
పదహారవ శతాబ్దంలో విమోచన శాస్త్రాన్ని సంస్కరించుట
14/07/2026ఆరోహణ కీర్తనలను ఎలా చదవాలి
కీర్తనల గ్రంథంలోని ఐదవ భాగంలో కనిపించే పదిహేను కీర్తనల (120–134) శీర్షికే ఆరోహణ కీర్తనలు. ఆరోహణ కీర్తనలుగా, లేదా “పైకి వెళ్ళే” కీర్తనలుగా, పస్కా, వారాల పండుగ, మరియు పర్ణశాలల పండుగ అనే మూడు వార్షిక యాత్రికుల పండుగల కోసం ఇశ్రాయేలు స్త్రీపురుషులు యెరూషలేముకు ప్రయాణించినప్పుడు, ఈ కీర్తనల సంకలనం వారికి ఒక ఇష్టమైన గీతాల సంకలనంలా ఉండేది (నిర్గమకాండము 23:14–17; ద్వితీయోపదేశకాండము 16:16 చూడండి).
విశ్వాసంలో మన పూర్వీకుల వలె, మనం కూడా ఒక యాత్రలో ఉన్నాము. మన ప్రయాణం ఈ పతనమైన లోకం గుండా నూతన యెరూషలేముకు మనల్ని తీసుకువెళుతుంది. కష్టమైన మరియు తరచుగా ప్రమాదకరమైన ఈ మార్గంలో, కీర్తనలు మనకు జ్ఞానవంతమైన మార్గదర్శకత్వాన్ని మరియు గొప్ప ఆధ్యాత్మిక పోషణను అందిస్తాయి.
ఈ కీర్తనలు మన ఆధ్యాత్మిక యాత్రలో మనకు సహాయపడేవి అయితే, వాటిని మనం ఎలా చదవాలి? మంచి ఆరంభాన్ని పొందడానికి ఐదు సూచనలు మనకు సహాయపడతాయి.
1. ప్రతి కీర్తనను అనేకసార్లు చదివి, దాని ప్రాథమిక నిర్మాణాన్ని రూపురేఖలుగా రాసుకోండి.
ఈ కీర్తనలు హెబ్రీ పద్యభాగము రాయబడ్డాయి కాబట్టి, ఈ రకమైన సాహిత్యాన్ని అర్థం చేసుకునే సూత్రాల గురించి మీరు తెలుసుకోవాలి. సమాంతర వాక్య నిర్మాణం మరియు కీర్తనలోని వాక్యాల మధ్య ఉండే వివిధ సంబంధాల వంటి అంశాలు, ప్రతి కీర్తన యొక్క ప్రాథమిక అర్థాన్ని గ్రహించడంలో మీకు మంచి ఆరంభాన్నిస్తాయి. ఈ సూత్రాల గురించి మరింత సమాచారం కోసం, మాథ్యూ హెచ్. పాట్టన్ రాసిన “హెబ్రీ పద్యభాగాని ఎలా చదవాలి” (How to Read Hebrew Poetry) అనే వ్యాసాన్ని చూడండి.
2. ఈ కీర్తనలలో కనిపించే చిత్రాలను మెచ్చుకోవడం నేర్చుకోండి.
ఒక చిత్రీకరణను అర్థం చేసుకునేటప్పుడు, మీరు మూడు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. మొదటిది, చర్చనీయాంశం ఏమిటి? రెండవది, ఆ అంశాన్ని వివరించడానికి కీర్తనకారుడు ఏ చిత్రాన్ని ఉపయోగించారు? మూడవది, ఆ అంశానికి మరియు ఆ చిత్రీకరణనకు మధ్య ఉన్న పోలిక ఏమిటి?
దేవుని ప్రజల ఐక్యతను ప్రధాన ఇతివృత్తంగా కలిగిన 133వ కీర్తనలో రెండు అద్భుతమైన ఉపమానాలు కనిపిస్తాయి. అందులో మొదటిది ‘తైలం’:
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు! ఎంత మనోహరము!
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి
అతని అంగీల అంచువరకు దిగజారిన
పరిమళ తైలమువలె నుండును (కీర్తన 133:1–2)
ఐక్యత అనేది ఇతివృత్తం మరియు తైలం అనేది చిత్రం అయితే, వాటి మధ్య ఉన్న పోలిక ఏమిటి? దావీదు ప్రస్తావించిన తైలం పవిత్రమైన అభిషేక తైలం (నిర్గమకాండము 30:22–38). అది మంచి సువాసన కలిగి ఉండి, ఆహ్లాదకరమైన పరిమళాన్ని వెదజల్లేది. దేవుని ప్రజల మధ్య ఉండే ఐక్యత అటువంటి సువాసనభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.
రెండవ చిత్రం మంచు:
సీయోను కొండలమీదికి దిగి వచ్చు
హెర్మోను మంచువలె నుండును.
ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని
యెహోవా సెలవిచ్చి యున్నాడు. (కీర్తన 133:3)
మంచు గడ్డిని పునరుజ్జీవింపజేసి, నూతనపరిచినట్లే, విశ్వాసులు దేవుని పని విషయమై ఒకే హృదయాన్ని, మనస్సును పంచుకున్నప్పుడు, వారు ఉల్లాసాన్నిచ్చే ఆత్మ నవీకరణను పొందుతారు.
