How-to-Read-the-Gospels
సువార్తలను ఎలా చదవాలి?
14/10/2025
How-to-Read-the-Gospels
సువార్తలను ఎలా చదవాలి?
14/10/2025

హెర్మెన్యూటిక్స్ అంటే ఏమిటి?

What-Is-a-Hermenutic

జారెడ్ జెటర్

“దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము” (2 తిమోతి 2:15). అపొస్తలుడైన పౌలు తన శిష్యుడు తిమోతికి చెప్పిన ఈ మాటలు, దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాల్సిన మన బాధ్యతను మనకు గుర్తుచేస్తున్నాయి. ఎందుకంటే, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు, కాబట్టి ఆయన ఏమి చెబుతున్నాడో మనం అర్థం చేసుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ కారణంగానే మనకు సరైన హెర్మినూటిక్స్ అవసరం.

హెర్మినూటిక్స్ అనేది బైబిలును అర్థం చేసుకోవడానికి సంబంధించిన శాస్త్రం మరియు కళ. ఇది ఒక శాస్త్రం, ఎందుకంటే కారు నడపడానికి నియమాలు ఉన్నట్లే, లేఖనాలను వివరించడానికి కూడా నియమాలు ఉన్నాయి. మీకు ఆ నియమాలు తెలియకపోతే, సరిగ్గా ఎలా నడపాలో మీకు తెలియదు. అయితే, సూత్రాలను తెలుసుకోవడమే కాకుండా, వాటిని ఎప్పుడు ఉపయోగించాలో కూడా మీరు తెలుసుకోవాలి. ఈ కారణంగానే, హెర్మినూటిక్స్‌ను ఒక కళ అని కూడా సరైన రీతిలో పిలవవచ్చు. లేఖనాలు ఏకరీతిగా లేవు; ఎందుకంటే అవి అనేక సాహిత్య శైలులను కలిగి ఉన్నాయి. అంతేకాకుండా, వాటిని సుదీర్ఘ కాలంలో, అనేకమంది రచయితలచే, వేర్వేరు భాషలలో వ్రాయబడ్డాయి. కాబట్టి, దాని ఉద్దేశించిన అర్థాన్ని కనుగొనడానికి ఏ వచనానికి ఏ వ్యాఖ్యాన నియమాలను వర్తింపజేయాలో తెలుసుకోవడానికి వివేచన అవసరం. మొత్తంగా, హెర్మినూటిక్స్ యొక్క లక్ష్యం ఇదే: ఒక వచనంలోని ఉద్దేశించిన అర్థాన్ని కనుగొనడానికి దానిని ఎలా వ్యాఖ్యానించాలో అర్థం చేసుకోవడం.

బైబిలును అర్థం చేసుకునేటప్పుడు ప్రధానంగా ఆలోచించవలసింది రచయిత ఉద్దేశించిన అర్థాన్ని కనుగొనడం. బైబిలును అధ్యయనం చేయడంలో ఒక సర్వసాధారణమైన విధానం ఏమిటంటే, ఒక వచనాన్ని చదివి, “ఈ వచనం నాకు ఏమి బోధిస్తున్నది?” అని అడగడం. వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడం చాలా ముఖ్యమైనది అయినప్పటికీ, మనం లేఖనాలను గురించి అడగవలసిన మొట్టమొదటి ప్రశ్న అది ఎన్నటికీ కాకూడదు. దానికి బదులుగా, మనం అడగవలసిన మొదటి ప్రశ్న: “రచయిత ఏమి తెలియజేయాలని ఉద్దేశించాడు?” ఈ ప్రశ్నను విస్మరిస్తే, ఆ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి మరియు తప్పుగా అన్వయించుకోవడానికి దారితీస్తుంది. ఒక లేఖనంలోని రచయిత ఉద్దేశించిన అర్థాన్ని కనుగొనడానికి సహాయపడే కొన్ని ప్రాథమిక హెర్మినూటికల్ భావనలు క్రింద ఇవ్వబడ్డాయి.

చారిత్రక-వ్యాకరణ పద్ధతి

చారిత్రకంగా, రిఫార్మ్డ్ సంప్రదాయంలోని క్రైస్తవులతో సహా, అనేకమంది సంప్రదాయ క్రైస్తవులు, లేఖనాలలో రచయిత ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడానికి చారిత్రక-వ్యాకరణ పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతికి పురాతన అంటియోకైన్ వ్యాఖ్యాన పాఠశాలలో (Antiochene school of interpretation) మూలాలు ఉన్నాయి. ఇది సంస్కరణల కాలంలో ఎక్కువగా ఉపయోగించబడింది మరియు నేటికీ సంఘంలో విస్తృతంగా వాడుకలో ఉంది. ఇది బైబిలు వచనంలోని చారిత్రక నేపథ్యం మరియు వ్యాకరణ రూపాలపై దృష్టి పెడుతుంది.

