
యాకోబు గురించి మీరు తెలుసుకోవాల్సిన 3 విషయాలు
19/08/2025
మీకా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
26/08/2025జెకర్యా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

మైఖేల్ పి.వి. బారెట్
1. జెకర్యా గురించి మొదట తెలుసుకోవలసిన విషయం ఆ వ్యక్తి గుర్తింపు.
పాత నిబంధనలో “జెకర్యా” అనేది ఒక సాధారణ పేరు, అయితే మొదటి వచనం అతన్ని “ప్రవక్త ఇద్దో కుమారుడు బరకీయ కుమారుడు” అని ప్రత్యేకంగా గుర్తిస్తుంది. నెహెమ్యా 12:1–4 ప్రకారం, బబులోను చెర తర్వాత జెరుబ్బాబెలుతో పాటు పాలస్తీనాకు తిరిగి వచ్చిన యాజకులలో ఇద్దో ఒకడు. బబులోనీయులు నాశనం చేసిన ఆలయాన్ని తిరిగి నిర్మించడం యూదాకు తిరిగి వచ్చిన వారి మొదటి పని. జెరుబ్బాబెలు నాయకత్వంలో ఆలయ నిర్మాణ పని మొదట్లో చురుకుగా సాగింది, అయితే బయటి నుండి వచ్చిన వ్యతిరేకతలు, అలాగే ప్రజల్లోని ఉదాసీనత కారణంగా ఈ పని మధ్యలోనే ఆగిపోయింది (ఎజ్రా 4, 5 వచనాలు చూడండి). జెకర్యా తాత అయిన ఇద్దో, ఆలయ నిర్మాణపు తొలి దశలో పాలుపంచుకుని ఉండవచ్చు. ఆగిపోయిన ఈ నిర్మాణ కార్యాన్ని పూర్తి చేయడంలో జెకర్యా కీలక పాత్ర పోషించాడు. యేసు చెప్పినట్లుగా జెకర్యా పునర్నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ఆలయం వద్దే హత్య చేయబడటం విచిత్రమైన విషయం (మత్తయి 23:35–37).
జెకర్యా హత్యకు గురికాకముందు, అతను సుదీర్ఘమైన ప్రవచన పరిచర్యను కొనసాగించాడు. అతను తన మొదటి సందేశాలను (జెకర్యా 1–6 అధ్యాయాలు) క్రీ.పూ. 520లో, దర్యావేషు రాజు పాలనలోని రెండవ సంవత్సరంలో అందించాడు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు, అంటే క్రీ.పూ. 518లో, దర్యావేషు పాలనలోని నాల్గవ సంవత్సరంలో తన రెండవ శ్రేణి సందేశాలను (జెకర్యా 7–8 అధ్యాయాలు) ప్రకటించాడు. జెకర్యా గ్రంథంలోని 9–14 అధ్యాయాలకు నిర్దిష్ట తేదీలు పేర్కొనబడనప్పటికీ, గ్రీకుదేశం గురించిన ప్రస్తావన (జెకర్యా 9:13), ఇవి తరువాతి కాలానికి చెందినవని సూచిస్తుంది. బహుశా ఇవి క్రీ.పూ. 480–470 మధ్యకాలంలో వ్రాయబడి ఉండవచ్చు. మొత్తంగా చూస్తే, జెకర్యా సుమారు యాభై సంవత్సరాల పాటు ప్రవక్తగా పరిచర్య చేశాడు.
2. జెకర్యా గురించి తెలుసుకోవలసిన రెండవ విషయం అతని సందేశానికి సంబంధించినది.
బబులోను చెర ముగిసినప్పటికీ, ప్రజలు తాము ఆశించిన ఆశీర్వాదాన్ని లేదా శ్రేయస్సును అనుభవించలేకపోయారు. వారు సమరయుల నుండి వ్యతిరేకతను, దేశంలో నాశనాన్ని, కఠినమైన శ్రమను, మరియు కష్టాలను ఎదుర్కొన్నారు. పరిస్థితి నిరాశాజనకంగా అనిపించింది; యెహోవా తమను మరచిపోయాడని వారికి తోచింది. అయితే, జెకర్యా పేరుకు “యెహోవా జ్ఞాపకం చేసుకుంటాడు” అని అర్థం. ప్రజలు ఆయన పేరు విన్న ప్రతిసారీ, దేవుడు తమను మరచిపోలేదనే సత్యాన్ని అది వారికి గుర్తుచేసింది.