3. ఈ కీర్తనలను యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతగా చదవండి.
మొదటి రెండు మార్గదర్శకాలు ప్రతి కీర్తనలోని సాహిత్య లక్షణాలపై దృష్టి పెట్టాలని మనల్ని కోరుతున్నాయి. మూడవ మార్గదర్శకం మన దృష్టిని సాహిత్యపరమైన అంశాల నుండి దైవజ్ఞానశాస్త్రపరమైన అంశాల వైపు మళ్లిస్తుంది. యేసు ఇలా అన్నారు, “మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నా గూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెను” (లూకా 24:44). కీర్తనలన్నీ క్రీస్తు గురించే. కీర్తన 1 విషయంలో ఈ భావనను గ్రహించడానికి పాఠకులకు సాధారణంగా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే యేసు వాక్యవిషయములో ధన్యుడు. కీర్తన 22లో, ఆయన పరిత్యజించబడినవాడు. కీర్తన 23లో ఆయన మంచి కాపరి.
అయితే ఆరోహణ కీర్తనలలో మనం యేసును ఎక్కడ చూస్తాము? ఆయన ఒక నమ్మకమైన యాత్రికుడిగా యెరూషలేముకు వెళ్లే మార్గంలో ఈ కీర్తనలను పాడుతూ మనకు కనిపిస్తాడు. పన్నెండేళ్ల వయసులో, పస్కా పండుగ కోసం ఆయన మొదటిసారి యెరూషలేముకు వెళ్ళినప్పటి నుండి (లూకా 2:41–51), రక్షకుడు క్రమం తప్పకుండా యాత్రికుల పండుగలను జరుపుకున్నారు (యోహాను 2:13; 6:4; 7:1–24; 13:1 చూడండి). ఆయన సిలువ వేయబడే సమయం సమీపించినప్పుడు, ప్రభువు పస్కా పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు (లూకా 9:51). తన విశ్వాస్యత శ్రమకు మరియు మరణానికి దారితీస్తుందని తెలిసినప్పటికీ, ఆయన ఒక దృఢమైన యాత్రికుడిగా ఉన్నారు (లూకా 9:21–22). మీరు ఈ కీర్తనలను చదివినప్పుడు, యేసు వాటిని ఎలా పాడి ఉండేవారో లేదా అవి మిమ్మల్ని యేసు గురించి పాడేలా ఎలా నడిపిస్తాయో ప్రశ్నించుకోండి.
4. కీర్తన యొక్క సందర్భాన్ని తెలుసుకున్న తర్వాత, దానిని ఆచరణలో పెట్టే అంశం వైపు మళ్లండి.
నాలుగవ మార్గదర్శకం సాహిత్య, దైవశాస్త్ర విషయాల నుండి వ్యక్తిగత అనువర్తన అంశాలపై దృష్టి సారిస్తుంది. పవిత్ర నగరానికి వెళ్తున్న ఒక ఇశ్రాయేలీయుని స్థానంలో మిమ్మల్ని మీరు ఉంచుకుని ఈ ప్రశ్నలు వేసుకోండి:
- నూతన యెరూషలేముకు ప్రయాణించే విశ్వాసపాత్రమైన యాత్రికుడిగా ఉండటం అంటే నాకు ఏమిటి?
- నేను ఎదుర్కొనే అడ్డంకుల మధ్య ఎలా ప్రయాణించాలి (కీర్తనలు 121:1 చూడండి)?
- నా జీవితంలో ఆరాధన పట్ల నిరీక్షణ మరియు ఆనందకరమైన వేడుక ఎలా ఉండాలి?
5. ఈ కీర్తనలలో కనిపించే దేవుని ప్రజల సామూహిక పాత్రను గుర్తించి, అభినందించడం నేర్చుకోండి.
ఇశ్రాయేలీయులు పండుగల కోసం యెరూషలేముకు ప్రయాణించినప్పుడు, వారు గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. పస్కా పండుగ నుండి నజరేతుకు తిరిగి వస్తున్నప్పుడు, మరియ, యోసేపులు మొదట యేసును చూడలేకపోయినప్పుడు వారు చింతించలేదు, ఎందుకంటే ఆయన ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న జనసమూహంలోని ఇతరులతో ఉన్నాడని వారు భావించారు (లూకా 2:43–44). మనలో ప్రతి ఒక్కరం యాత్రికులే అయినప్పటికీ, ఈ ప్రయాణంలో మనం ఒంటరిగా ప్రయాణించడం లేదు. అందువల్ల, మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి (కీర్తన 122:1), మనతో ప్రయాణిస్తున్న వారందరి క్షేమం గురించి శ్రద్ధ వహించాలి (కీర్తన 122:8), మనమందరం కష్టాలను ఎదుర్కొంటామని గ్రహించాలి (కీర్తన 123:2–4), మరియు సహవాసంలోని ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి (కీర్తన 133).
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


