం నుండి ఆయన వేరు చేస్తున్నాడు. రక్షణనివ్వని పశ్చాత్తాపం అంటే కేవలం మన పాపాలు మనల్ని ఎలా బాధించాయో అనే దుఃఖం లేదా మనం తప్పు చేస్తూ పట్టుబడ్డామనే విచారం. ఇది ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నియమాలను ఉల్లంఘించినట్లు ఒప్పుకున్నప్పుడు కాకుండా, కుకీల డబ్బాలో చేయి దొరికినప్పుడు వ్యక్తపరిచే దుఃఖం లాంటిది. ఏశావు తన జ్యేష్ఠాధికారాన్ని, ఆశీర్వాదాన్ని వదులుకున్నప్పుడు చూపిన దుఃఖం వంటిదే ఇది — ఆ దుఃఖం, ఒక గిన్నెడు కూర కోసం దేవుని మంచితనాన్ని విడిచిపెట్టినందువల్ల కలిగినది కాదు, కానీ శ్రేష్ఠమైన వారసత్వాన్ని కోల్పోయినందువల్ల కలిగిన దుఃఖం (ఆది. 25:29–34; 27:1–41; హెబ్రీ. 12:16).
నిజమైన పశ్చాత్తాపం యొక్క భాగాలు
రక్షణనివ్వని, లోకానుసారమైన పశ్చాత్తాపానికి భిన్నంగా, జీవానికి దారితీసే పశ్చాత్తాపం పాపం నుండి మనల్ని దూరం చేస్తుంది, తద్వారా మనం క్రీస్తు ద్వారా దేవుని వద్దకు తిరిగి రాగలం. నిజమైన, రక్షణనిచ్చే పశ్చాత్తాపం యొక్క భాగాలను నిర్వచించడంలో వెస్ట్మిన్స్టర్ విశ్వాస ప్రకటన 15.2 మనకు సహాయపడుతుంది. అది ఇలా చెబుతుంది: “[జీవానికి దారితీసే పశ్చాత్తాపం] ద్వారా, ఒక పాపి, తన పాపాల యొక్క ప్రమాదాన్ని మాత్రమే కాకుండా, దేవుని పవిత్ర స్వభావానికి మరియు నీతిగల ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్న తన పాపాల యొక్క అపవిత్రతను మరియు అసహ్యాన్ని కూడా దృష్టి నుండి మరియు ఇంద్రియ జ్ఞానం నుండి దూరం చేసుకుని; పశ్చాత్తాపపడే వారి పట్ల క్రీస్తులో ఆయనకున్న కనికరాన్ని గ్రహించి, తన పాపాల కొరకు దుఃఖించి, వాటిని ద్వేషించి, వాటన్నిటి నుండి దేవుని వైపు తిరుగుతాడు, ఆయన ఆజ్ఞల మార్గాలన్నిటిలో ఆయనతో నడవాలని సంకల్పించి, ప్రయత్నిస్తాడు.”
మొదటగా, జీవమునకు దారితీసే పశ్చాత్తాపం, పాపం మనకు ప్రమాదకరమైనదని మాత్రమే కాకుండా, అది అపవిత్రమైనది మరియు అసహ్యకరమైనది అని కూడా గుర్తిస్తుంది. ఎందుకంటే అన్ని అతిక్రమాలు దేవుని నీతియుక్తమైన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడమే కాక, ఆయన పరిపూర్ణ పరిశుద్ధ స్వభావానికి అవమానం కూడా. కీర్తన 51:4లో ఇది ప్రతిబింబించడాన్ని మనం చూస్తాము, అక్కడ బత్షెబ మరియు ఊరియా విషయంలో తాను చేసిన పాపం కేవలం దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమని దావీదు ఒప్పుకుంటాడు. ఇది ఒక రకమైన అతిశయోక్తితో కూడిన కవిత. ఊరియాను హత్య చేయించడం స్పష్టంగా దేవునికి మరియు ఊరియాకు ఇద్దరికి వ్యతిరేకంగా చేసిన పాపమే. దావీదు ఉద్దేశం ఏమిటంటే, తన అతిక్రమాలు అన్నింటికంటే ముందుగా దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాలు. ప్రభువు పరిశుద్ధ సృష్టికర్త మరియు ధర్మశాస్త్ర ప్రదాత, మరియు మనం ఆయన స్వరూపంలో సృష్టించబడ్డాము కాబట్టి, ప్రతి పాపం ఇతరులకు వ్యతిరేకంగా చేసిన పాపం కాకముందు దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమే. ఇతరులకు వ్యతిరేకంగా చేసే పాపాలు దేవుని స్వరూపానికి వ్యతిరేకంగా చేసే పాపాలు, కాబట్టి, విస్తృత అర్థంలో, అవి దేవుణ్ణి బాధపెట్టే ప్రయత్నాలే. ఆర్.సి. స్ప్రౌల్ తరచుగా చెప్పినట్లుగా, అన్ని పాపాలు “విశ్వ ద్రోహమే”. అవి దేవుణ్ణి మరియు ఆయన ఆజ్ఞల స్థానంలో మనల్ని మరియు మన సొంత ప్రమాణాలను ప్రతిస్థాపించే ప్రయత్నాలే.