జెకర్యా బోధనలో ముఖ్యమైన విషయం దేవుని నిశ్చలమైన సంకల్పంపై నిరీక్షణ (ఆశ). ఈ నిరీక్షణ అనేది విశ్వాసానికి సంబంధించిన భవిష్యత్ దృక్పథం. అన్ని నిజమైన విశ్వాసాల మాదిరిగానే, నిరీక్షణ కూడా నిష్పక్షపాతమైనది. దాని విలువ దేనిపై ఆధారపడి ఉందో దాని లక్ష్యం ద్వారానే నిర్ణయించబడుతుంది. నిరీక్షణ అనేది వణుకుతూ, సంకోచిస్తూ, కేవలం అదృష్టాన్ని ఆశించి చేసే కోరిక కాదు. దీనికి విరుద్ధంగా, దేవుని వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయని నమ్మకంతో ఎదురుచూడటమే నిజమైన నిరీక్షణ. దేవుని వైపు దృష్టి సారించడమే నిరీక్షణకు రహస్యం. అందుకే జెకర్యా ప్రజలను దేవుని వైపుకు ఆయన అపారమైన శక్తి, అద్భుతమైన అధికారం, నిబంధన విశ్వసనీయత, మరియు ఆయన క్రీస్తు వైపుకు నడిపిస్తాడు.
ఈ విధంగా నిరీక్షణపై దృష్టి సారించడం వల్లనే, జెకర్యా గ్రంథం పాత నిబంధనలో మెస్సీయ గురించి అత్యంత స్పష్టంగా మరియు నిర్దిష్టంగా ప్రస్తావించిన గ్రంథాలలో ఒకటిగా నిలవడం ఆశ్చర్యం కలిగించదు. క్రీస్తులో మరియు ఆయన ద్వారా శాపాన్ని తిప్పికొట్టి, విమోచనను కలిగించాలనే దేవుని సంకల్పంపై దృష్టి సారించడం, ఆనాటి నిరుత్సాహపూరిత పరిస్థితుల నేపథ్యంలో, అనేక విధాలుగా ఆశను కోల్పోయిన ప్రజలలో నిరీక్షణను పెంపొందించడానికి మరియు తిరిగి ఉత్తేజపరచడానికి అత్యంత కీలకం. క్రీస్తును చూడటం అంటే దేవుని వాగ్దానాల హృదయాన్ని చూడటమే. ఎందుకంటే, 2 కొరింథీయులకు 1:20 లో చెప్పబడినట్లుగా, దేవుని వాగ్దానాలన్నీ క్రీస్తులో “అవును” మరియు “ఆమెన్” అని నెరవేరుతాయి కాబట్టి, ప్రతి ఇతర వాగ్దానం పట్ల నమ్మకంగా ఉండగలుగుతాం.
జెకర్యా తన దృష్టిని రాబోయే క్రీస్తుపై కేంద్రీకరించినప్పుడు, ఆయన ప్రవక్తగా, యాజకుడిగా, మరియు రాజుగా నిర్వహించనున్న మధ్యవర్తిత్వ విధులపై చూపిన శ్రద్ధ అత్యంత గమనార్హం. దేవుని ప్రతినిధిగా క్రీస్తుకు ఉన్న ప్రవచనాత్మక పాత్ర జెకర్యా 13:7లో స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ సైన్యాలకు అధిపతియైన యెహోవా, మెస్సీయను “నా కాపరి” అని, మరియు తాను కొట్టే శక్తిమంతుడైన వ్యక్తిని తనతో సమానుడని పేర్కొన్నాడు. మత్తయి 26:31 ఈ ప్రవచనాన్ని నేరుగా క్రీస్తుకు మరియు సిలువ మరణానికి ముడిపెడుతుంది. ఇది యోహాను 10:30లో యేసు “మంచి గొర్రెల కాపరి” గురించి బోధిస్తూ, “నేను గొర్రెల కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను” అని మరియు “నేనును తండ్రియును ఏకమై యున్నామని” ప్రకటించిన సందర్భానికి సమాంతరంగా ఉంటుంది. క్రీస్తు యాజక పరిచర్య జెకర్యా 3:8 మరియు 6:12లో ప్రధాన యాజకుడైన యెహోషువతో పోలిక ద్వారా కనిపించే “కొమ్మ” అనే ముఖ్యమైన మెస్సీయ శీర్షికలో అత్యంత స్పష్టంగా వ్యక్తమవుతుంది. అదనంగా, పరలోక న్యాయస్థానం ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉన్న దర్శనం, దేవుడు పాపులను ఎలా క్షమించి, నిర్దోషులుగా (నీతిమంతులుగా) తీర్చి, వారిని తన యెదుట నిలబెడతాడో చూపించే ఒక అద్భుతమైన దృశ్యం. దేవుని దృష్టిలో నిర్దోషులుగా మారడం (నీతిమంతులుగా తీర్చబడటం) అనేది గొప్ప అవసరం. ఆ చర్య దయతో కూడుకున్నది. దానికి ఆధారమైన “కొమ్మ” (క్రీస్తు) బలంగా, నిశ్చయంగా ఉంది. ఈ నిర్దోషత్వ (నీతిమంతులుగా తీర్చబడటం) ప్రక్రియ తార్కికమైన, అవశ్యకమైన మార్గం.
