Who Was Samson?
సమ్సోను ఎవరు?
02/04/2026
Who Was Samson?
సమ్సోను ఎవరు?
02/04/2026

పాప క్షమాపణ నిశ్చయత అంటే ఏమిటి?

What Is an Assurance of Pardon?

ప్రపంచంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల పెద్దగా ఆసక్తి లేని వారికి సైతం, రోమన్ క్యాథలిక్ సంప్రదాయంలోని “తండ్రీ, నన్ను ఆశీర్వదించండి, నేను పాపం చేశాను” అనే ప్రసిద్ధ మాటలు సుపరిచితమే. ఒక విశ్వాసి పాపాలను ఒప్పుకొనే గదిలోకి (confessional booth) వెళ్లి ఏకాంతంగా యాజకుని ఎదుట పలికే ఈ మాటలు, పాపం యొక్క యదార్థతను మరియు దేవుని కృప యొక్క అవశ్యకతను చాటిచెబుతాయి. అయితే, ఆ తర్వాత అక్కడ ఏమి జరుగుతుంది? విశ్వాసి తన పాపాల జాబితాను ఒప్పుకున్న తర్వాత, దానికి ప్రతిస్పందనగా ఆ యాజకుడు కొన్ని ప్రాయశ్చిత్త క్రియలను సూచించి, చివరగా పాపవిముక్తిని (absolution) ప్రకటిస్తాడు. రిఫార్మ్డ్ సంప్రదాయం (సంస్కరణోద్యమ సిద్ధాంతాలను అనుసరించే సంప్రదాయం) కూడా పాపాలను ఒప్పుకోవడాన్ని, దేవుని నుండి క్షమాపణ పొందడాన్ని ఎంతో ప్రాముఖ్యమైనవిగా పరిగణిస్తుంది; అయితే, ఈ విషయంలో మన విశ్వాసానికి, ఇతర సంప్రదాయాలకు మధ్య కొన్ని కీలకమైన వ్యత్యాసాలు ఉన్నాయి.

మొదటి వ్యత్యాసం మనం ఎవరికి ఒప్పుకోలు చేస్తున్నామనే విషయంలోనే కనిపిస్తుంది. “దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తుయేసు అను నరుడు” (1 తిమోతి 2:5) అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి, మన పాపాలు సృష్టించిన ఆ అగాధాన్ని పూడ్చగలిగే శక్తి ఏకైక వ్యక్తి క్రీస్తుకు మాత్రమే ఉందని, ఏ మానవ యాజకుడు లేదా పాస్టర్ దీనిని చేయలేరని మనం విశ్వసిస్తున్నాం. మన గొప్ప ప్రధాన యాజకుడైన క్రీస్తుయేసు సంపాదించిన పుణ్యకార్యాలనే (Merits) మనకున్న ఏకైక ఆధారంగా చేసుకుని, మనం నేరుగా దేవుని సన్నిధిలోనే మన పాపాలను ఒప్పుకుంటాము (హెబ్రీ 4:14-16).

పాపపు ఒప్పుకోలు ఎక్కడ, ఎలా జరగాలనే విషయంలో రోమన్ క్యాథలిక్ మరియు రిఫార్మ్డ్ (సంస్కరణవాద) సంప్రదాయాల మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. రోమన్ క్యాథలిక్ విధానంలో పాపపు ఒప్పుకోలు అనేది ‘కన్ఫెషనల్ బూత్’ (Confessional booth) వంటి ఏకాంత గదులకే పరిమితమై ఉంటుంది. కానీ, రిఫార్మ్డ్ సంప్రదాయం ఆ ఒప్పుకోలును రహస్య గదుల నుండి బయటకు తీసుకువచ్చి, బహిరంగ సంఘారాధనలో ఒక కేంద్ర బిందువుగా నిలిపింది. శతాబ్దాలుగా, సంస్కరణవాద ఆరాధన క్రమాలలో (Liturgies) “శుద్ధీకరణ” (Cleansing) అనే విభాగం ఒక విశిష్ట ఆనవాయితీగా కొనసాగుతోంది. ఉదాహరణకు దీని క్రమం ఇలా ఉంటుంది: మొదట దేవుని పరిశుద్ధ వాక్యము చదవబడుతుంది. ఆ వాక్యమే మన పాపాలను ఎత్తిచూపే అద్దంలా పనిచేస్తుంది. ఆ వాక్య వెలుగులో, విశ్వాసులైన ప్రజలు తమ దోషాలను దేవుని సన్నిధిలో వినయంగా ఒప్పుకుంటారు. తదనంతరం, క్రీస్తుయేసు నందు నిజమైన విశ్వాసముంచిన వారికి లభించే పాపక్షమాపణ నిశ్చయతను దైవసేవకుడు లేఖనాల ఆధారంగా అధికారికంగా ప్రకటిస్తారు. ఈ విధంగా, వ్యక్తిగత భక్తిని సంఘారాధనతో ముడిపెడుతూ, క్రీస్తు ద్వారా లభించే విముక్తిని సంఘమంతా కలిసి అనుభవించేలా రిఫార్మ్డ్ సంప్రదాయం మనల్ని ప్రోత్సహిస్తుంది.

