
పరిచర్యలో కలిగే తీవ్రమైన అలసటను ఎదుర్కోవడం ఎలా?
28/04/2026సంతానాన్ని కోల్పోయినప్పుడు దేవుని ఆదరణ
పరలోకానికి ఈవతల ఉన్న ఈ లోకంలో క్రైస్తవులకు ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాలు లభిస్తాయని ఎక్కడా వాగ్దానం చేయబడలేదు. పాపము చేత పతనమైన ఈ లోకంలో మనం ఎదుర్కోవాల్సిన చేదు నిజం ఏమిటంటే, మనమందరం రకరకాల నష్టాలను అనుభవిస్తాము: అది మన ఆరోగ్యం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఒక అనుబంధం కావచ్చు, లేదా వీటన్నిటికంటే మించి మనకు అత్యంత ప్రియమైన వారిని మరణం ద్వారా కోల్పోవడం కావచ్చు. మనం ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, ఆ నష్టాన్ని తప్ప వేరే దేనినీ చూడలేని స్థితిలో ఉండిపోతాము. ఆ దుఃఖం మనల్ని ఎంతగా ఆవహిస్తుందంటే, చివరికి జీవమిచ్చే లేఖన సత్యాలను కూడా మనం గ్రహించలేనంతగా ఆ వేదన మనల్ని ముంచెత్తుతుంది.
నా కుమార్తె లీలా, తన ప్రసవానికి సరిగ్గా ఒక వారం ముందు మృతశిశువుగా జన్మించినప్పుడు, ఈ భయంకరమైన వేదనను నేను స్వయంగా అనుభవించాను. ఆ సమయంలో నా దృష్టి అంతా నేను కోల్పోయిన ఆ బిడ్డపై, ఆ నష్టం కలిగించిన శోకంపైనే పూర్తిగా నిలిచిపోయింది: ఎన్నో ఆశలు పెట్టుకున్న నా బిడ్డ ప్రాణం లేకుండా పుట్టింది; ఆమెకు ఆహారం తినిపించే, బట్టలు తొడిగే లేదా అల్లారుముద్దుగా చూసుకునే భాగ్యం నాకు ఇక లేదు; నా కుమారుడు బెన్ ఇక ఏకైక సంతానంగానే మిగిలిపోవాల్సి వస్తుంది; నేను మళ్ళీ సంతానలేమి సుడిగుండంలో పడిపోతానా; నా ముద్దుల కూతురు సమాధిలో పాతిపెట్టబడింది; ఇలా నా ఆత్మ నేత్రాలు ఒక భయంకరమైన యదార్థం నుండి మరొక దానికి వెళ్తూ, ఆ ఆగని వేదనలోనే మునిగిపోయాయి. కానీ, నా నష్టాన్ని మరియు దానిలోని వివిధ కోణాలను మాత్రమే చూస్తూ ఉండిపోయిన నేను నా దుఃఖానికి ఆదరణను, నా చీకటికి వెలుగును ప్రసాదించగలిగే ఏకైక ప్రభువు వైపు చూడటం మానేశాను. దాదాపు నిరాశలో మునిగిపోయిన నాకు ఆ స్థితి నుండి బయటపడే మార్గాన్ని కీర్తనల రచయిత్రి ‘హెలెన్ లెమ్మెల్’ ఈ విధంగా గుర్తుచేశారు:
యేసు వైపు నీ కనులెత్తుము,
ఆయన అద్భుతమైన ముఖమును తేరి చూడుము;
ఆయన మహిమ, కృపల వెలుగులో
ఈ లోక సంబంధమైనవన్నీ వింతగా మసకబారిపోవును.
నేను ఎప్పుడైతే నా దృష్టిని యేసు వైపు మళ్లించానో, ఆయన వెలుగు నాలోని చీకటిని ప్రకాశింపజేయడమే కాక నా బిడ్డను కోల్పోయిన ఆ తీరని లోటు కూడా ఆ వెలుగులో వింతగా మసకబారిపోయింది. ఆయన వైపు చూడటం వల్ల నా వేదన ఏమీ మాయమైపోలేదు (అది ఒక మత్తుమందులా నొప్పి తెలియకుండా చేయలేదు), కానీ ఆ వేదన మధ్యలో అది నాకు అపారమైన ఆదరణను, వర్ణనాతీతమైన శాంతిని ప్రసాదించింది.