క్రీస్తు రాజ్యాధికారం జెకర్యా 10:4లో (మూలరాయి, మేకు, యుద్ధ విల్లు, సంపూర్ణ పాలకుడు) మరియు జెకర్యా 9:9లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రవచనం ఖర్జూరపు మట్టల ఆదివారం నాడు ప్రత్యేకంగా నెరవేరింది. క్రీస్తు రెండవ రాకడతో ముడిపడి ఉన్న రాజరికపు అంశాలు కూడా ఈ నిరీక్షణలో (జెకర్యా 14) భాగం. ఈ ప్రవచనాన్ని “జెకర్యా ప్రకారం సువార్త” అని పిలవడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
3. జెకర్యా గురించి మనం తెలుసుకోవలసిన మూడవ విషయం అతని ప్రవచనా విధానం గురించి.
జెకర్యా 1:1 ప్రకారం, యెహోవా వాక్కు జెకర్యాకు వచ్చింది. ఈ వాక్కు వచ్చిన మార్గాలలో ఒకటి దర్శనాల ద్వారా. మొదటి ఆరు అధ్యాయాలు, ఆనాటి తక్షణ పరిస్థితుల నుండి దేవుని ఉద్దేశ్యం యొక్క అంతిమ నెరవేర్పు వరకు, ఆయన ప్రజల పట్ల దేవుని ప్రణాళికను ఒక విస్తృతమైన (Panoramic) దృశ్యంగా అందించే దర్శనాల శ్రేణిని నమోదు చేస్తాయి.
ప్రకటించబడిన సందేశంతో పాటు, దేవుడు దర్శనాల ద్వారా తన వాక్యాన్ని ఎలా వెల్లడిస్తాడో తెలిపే ఉదాహరణల సమాహారం జెకర్యా గ్రంథం. మొదటిది, దర్శనాలు వ్యక్తిగతమైనవి మరియు అంతర్గతమైనవి. ప్రవక్త మాత్రమే వాటిని చూడగలడు. రెండవది, దర్శనం పొందినవాడు చురుకైన భాగస్వామి. జెకర్యాకు దర్శనం యొక్క అర్థాన్ని వివరించిన ఒక వ్యాఖ్యాత దేవదూతతో అతను సంభాషించాడు. మూడవది, దర్శనాలు అత్యంత ప్రతీకాత్మకంగా (చిహ్నాల రూపంలో) ఉంటాయి. రంగురంగుల గుర్రాలు, నలుగురు కళాకారులు, దీపస్తంభాలు, ఒలీవ చెట్లు, ఎగిరే గ్రంథపు చుట్టలు, మరియు గుర్రాలతో నిండిన యుద్ధ రథాలు వంటివన్నీ ఏదో ఒక ఆత్మీయ వాస్తవికతను సూచిస్తాయి.
జెకర్యా పద్ధతి యొక్క మరొక లక్షణం ప్రకటనాత్మక శైలి (apocalyptic tone). ఇది అంతిమ నెరవేర్పుతో సహా సుదూర భవిష్యత్తును ప్రస్తావించే ఒక రకమైన ప్రవచనం. కాబట్టి, జెకర్యా సందేశం ప్రవాసం తర్వాత ఇశ్రాయేల్‌కు మాత్రమే పరిమితం కాదు. దేవుడు నియంత్రణలో ఉన్నాడని మరియు దేవుని శాశ్వత ప్రణాళిక మరియు ఉద్దేశ్యాన్ని సాధించడానికి ప్రతిదీ సరైన మార్గంలో జరుగుతుందని అతను సంఘానికి హామీ ఇస్తాడు.
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
డా. మైకేల్ పి.వి. బారెట్ మిచిగాన్‌లోని గ్రాండ్ రాపిడ్స్‌లో ఉన్న ప్యూరిటన్ రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీలో పాత నిబంధన సీనియర్ రీసెర్చ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. “బిగినింగ్ విత్ మోసెస్: ఎ గైడ్ టు ఫైండింగ్ క్రైస్ట్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్” (Beginning with Moses: A Guide to Finding Christ in the Old Testament) మరియు “విస్డమ్ ఫర్ లైఫ్: 52 ఓల్డ్ టెస్టమెంట్ మెడిటేషన్స్” (Wisdom for Life: 52 Old Testament Meditations) వంటి అనేక పుస్తకాలు ఆయన రచించారు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.