అసలు దీనిని సామూహిక ఆరాధనలో ఒక భాగంగా ఎందుకు ఉంచాలి? పాపాలను ఒప్పుకోవడం అనేది అత్యంత వ్యక్తిగతమైన, ఏకాంతమైన విషయంగా మనకు అనిపించవచ్చు. గత వారమంతా మనం చేసిన అతిక్రమాలను దేవుని సన్నిధిలో నేరుగా ఎదుర్కోవాలని కోరే ఆరాధన క్రమం మిమ్మల్ని కొంత సంకోచానికి లేదా అసౌకర్యానికి గురిచేసి ఉండవచ్చు. నేడు అనేక సంఘాలు విశ్వాసులు ఇబ్బందిగా భావించకూడదనే ఉద్దేశంతో, దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడం లేదా పాపపు ఒప్పుకోలు వంటి భాగాలను ఆరాధన క్రమం నుండి పూర్తిగా తొలగించాయి. అయితే, రిఫార్మ్డ్ సంప్రదాయం మాత్రం ఇప్పటికీ ఈ ప్రాచీన మార్గానికే కట్టుబడి ఉంది. ఎందుకంటే, దీని వెనుక “ఆరాధన యొక్క మూల స్వభావం” (Nature of Worship) దాగి ఉంది. కేవలం సౌకర్యం కోసం కాకుండా, దేవుని పరిశుద్ధతను మన పాపపు స్థితిని ముఖాముఖి కలిసే ఆ పవిత్ర క్షణాలనే రిఫార్మ్డ్ పితరులు ఆరాధనకు ప్రాణాధారంగా భావించారు.

ఆరాధన అనేది దేవునితో జరిగే ఒక పవిత్రమైన ముఖాముఖి సమావేశం. అయితే, పాపభరితులైన నరులు పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోకి నేరుగా ప్రవేశించలేరు. మన పాపాలను వినయంతో ఒప్పుకోవడం, ఆ పైన క్రీస్తుయేసు నందు మనకు లభించిన నీతిని ప్రకటించడం ఇవన్నీ సువార్త లేకుండా ఆరాధన అనేది అసాధ్యమనే సత్యాన్ని మనకు శక్తివంతంగా గుర్తుచేస్తాయి. అంతేకాకుండా, ఆరాధన అనేది మన క్రైస్తవ గుర్తింపును మలచడానికి, స్థిరపరచడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. క్రైస్తవులుగా మనం ఒకే సమయంలో పాపులము మరియు పరిశుద్ధులము కూడా; ఈ రెండు వాస్తవాలూ మన ఆత్మీయ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి (1 యోహాను 1:8-9). సామూహిక ఆరాధనలో, క్రీస్తుయేసు నందు మనకు లభించిన క్షమాపణను దైవసేవకుడు ప్రకటించే ఆ అద్భుత క్షణం మనలో ఎంతో ఆత్మీయ ఉత్తేజాన్ని నింపుతుంది. మనం కేవలం ‘కృప చేత రక్షించబడిన పాపులము’ అని, దేవుని దృష్టిలో మనం ‘ఏర్పరచబడిన వారము మరియు అమూల్యమైన వారము’ అనే నిశ్చయతను ఆ క్షణం మన హృదయాలపై ముద్రిస్తుంది.