కనికరము గల రక్షకుడు
నా కుమార్తెను కోల్పోయిన ఆ వేదనలో నేను యేసు వైపు తిరిగినప్పుడు, అపారమైన కనికరముతో నిండిన ఒక రక్షకుడిని నేను కనుగొన్నాను. రకరకాల నష్టాల వల్ల గాయపడిన ప్రజల పట్ల యేసు హృదయం ఎంత సున్నితంగా స్పందిస్తుందో సువార్త గ్రంథాలు ఎంతో అద్భుతంగా సాక్ష్యమిస్తున్నాయి. దీనికి అత్యంత ప్రశస్తమైన ఉదాహరణ, కుష్ఠువ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి తనను శుద్ధునిగా చేయమని వేడుకున్నప్పుడు యేసు స్పందించిన తీరు. మార్కు తన సువార్తలో ఈ సంఘటనను ఇలా నమోదు చేశాడు: “యేసు కనికరపడి, చెయ్యి చాపి అతనిని ముట్టి—‘నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము’ అని అతనితో చెప్పెను” (మార్కు 1:41). లేవీయకాండములోని ధర్మశాస్త్ర విధులను బట్టి ఆ వ్యక్తి అపవిత్రుడు (లేవీ. 13); అందుకే అతను సమాజం నుండి వెలివేయబడ్డాడు. అంటరానివానిగా పరిగణించబడిన అతనికి, ఇతరులకు మధ్య ఎల్లప్పుడూ ఒక భౌతిక దూరం ఉంటూనే ఉండేది. కానీ యేసు, కనికరముతో నిండినవాడై, ఆ ఎడబాటును చెరిపివేస్తూ తన చేయి చాపి అతనిని స్పృశించాడు. ఆ వ్యక్తి మరొక మానవ స్పర్శను అనుభవించి ఎన్ని ఏళ్లయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి!
పాపము చేత పతనమైన ఈ లోకపు భారంతో, జీవితంలోని విచ్ఛిన్నతతో కొట్టుమిట్టాడుతున్న వారి జీవితాలను యేసు ఏ విధంగా స్పృశించారో సువార్త గ్రంథాలు మనకు అనేక ఉదాహరణలను అందిస్తున్నాయి. ఆయన కనికరముతో, తనకున్న ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిని (లూకా 7:11-15), రోగులను (మత్తయి 14:14), ఆకలితో ఉన్నవారిని (మత్తయి 15:32), అంధులను (మత్తయి 20:30-34), మరియు కాపరి లేని గొర్రెల వలె విసిగి వేసారిన నిస్సహాయులను (మత్తయి 9:35-36) వెదకి ఆదరించాడు. ఈ వృత్తాంతాలను మనం పరిశీలించినప్పుడు, బాధలో ఉన్న వారి పట్ల ఎటువంటి స్పందన లేని రక్షకుడిని మనం చూడము; దానికి బదులుగా, మన వేదనను చూసి చలించిపోయి, కనికరముతో మన వైపు “తన చేయి చాపి” ఆదుకునే రక్షకుడినే మనం చూస్తాము.
కన్నీరు కార్చిన రక్షకుడు
బహుశా బైబిలులోని అత్యంత చిన్న వచనమైన “యేసు కన్నీళ్లు విడిచెను” (యోహాను 11:35) అనే మాటలో కనిపించినంతగా, యేసుప్రభువు యొక్క సున్నితమైన హృదయం మరెక్కడా మనకు కనిపించదు. తన స్నేహితుడైన లాజరు మరణించి ఉన్న ఆ శోకతప్తమైన ఇంటికి ఆయన చేరుకున్నప్పుడు, యేసు ఏదో నామమాత్రంగా ఒక కన్నీటి బొట్టును రాల్చలేదు – ఆయన విలపించాడు. కొద్ది సేపట్లోనే తాను లాజరును మరణం నుండి తిరిగి బ్రతికించబోతున్నానని ఆయనకు ముందే తెలిసినప్పటికీ, మరణం సృష్టించిన ఆ విచారాన్ని మరియు పాపపు పతనం పట్ల కలిగిన లోతైన ఆగ్రహాన్ని ఆయన స్వయంగా అనుభవించాడు.
లీలా మృతశిశువుగా జన్మించిన తర్వాత, నా జీవితంలో మునుపెన్నడూ లేనంతగా నేను విలపించాను. అయితే, నా రక్షకుడు సైతం మరణం సృష్టించిన ఆ వేదనను స్వయంగా చూశారని, ఆయన కూడా కన్నీరు కార్చారని తెలుసుకోవడం నాకు ఎంతో ఆదరణనిచ్చింది. ఈ వచనంపై తన వ్యాఖ్యానంలో జాన్ కాల్విన్ ఇలా వ్రాశారు: “మన కష్టాల పట్ల ఆయన ఎంతగా చలిస్తారంటే, ఆ బాధలను ఆయన స్వయంగా అనుభవిస్తున్నంతగా మనతో పాలుపంచుకుంటాడు.” మీ నష్టంలోనైనా, నా నష్టంలోనైనా, మన ప్రభువైన యేసు మన దుఃఖాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఆయన శరీరధారియైన వాక్యము; ఆయన తన హృదయాన వేదనను అనుభవించాడు, తన బుగ్గలపై కన్నీటి తడిని చవిచూశాడు.