జీవమునకు దారితీసే పశ్చాత్తాపం మన పాపాలు ప్రధానంగా దేవునికి వ్యతిరేకమైనవని గుర్తించడమే కాకుండా, పశ్చాత్తాపపడేవారి పట్ల క్రీస్తులో దేవుని కరుణను కూడా గ్రహిస్తుంది. తద్వారా పాపి ప్రభువు వైపు తిరగడానికి, పాపాన్ని ఒప్పుకోవడానికి మరియు క్షమాపణ కోరడానికి ప్రేరేపించబడతాడు (WCF 15.2). కీర్తన 51లో కూడా మనం దీనిని చూస్తాము, అక్కడ దావీదు తన పాపాన్ని ఒప్పుకొని దేవుని కరుణ కోసం వేడుకుంటాడు. యూదా ఇస్కరియోతుకు మరియు అపొస్తలుడైన పేతురుకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా పరిగణించండి. ఇద్దరూ ఘోరంగా పాపం చేశారు; యూదా యేసును అధికారులకు అప్పగించాడు మరియు పేతురు తాను యేసు శిష్యుడనని నిరాకరించాడు (మత్తయి 26:14–16, 69–74). ఇద్దరూ తమ పాపం గురించి విచారం వ్యక్తం చేశారు (మత్తయి 26:75; 27:3–4). అయినప్పటికి, యూదా పాపం పట్ల విచారం ఆత్మహత్యకు దారితీయగా, పేతురు విచారం పరిచర్యకు పునఃస్థాపించబడటానికి దారితీసింది (మత్తయి 27:5–10; యోహాను 21:15–19). ఈ వ్యత్యాసానికి కారణం ఏమిటి? తన పాపం ఉన్నప్పటికి, పేతురు యేసు వద్దకు వస్తూనే ఉన్నాడు; మొదట ఖాళీ సమాధిని చూడటానికి, ఆ తర్వాత సముద్ర తీరంలో ఆయనతో కలిసి భోజనం చేయడానికి వచ్చాడు (యోహాను 20:1–10; 21:1–14). పశ్చాత్తాపపడేవారి పట్ల ఆయన కనికరం చూపుతాడని తెలుసుకొని పేతురు యేసు వైపు పరుగెత్తాడు; రక్షకుని కనికరాన్ని నమ్మని యూదా, యేసు నుండి పారిపోయి తన చేతుల మీదుగానే మరణానికి గురయ్యాడు.
చివరిగా, జీవమునకు దారితీసే పశ్చాత్తాపంలో, ఒక పాపి తన పాపాల గురించి దుఃఖించి, వాటిని ఎంతగానో ద్వేషిస్తాడు. తద్వారా, దేవునికి విధేయత చూపడానికి ఒక కొత్త సంకల్పంతో వాటి నుండి వైదొలగి, ఆ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి తగిన ప్రయత్నం చేస్తాడు (WCF 15.2). మరో మాటలో చెప్పాలంటే, పశ్చాత్తాపం అంటే కేవలం పాపం చేసినందుకు విచారిస్తున్నామని చెప్పి, ఆ తర్వాత తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం కాదు. మనం అంధకార కార్యములను విడిచిపెట్టి, క్రీస్తును ధరించుకోవాలి (రోమా 13:11–14). మనం క్రీస్తులో నూతన సృష్టి అని జ్ఞాపకం ఉంచుకొని, తత్ఫలితంగా, మనము ఉన్న నూతన సృష్టి వలె జీవించడానికి ప్రయత్నించాలి. పాపం నుండి ఈ వైదొలగడం మన మార్పులో నిశ్చయంగా జరుగుతుంది, కాని ఆ తర్వాత మన జీవితాంతం ప్రతిరోజూ కొనసాగుతుంది. మనకు పాపం లేదని మనం చెప్పుకుంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటాము. కాని మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, దేవుడు నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపాలను క్షమించి, సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును(1 యోహాను 1:8–9).
పశ్చాత్తాపం యొక్క భాగ్యం మరియు కర్తవ్యము
మనం ఒకే పాపాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు చేశామన్నంత మాత్రాన, మనం నిజంగా పశ్చాత్తాపపడటం లేదని అర్థం కాదు. మనం మన పాపాన్ని ప్రేమిస్తూ, దానిని ఆపడానికి ఏ ప్రయత్నమూ చేయకపోతే, మన పశ్చాత్తాపం యొక్క ప్రామాణికతను మనం ప్రశ్నించుకోవాలి. క్రీస్తును ఎరిగిన వారందరికి, జీవమిచ్చే పశ్చాత్తాపం అనేది నెరవేర్చవలసిన ఒక కర్తవ్యము మరియు మన రక్షకునితో నిరంతర సహవాసంలో కొనసాగడానికి అనుమతించే ఒక భాగ్యం. మనం పాపాన్ని ద్వేషించి, క్షమాపణ కోరి, క్రీస్తు మార్గాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించకుండా వాటికి లోబడటానికి కృషి చేద్దాం.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్లో ప్రచురించబడింది.