పాపక్షమాపణ విషయంలో రోమన్ క్యాథలిక్ మరియు రిఫార్మ్డ్ సంప్రదాయాల మధ్య ఉన్న మూడవ ప్రాముఖ్యమైన వ్యత్యాసం – క్షమాపణను ప్రకటించే ఆ సమయంలో అసలు ఏమి జరుగుతుంది? ఇక్కడ దైవసేవకుడు తనంతట తానుగా ఒక కొత్త తీర్పును (Decree) జారీ చేయడం లేదు; బదులుగా, పరిశుద్ధ లేఖనాల ప్రకారం ఇప్పటికే సిద్ధంగా ఉన్న సత్యాన్ని ఆయన కేవలం ప్రకటిస్తున్నారు (Declare). దీనికి భిన్నంగా, “అబ్సొల్యూషన్” (Absolution – ఇది ‘విముక్తి చేయడం’ అనే అర్థం గల లాటిన్ పదం నుండి వచ్చింది) అనేది ఒక యాజకుడు తన అధికారం ద్వారా ఒక వ్యక్తిని పాప దోషం నుండి అక్షరాలా విముక్తుడిని చేసే ప్రక్రియగా పరిగణించబడుతుంది. అయితే, పాపాలను క్షమించే అధికారం ఏ నరుడికీ లేదు (మార్కు 2:7), కానీ పాపాలు క్షమించబడ్డాయని ప్రకటించే (Preach/Declare) అధికారం మాత్రం దైవసేవకులకు ఉంది (అపొస్తలుల కార్యములు 13:38). రిఫార్మ్డ్ ఆరాధనలోని ఈ కీలక ఘట్టంలో, దైవసేవకుడు దేవుని స్థానాన్ని ఆక్రమించడం లేదు, కానీ దేవుని పక్షాన ఒక ప్రతినిధిగా నిలబడి ఉన్నాడు. అతని పెదవుల నుండి వెలువడే మాటల ద్వారా, క్షమించే గుణము మరియు అపారమైన కనికరము గల మన దేవుని స్వరమునే మనం వింటాము: “కాబట్టి ఇప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు” (రోమీ 8:1). అందుకే అనేక రిఫార్మ్డ్ సంఘాలలో, దైవసేవకులు సువార్త నిరీక్షణను చాటిచెప్పే లేఖన భాగాలను నేరుగా చదివి వినిపిస్తారు. ఎందుకంటే, మన పాపక్షమాపణ నిశ్చయతకు ఏకైక ఆధారం దేవుని వాక్యము మరియు ఆయన నమ్మదగిన వాగ్దానమే. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, రిఫార్మ్డ్ ఆరాధన క్రమంలో (Liturgy) పాపక్షమాపణ ప్రకటన అనేది అత్యున్నత ఘట్టాలలో ఒకటి. పాపం మనల్ని మానసికంగా, ఆత్మీయంగా కృంగదీస్తుంది, కానీ సువార్త మనల్ని మళ్ళీ పైకి లేవనెత్తుతుంది (కీర్తన 32:3–5). ఈ క్షమాపణ సందేశమే మన నిరీక్షణకు ప్రాణాధారం మరియు దేవునికి విధేయత చూపడానికి మనకు అవసరమైన ఆత్మీయ బలమును ఇస్తుంది. ఆరాధన అనేది “సమస్త కృపానిధియగు దేవుని” (1 పేతురు 5:10) ముఖాముఖిగా సంధించే అద్భుత సమయం. ఏ యోగ్యత లేని తిరుగుబాటుదారుల వైపు తన ప్రేమహస్తాన్ని చాచి, దావీదు కీర్తనలో చెప్పినట్లుగా “నా తల ఎత్తువాడుగా” (కీర్తన 3:3) నిలిచే దేవునిని మనం ఇక్కడ కలుసుకుంటాం. ఆయన “కోపించుటకు నిదానించువాడును, కృపాసత్యములతో నిండినవాడునై” ఉన్నాడు (నిర్గమ 34:6). సామూహిక ఆరాధనలో దేవుని వాత్సల్య హృదయం పరిపూర్ణంగా ఆవిష్కరించబడుతుంది; ముఖ్యంగా ఈ పాపక్షమాపణ ప్రకటనలో ఆయన కనికరం మరింత ప్రస్ఫుటంగా, మహిమాన్వితంగా కనిపిస్తుంది.

క్రీస్తునందు ఇప్పటికే విశ్వాసముంచిన వారు, దైవసేవకుడు ఆ క్షమాపణను ప్రకటించక ముందే దేవునిచే క్షమించబడ్డారు. ఆ ప్రకటన వెలువడిన క్షణంలో మన స్థితిలో గానీ, దేవునితో మనకు ఉన్న సంబంధంలో గానీ వాస్తవిక స్థితిలో(Objectively) ఎటువంటి కొత్త మార్పూ సంభవించదు. అయితే, మనం ఇప్పటికే క్షమించబడ్డామనే అద్భుత సత్యాన్ని మనం తరచుగా మర్చిపోతుంటాం; ఈ మరుపు మనల్ని సందేహంలోనికి, అవిధేయతలోనికి నెట్టివేస్తుంది. అందుకే, ‘పాపక్షమాపణ నిశ్చయత’ (Assurance of Pardon) అనేది దేవుని ప్రజలుగా మన అసలైన గుర్తింపును గుర్తుచేసే ఒక ఆవశ్యకమైన జ్ఞాపిక: “ఒకప్పుడు మీరు ప్రజగా ఉండలేదు, ఇప్పుడైతే దేవుని ప్రజలై ఉన్నారు; ఒకప్పుడు మీరు కనికరం పొందని వారుగా ఉండిరి, ఇప్పుడైతే కనికరం పొందిన వారై ఉన్నారు” (1 పేతురు 2:10).

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్ (Ligonier Ministries Blog) లో ప్రచురించబడింది.

జోనాథన్ లాండ్రీ క్రూస్ని
జోనాథన్ లాండ్రీ క్రూస్ని
రెవరెండ్ జోనాథన్ లాండ్రీ క్రూస్, మిచిగాన్‌లోని కలమజూలో ఉన్న 'కమ్యూనిటీ ప్రెస్బిటేరియన్ చర్చి' (Community Presbyterian Church) నందు పాస్టర్‌గా పరిచర్య చేస్తున్నారు. వీరు తన భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. దైవభక్తిని పెంపొందించే 50కి పైగా ఆధ్యాత్మిక కీర్తనలను (Hymns) రచించడమే కాకుండా, Hymns of Devotion, The Christian’s True Identity (క్రైస్తవుని యథార్థ గుర్తింపు), మరియు The Character of Christ (క్రీస్తు వ్యక్తిత్వం) వంటి ప్రాముఖ్యమైన గ్రంథాలను వీరు రచించారు.