విజయశీలుడైన రక్షకుడు
మన కష్టకాలంలో యేసుప్రభువు మనల్ని ఆదరిస్తాడని, మనతో కలిసి కన్నీరు కారుస్తాడని తెలుసుకోవడం మనకు గొప్ప ఉపశమనాన్ని ఇస్తుంది; అయితే, కేవలం అది మాత్రమే సరిపోదు. ఒకవేళ మన రక్షకుడు మన పక్షాన నిలిచి, చివరికి వాటన్నిటినీ జయించలేకపోతే, మన శ్రమలలోను, దుఃఖంలోను ఆయన మనతో కలిసి నడిచినా ప్రయోజనం ఏముంటుంది? యేసు మరణాన్ని గెలిచిన విజేత కాకపోతే, అంతిమంగా ఆయన ఇచ్చే ఆదరణకు అర్థమే ఉండదు. మనం తీరని వేదనలో ఉన్నప్పుడు మనకు కేవలం మనల్ని చూసి జాలిపడే ఒక సానుభూతిపరుడు మాత్రమే సరిపోడు – మనల్ని ఆ వేదన నుండి విడిపించే రక్షకుడు కావాలి.
మన వేదనలకు కేవలం పైపై పూత పూసి (Band-Aid) వదిలేయడానికి యేసు రాలేదు; ఆయన మన సమస్త బాధలకు మూలకారణమైన ‘పాపము’ అనే వేరునే తొలగించడానికి వచ్చాడు. పతనమైన ఈ లోకపు శాపాన్ని తుడిచివేయుటకై, “ఆయన స్వయంగా తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసెను” (1 పేతురు 2:24). పాపము తన వికారమైన ముద్రను ఈ సృష్టిపై వేయకముందు, అసలు లోకంలో నష్టమనేదే లేదు; అక్కడ ఏడ్పు గానీ, నిరాశ గానీ, విచ్ఛిన్నత గానీ, మరణం గానీ లేవు. యేసు లాజరును మరణం నుండి జీవానికి పిలిచినప్పుడు, తాను ఏ కార్యార్థం భువిపైకి వచ్చాడో మనకు స్పష్టం చేశాడు: “మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారానే నశింపజేయుటకు” ఆయన వచ్చాడు (హెబ్రీ. 2:14). క్రీస్తు మరణాన్ని జయించి మూడవ దినమున సజీవుడిగా తిరిగి లేచాడు కాబట్టి, రాబోయే ఆ నిత్యత్వపు లోకం గురించి మనకు ఒక నూతన నిరీక్షణను ప్రసాదించాడు. అక్కడ దుఃఖము, నిట్టూర్పులు పారిపోవును; మరణము గానీ, ప్రియమైన వారిని కోల్పోయే నష్టము గానీ ఇక ఏమాత్రం ఉండవు.
ఆదరణకర్తయైన రక్షకుడు
లీలా నా గర్భంలోనే మరణించిందని తెలిసిన ఆ క్షణంలో, నన్ను పూర్తిగా కబళించివేసేంతటి అగాధమైన దుఃఖంలో నేను మునిగిపోయాను. అయితే, పాపము, వేదన మరియు మరణంతో నిండిన ఈ లోకంలో మనపై కనికరము చూపే, మనతో కలిసి కన్నీరు కార్చే మరియు మరణాన్ని జయించిన మహా విజేతయైన యేసు వైపు నేను కనులెత్తినప్పుడు, నాకు నిజమైన ఆదరణ లభించింది. బ్రతుకునందైనా, మరణమందైనా నాకు కలిగే ఏకైక ఆదరణ ఆయనే అని నేను గ్రహించాను. ఎప్పుడైతే నా దృష్టిని ఆయనపై నిలిపానో, అప్పుడు నా నష్టం సైతం “ఆయన మహిమ, కృపల వెలుగులో వింతగా మసకబారిపోయింది.”
ఓ ఆత్మా! నీవు అలసిపోయి, భారముతో కుంగిపోతున్నావా?
నీవు చూస్తున్న ఈ గాఢాంధకారంలో వెలుగు కిరణమే కనిపించుటలేదా?
రక్షకుని వైపు ఒక్కసారి చూడుము; అక్కడ నీకు వెలుగు లభించును.
ఆయనలో జీవముంది; అది పరిపూర్ణమైనది మరియు సంపూర్ణ విడుదల గలది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ (Ligonier Ministries) బ్లాగ్‌లో ప్రచురించబడింది.