చారిత్రక సందర్భాన్ని గురించి, పాఠకుడు ఈ క్రింది ప్రశ్నలు అడగాలి: రచయిత ఎవరు? మొట్టమొదటి శ్రోతలు ఎవరు? ఈ వచనాలలో ఏవైనా సాంస్కృతిక సూచనలు ఉన్నాయా, వాటిని గురించి మనం మరింత తెలుసుకోవాలా? వ్యాకరణ రూపాలపై శ్రద్ధ చూపడంలో పదాల అర్థాన్ని అధ్యయనం చేయడం, వాక్య సంబంధాలను (syntactical relationships) అర్థం చేసుకోవడం మరియు వచనంలోని సాహిత్య నిర్మాణాలను (literary constructions) గుర్తించడం ఉంటాయి. వీటిని అధ్యయనం చేయడం వల్ల విశ్లేషకుడికి ఒక నిర్దిష్ట వచనాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా, ఆ వచనం సందర్భానుసారంగా దాని ముందు మరియు వెనుక భాగాలతో ఎలా సంబంధం కలిగి ఉందో తెలుసుకోవడానికి కూడా సహాయపడుతుంది. వచనాన్ని దాని సరైన చారిత్రక మరియు వ్యాకరణపరమైన సందర్భంలో చూడటం యొక్క ప్రాముఖ్యతను సంగ్రహంగా చెప్పాలంటే, బైబిలును అర్థం చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన మూడు ముఖ్యమైన పదాలు ఇవి: సందర్భం, సందర్భం, సందర్భం.

చారిత్రక-వ్యాకరణ పద్ధతి లేఖనాలను వాటి అక్షరార్థాన్ని బట్టి విశ్లేషించడానికి ప్రాధాన్యత ఇస్తుంది. అక్షరార్థం అంటే వచనంలోని సాహిత్య స్వభావాన్ని విస్మరించడం కాదని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే, ఈ పదం ఉపయోగకరంగా ఉంటుంది. లేఖనాలు ఒక సాహిత్యం కాబట్టి, అది తరచుగా అలంకారిక పదాలను (figures of speech), ప్రతీకలను (symbolism), రూపకాలను (metaphor) మరియు ఇతర సాహిత్య నిర్మాణాలను కలిగి ఉంటుంది. లేఖనాలను దాని అక్షరార్థాన్ని బట్టి విశ్లేషించడం అంటే ఈ నిర్మాణాలను సరిగ్గా గుర్తించి, ఆ వచనంలోని సాహిత్య శైలికి ఉన్న సాధారణ నియమాలను బట్టి వాటిని అర్థం చేసుకోవడం. కాబట్టి, లేఖనాలు కవిత్వం లేదా ప్రవచన సంబంధిత వచనాలలో ప్రతీకలను ఉపయోగించినప్పుడు, మనం వాటిని ప్రతీకాత్మకంగా విశ్లేషించాలి. లేకపోతే, మనం రచయిత ఉద్దేశించిన అర్థాన్ని దెబ్బతీసిన వారమవుతాం.

విశ్వాస సారూప్యత (The Analogy of Faith)

బైబిలుకు మానవ రచయితలే కాకుండా, ఒక దైవిక రచయిత కూడా ఉన్నాడు కాబట్టి, ఆ దైవిక రచయిత ఉద్దేశాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఒక ప్రాథమిక హెర్మినూటికల్ సూత్రం ఏమిటంటే, విశ్వాస సారూప్యత లేదా విశ్వాస నియమం. ఇది లేఖనాన్ని లేఖనమే విశ్లేషించాలి అని చెబుతుంది. వెస్ట్‌మినిస్టర్ ఒప్పుకోలు పత్రం (Westminster Confession of Faith)లోని మొదటి అధ్యాయం ఇలా వివరిస్తుంది, “లేఖనాలను విశ్లేషించడానికి ఉన్న తిరుగులేని నియమం లేఖనమే: కాబట్టి, ఏదేని లేఖనం యొక్క సరైన మరియు సంపూర్ణ భావం గురించి ప్రశ్న తలెత్తినప్పుడు (అది బహుళం కాదు, కానీ ఒకటి మాత్రమే), దానిని మరింత స్పష్టంగా మాట్లాడే ఇతర వచనాల ద్వారా శోధించి తెలుసుకోవాలి” (1.9).

