The Christian Life as Pilgrimage

క్రైస్తవ జీవితం ఒక పరలోక యాత్ర

17/03/2026
5 Things You Should Know About Holiness

పరిశుద్ధత గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

24/03/2026
The Christian Life as Pilgrimage

క్రైస్తవ జీవితం ఒక పరలోక యాత్ర

17/03/2026
5 Things You Should Know About Holiness

పరిశుద్ధత గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

24/03/2026

పాపంతో పోరాటం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు

5 Things You Should Know About Fighting Sin

1. ఈ ముప్పు వాస్తవమైనది

పాపముతో మనం చేసే పోరాటము ఊహజనితమైనది కాదు; అది అత్యంత ప్రమాదకరమైన వాస్తవము. లోకము, శరీరము, మరియు అపవాది ద్వారా మనం ఎదుర్కొనే శోధనలు ఎంతో తీవ్రమైనవని లేఖనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి సామాన్యమైనవి కావు, మన ఆత్మీయ క్షేమాన్ని దెబ్బతీసే బలమైన శత్రువులు.

లోకం మన పక్షాన లేదు. ఈ లోక వ్యవస్థ మనల్ని ఒక నిర్దిష్ట దిశలో నెట్టడానికి తరచుగా కుట్ర పన్నుతుంటుంది. అందుకే, “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక…” అని పౌలు క్రైస్తవులందరినీ హెచ్చరిస్తున్నాడు (రోమా 12:2). లోకం దేనికి విలువనిస్తుంది, దేనిని సహిస్తుంది, మరియు విజయాన్ని ఎలా నిర్వచిస్తుంది అనేది సంస్కృతిని బట్టి మారవచ్చు; కానీ ప్రతి అడుగులోనూ దానిని ఎదిరించాలి మరియు లేఖనాలతో సరిచూసుకోవాలి.

మన శరీరం కూడా మనకు విరోధంగా పోరాడుతుంది. స్వభావరీత్యా మనం పాపులం; దేవునికి దూరంగా ఉంటూ మన పాపపు ఇచ్ఛల వైపు మళ్ళిపోతాము. మనం పొందే ‘నూతన జన్మ’ అనే అద్భుత కార్యము ద్వారా దేవుడు తన కృపతో మనలోని కొన్ని పాపపు అలవాట్లను తొలగించినప్పటికీ, మన పాత పాపపు స్వభావము యొక్క ఆనవాళ్లు ఇంకా మనలో మిగిలే ఉంటాయి. మన హృదయాలను మనం గుడ్డిగా అనుసరించలేం; అవి మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయని ఆశించలేం.

ఇక అపవాది విషయానికి వస్తే, “మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు” (1 పేతురు 5:8) అని లేఖనాలు మనల్ని మెలకువగా ఉండమని హెచ్చరిస్తున్నాయి. మిమ్మల్ని చంపడానికి ఒక ఆరితేరిన హంతకుడు నియమించబడ్డాడని మీకు తెలిస్తే, మీరు నిరంతరం ఎంత జాగ్రత్తగా ఉంటారు. ప్రతి తలుపుకు గడియ వేస్తారు, ప్రతి మూలనా వాడు ఉన్నాడేమోనని నిశితంగా తనిఖీ చేస్తారు. సాతాను ఏ మనిషి కంటే కూడా అత్యంత శక్తివంతుడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ నిబ్బరమైన బుద్ధి కలిగి, మెలకువగా ఉండాలి.

2. మీరు గుర్తించకముందే శోధన మొదలవుతుంది

మనం పాపంలో పడిపోతున్నామంటే, దానికి కారణం తరచుగా మనం శోధన రాకముందే మనల్ని మనం కాపాడుకోవడంలో విఫలం కావడమే. పాపానికి లోనయ్యే బలహీనత మనకు లేదన్నట్లుగా మనం మన దైనందిన కార్యకలాపాల్లో మునిగి నిర్లక్ష్యంగా జీవించకూడదు. తరచుగా, పాపంపై పోరాడటానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే, మనల్ని శోధన వైపు నడిపించే అవకాశమున్న స్థలాలకు, పనులకు మరియు పరిస్థితులకు దూరంగా ఉండటమే. కొందరి విషయానికొస్తే, వారు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండటం అవసరం; ఎందుకంటే ఒంటరిగా ఖాళీగా ఉన్నప్పుడు కలిగే విసుగు వారిని శోధనల్లోకి నడిపిస్తుంది. మరికొందరు, నిర్దిష్ట వ్యక్తులకు దూరంగా ఉండవలసిన అవసరం ఉంది; ఎందుకంటే అట్టి వారి ప్రభావం లేదా ప్రేరేపణ వారిని పాపపు మార్గంలోకి నడిపిస్తుంది. మరికొందరు అపవిత్రమైన విషయాలకు  దూరంగా ఉండటానికి, సాంకేతికపరమైన లేదా వ్యక్తిగతమైన రక్షణ పరిమితులను  ఏర్పాటు చేసుకోవడం అవసరం. మనం ఎన్నటికీ చూడకూడని విషయాలు, వెళ్ళకూడని ప్రదేశాలు మరియు ఒంటరిగా ఉండకూడని సమయాలు కొన్ని ఉన్నాయి. ఈ వ్యక్తులు, ప్రదేశాలు లేదా సందర్భాలు స్వతహాగా నేరుగా పాపభరితమైనవి కాకపోయినప్పటికీ, వాటితో సంబంధం కలిగి ఉండటం మనల్ని శోధనలకు లోనయ్యేలా చేస్తుంది. ఇది చివరకు మనం పాపంలో పడిపోయేలా చేసే గొప్ప ప్రమాదానికి దారితీస్తుంది.

3. పాపముతో పోరాటం అంతరంగాన్ని (హృదయాన్ని) లక్ష్యం చేసుకోవాలి

పాపం అంతరంగం నుండే వస్తుందని ప్రభువైన యేసు స్పష్టం చేశాడు (మత్తయి 15:19). మన హృదయాలే పాపానికి మూలస్థానం, కాబట్టి పాపంపై మనం చేసే పోరాటం మన ‘అంతరంగ పురుషుని’ లక్ష్యంగా చేసుకోవాలి. దేవుని వాక్యానుసారంగా మన హృదయాలను పెంపొందించుకోవడంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

కీర్తన 119:11 ఈ విషయాన్ని ఎంతో సంక్షిప్తంగా, స్పష్టంగా చెబుతోంది:

నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు,

నా హృదయములో నీ వాక్యము ఉంచుకొనియున్నాను.

తనను పాపం నుండి కాపాడుకోవాలంటే, తన హృదయం దేవుని వాక్యంతో నిండి ప్రవహించాలని కీర్తనకారుడికి తెలుసు. మనందరి విషయంలోనూ ఇది నిజం. 

మన హృదయాలే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాయని భావించి వాటిని మనం గుడ్డిగా అనుసరించలేము. అందుకే ప్రతిరోజూ బైబిలు చదవడం, వాక్యాన్ని కంఠస్థం చేయడం మరియు దేవుని వాక్యానుసారంగా ప్రార్థించడం ఎంతో ముఖ్యం. మన అంతరంగ ఆలోచనలే మన మాటల్లోనూ, క్రియల్లోనూ ప్రతిబింబిస్తాయి. ఈ సత్యాన్ని దృష్టిలో ఉంచుకుని అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి” (ఫిలిప్పీ 4:8).

4. త్రిత్వ దేవుడు మనల్ని బలపరుస్తాడు

క్రైస్తవులుగా మనం ఎదుర్కొనే శోధనలు ఎంత తీవ్రమైనవైనప్పటికీ, ప్రభువు మన పక్షాన ఉన్నాడనేది మనకున్న గొప్ప ధైర్యం. నూతన జన్మ పొందిన విశ్వాసుల గురించి బైబిల్ ఇలా చెబుతోంది: “మన మందరమును ముసుకులేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలిక గానే మార్చబడుచున్నాము” (2 కొరింథీ 3:18).

“మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించును” అనే వాగ్దానం క్రైస్తవులకు ఉంది (ఫిలిప్పీ 1:6). మరొక చోట, “మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే” అని వ్రాయబడి ఉంది (ఫిలిప్పీ 2:13).

వీటికంటే మించి, మనకు ప్రత్యేకంగా ఇలా చెప్పబడింది: 

సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింప లేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంత కంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడ తప్పించుకొను మార్గమును కలుగజేయును (1 కొరింథీయులు 10:13). 

మనం ఎదుర్కొనే శత్రువులు బలమైన వారే కావచ్చు, కానీ దేవుడు వారి కంటే శక్తిమంతుడు. యేసును మృతులలో నుండి లేపిన ఆయన పరిశుద్ధాత్మ నేడు మన శరీరాలలో కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. అందుకే బైబిల్ క్రైస్తవులకు ఈ సత్యాన్ని గుర్తుచేస్తోంది: “మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు” (1 యోహాను 4:4).

5. మహిమలో ప్రవేశించే వరకు ఈ పోరాటం ముగియదు

మనం మన రక్షకుని ముఖాముఖిగా చూసే వరకు, పాపముతో మన పోరాటము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది. “మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు” (1 యోహాను 1:8) అని అని బైబిల్ స్పష్టం చేస్తోంది.

పాపముపై పోరాటము సాగించడం అంటే, ఈ భూమిపై మన జీవితకాలమంతా ఒక ‘ఆత్మీయ యుద్ధ రంగము’ అని అర్థం. పరలోకపు నిత్య విశ్రాంతిలో మనం ప్రవేశించే వరకు, ఈ లోకంలో విశ్రాంతిని ఆశించకూడదు. 

మన రక్షకుడైన యేసుప్రభువు మనల్ని మన నిత్య నివాసములోనికి ఆహ్వానించినప్పుడు, మనం ఆయనను పోలి ఉంటాము. అప్పుడు ఈ యుద్ధము ముగుస్తుంది, ఆ విజయము శాశ్వతమవుతుంది.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్ లో ప్రచురించబడింది.

ర్జోనాథన్ ఎల్. మాస్టర్

ర్జోనాథన్ ఎల్. మాస్టర్

డాక్టర్ జోనాథన్ ఎల్. మాస్టర్ గారు సౌత్ కరోలినాలోని గ్రీన్విల్ ప్రెస్బిటేరియన్ థియోలాజికల్ సెమినరీకి ప్రెసిడెంట్‌గా, మరియు ప్రెస్బిటేరియన్ చర్చి ఇన్ అమెరికా (PCA) లో బోధించే పెద్దగా సేవలు అందిస్తున్నారు. వారు Growing in Grace: Becoming More like Jesus (కృపలో ఎదుగుట: యేసు వలె మారుట) మరియు Reformed Theology: Blessings of the Faith (సంస్కరించబడిన దైవశాస్త్రం: విశ్వాస దీవెనలు) వంటి అనేక పుస్తకాల రచయిత.