లేఖనానికి ఒకే ఒక్క అర్థం ఉంది అని (పైన నిర్వచించిన విధంగా అక్షరార్థం) ఒప్పుకోలుధృవీకరించడమే కాకుండా, 2 పేతురు 3:16లో బైబిలే చెప్పినట్లుగా, లేఖనాలలో కొన్ని వచనాలను ఇతర వచనాలతో పోలిస్తే అర్థం చేసుకోవడం మరింత కష్టంగా ఉంటాయని ఇది గుర్తిస్తుంది. దేవుడు తనను తాను వ్యతిరేకించుకోడు కాబట్టి, ఆయన వాక్యంలో కూడా వైరుధ్యాలు ఉండవు. కాబట్టి, లేఖనాలలో అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్న వచనాలు ఉన్నప్పుడు, వాటిని విశ్లేషించడానికి లేఖనంలోని మరింత స్పష్టమైన భాగాలను ఉపయోగించడం అవసరం.

లేఖనాలలో క్రీస్తు

లేఖనాలకు దైవిక రచయిత ఉన్నాడని చెప్పడానికి సంబంధించిన రెండవ హెర్మినూటికల్ సూచన ఏమిటంటే, దైవిక రచయిత ఉద్దేశం మానవ రచయిత ఉద్దేశానికి ఎప్పుడూ విరుద్ధంగా ఉండదు, అయితే అది మానవ రచయిత యొక్క పూర్తి గ్రహణశక్తికి మించి విస్తరించి ఉండవచ్చు. ఈ విధంగా, వెస్ట్‌మిన్‌స్టర్ విశ్వాస పత్రం (Confession) “లేఖనం యొక్క నిజమైన మరియు సంపూర్ణ భావం” గురించి మాట్లాడినప్పుడు, దేవుని తదుపరి ప్రత్యక్షత ఆయన అంతకు ముందు ఇచ్చిన ప్రత్యక్షతపై వెలుగును ప్రసరిస్తుందని అది గుర్తిస్తుంది. కొన్ని వచనాల తర్వాత, ఆయన మిగిలిన పదకొండు మంది అపొస్తలులకు కనిపించినప్పుడు, యేసు “మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెను” అని చెప్పి లేఖనాలను అర్థం చేసుకోవడానికి వారి మనస్సులను తెరిచాడు (లూకా 24:44). హెబ్రీ బైబిలు యొక్క మూడు విభాగాలకు సంబంధించిన ఈ స్పష్టమైన సూచన, పాత నిబంధనలోని ప్రతి భాగం ఆయనకు సాక్ష్యమిస్తున్నదని యేసు చెబుతున్నట్లు సూచిస్తుంది. జాగ్రత్తైన టైపాలజీని (typology) ఉపయోగించి, ప్రత్యేకంగా దైవిక రచయిత తన వాక్యం అంతటా అల్లిన ఇతివృత్తాలు మరియు నమూనాలను గుర్తించడం ద్వారా, బైబిలులోని అన్ని మార్గాలు యేసు వైపు ఎలా నడిపిస్తాయో మనం చూడగలం.

ఈ వ్యాసం హెర్మినూటిక్స్ సేకరణలో భాగం.

  1. ఈ మరియు మరిన్ని హెర్మినూటికల్ సూత్రాల గురించి మరింత వివరణాత్మక వివరణ కోసం, ఆర్.సి. స్ప్రావుల్ రచించిన నోయింగ్ స్క్రిప్చర్ (డౌనర్స్ గ్రోవ్, IL: ఇంటర్‍వర్సిటీ ప్రెస్, 2016) అనే పుస్తకాన్ని చూడండి.
  2. వచనంలోని వివరాలపై శ్రద్ధ చూపడం ద్వారా మరియు మంచి ప్రశ్నలు అడగడం ద్వారా అనేక వ్యాకరణ మరియు చారిత్రక ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగినప్పటికీ, మంచి స్టడీ బైబిలు లేదా కామెంటరీ వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా వచనంలోని ముఖ్యమైన వివరాలను వెల్లడి చేయవచ్చు.
  3. బాధ్యతాయుతమైన టైపాలజీని ఎలా ఆచరించాలో మరియు లేఖనాల అంతటా అల్లిన ఇతివృత్తాలను ఎలా గుర్తించాలో అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన వనరు, డెన్నిస్ జాన్సన్ రచించిన వాకింగ్ విత్ జీసస్ త్రు హిస్ వర్డ్: డిస్కవరింగ్ క్రైస్ట్ ఇం అల్ ది స్క్రిప్చర్స్ (ఫిలిప్స్‌బర్గ్, NJ: పి&ఆర్ పబ్లిషింగ్, 2015).

జారెడ్ జెటర్ లైగోనియర్ మినిస్ట్రీస్‌లో కంటెంట్ క్యురేటర్‌గా మరియు ఫ్లోరిడాలోని శాన్‌ఫోర్డ్‌లో ఉన్న రిఫర్మేషన్ బైబిలు కాలేజీలో రెసిడెంట్ అడ్జంక్ట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.