మార్టిన్ లూథర్ మరణం మరియు వారసత్వం
27/12/2024
మార్టిన్ లూథర్ మరణం మరియు వారసత్వం
27/12/2024

సువార్త అంటే ఏమిటి?

చాలా మంది క్రైస్తవులు, సంఘాలు మరియు సంస్థలు తమ నమ్మకాలను వివరించడానికి సువార్త అనే పదాన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తాయి. సువార్త యొక్క అర్థం మరియు దానిని విశ్వసనీయంగా ఎవరు బోధిస్తారు అనే దానిపై వేదాంతపరమైన వివాదాలు సంభవించాయి మరియు సంభవిస్తాయి. సువార్త అనే సుపరిచిత పదానికి అర్థం ఏమిటి? ఆ ప్రశ్నకు సమాధానమివ్వడానికి ఉత్తమ మార్గము బైబిలు వైపు తిరగడము.

గ్రీకు క్రొత్త నిబంధనలో, యుఆంగెలియోన్ (“సువార్త”) అనే నామవాచకం డెబ్బై కంటే కొద్దిగ ఎక్కువ సార్లు కనిపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే, క్రొత్త నిబంధన మొత్తం సువార్తకు సంబంధించినది కాబట్టి, ఈ పదాన్ని మరింత తరచుగా ఉపయోగిస్తారని మనం ఆశించి ఉండవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిట౦టే, క్రొత్త నిబంధన పుస్తకాల రచయితల మధ్య దాని ఉపయోగ౦ చాలా వేరుగా ఉ౦టు౦ది. పౌలు ఈ పదాన్ని ఇతర రచయితలందరి కంటే మూడు రెట్లు ఎక్కువసార్లు ఉపయోగిస్తాడు. ఇతర ఉపయోగాలు చాలావరకు మత్తయి మరియు మార్కులో కనిపిస్తాయి, లూకా, యోహాను, పేతురు మరియు యాకోబులలో చాలా తక్కువగా కనిపిస్తాయి.

సువార్త అనే పదానికి చాలా సాధారణగా “శుభవార్త” అని అర్థం. ఈ పదం క్రైస్తవ సందేశానికి ప్రత్యేకమైనది కాదు, కానీ అన్యమత ప్రపంచంలో ఒక మంచి ప్రకటనను సూచించడానికి కూడా ఉపయోగించబడింది. క్రొత్త నిబంధనలో, ఇది రక్షకుడైన యేసు యొక్క శుభవార్తను సూచిస్తుంది. తరచుగా, ఈ పదానికి అర్థం ఏమిటో పాఠకుడికి తెలుసు అనే భావనతో దీనిని ఉపయోగిస్తారు.

క్రొత్త నిబంధనలో సువార్తను ఉపయోగి౦చిన మార్గాలను మరి౦త నిశిత౦గా పరిశీలి౦చినప్పుడు, అనేక విషయాలు బలంగా అర్థమౌతాయి. మొదటిది, “దేవుని సువార్త” అనే పదబంధాన్ని మన౦ తరచూ చూస్తా౦. ఈ పదబంధం సువార్త యొక్క మూలాన్ని దేవుడు ఇచ్చిన బహుమతిగా నొక్కి చెబుతుంది. సువార్త దైవికమైనది, మానవ మూలమైనది కాదు. రెండవది, సువార్త యొక్క స్వభావం అనేక విధాలుగా పేర్కొనబడింది: సువార్త సత్యము (గల. 2:5, 14; కొలొ. 1:5), దయగలది (అపొస్తలుల కార్యములు 20:24), మహిమగలది (2 కొరి౦థీయులు 4:4; 1 తిమోతి 1:11). మూడవది, సువార్తకు రెండు ప్రతిస్పందనలు కనిపిస్తాయి. ప్రాధమిక ప్రతిస్పందన విశ్వాసం (అపొస్తలుల కార్యములు 15:7; ఎఫె. 1:13). కానీ విధేయత కూడా ఒక ప్రతిస్పందన (1 పేతురు 4:7; రోమా 1:5; 10:16; 16:26; 2 థెస్స. 1:8).

(అతను ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉన్నాడని ఆరోపించిన వారికి ప్రతిస్పందిస్తూ రోమీయులకు వ్రాసిన పత్రికలో విశ్వాసము యొక్క విధేయత అనే ఆలోచనను పౌలు ఉపయోగించడం విడ్డూరంగా ఉంది.) నాల్గవది, సువార్త యొక్క అనేక ఫలితాలను మనం చూస్తాము. సువార్త, రక్షణను తెస్తుంది (రోమా 1:16; ఎఫె. 1:13). అది రాజ్యాన్ని కూడా తెస్తుంది (మత్తయి 4:23; 9:35, 24:14). ఇది దేవుని ప్రజలలో నిరీక్షణను రేకెత్తిస్తుంది (కొలొ. 1:23). సువార్త కూడా పరిశుద్ధీకరణకు ప్రేరణ (మార్కు 8:35; 10:29; 2 కొరి౦థీయులు 9:13; ఎఫె. 6:15; ఫిలి. 1:27).

సువార్త అనే పదాన్ని ఉపయోగించిన ఈ మార్గాలన్నీ దాని విషయాన్ని సూచిస్తాయి, కానీ కొత్త నిబంధనలో దాని విషయాన్ని గురించి స్పష్టంగా ఉన్న భాగాలు కూడా ఉన్నాయి. ఈ గ్రంధాలను పరిశీలి౦చినప్పుడు, కొన్నిసార్లు సువార్త అనే పద౦ యేసు తన ప్రజలకు ఇచ్చే రక్షణ, క్రొత్త జీవితానికి స౦బ౦ధి౦చిన అన్ని అ౦శాలను స్థూల౦గా సూచిస్తు౦దని, కొన్నిసార్లు యేసు మన కోస౦ మనకు బయట ఏమి చేస్తాడో చెప్పడానికి దాన్ని సంకుచిత౦గా ఉపయోగి౦చబడుతు౦దని మన౦ కనుగొంటాము. మరో మాటలో చెప్పాలంటే, కొన్నిసార్లు సువార్త అనే పదం స్థూలంగా యేసు తన ప్రజలకు మరియు తన ప్రజలలో చేసే సమర్థనను మరియు పరిశుద్ధీకరణను సూచిస్తుంది, మరియు కొన్నిసార్లు ఇది యేసు యొక్క సమర్థన పనిని సంకుచితంగా సూచిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని చెప్పడానికి మరొక మార్గం ఏమిటంటే, కొన్నిసార్లు సువార్త అనే పదం స్థూలంగా పాత నిబంధనలో వాగ్దానం చేసిన దాని నెరవేర్పును సూచిస్తుంది, మరియు కొన్నిసార్లు సువార్త అనే పదం ధర్మశాస్త్రాన్ని మనం చేయడానికి విరుద్ధంగా యేసు చేసిన పనికి సంకుచితంగా ఉపయోగించబడుతుంది.

సువార్త అనే పద౦ యొక్క విస్తృత అర్థానికి ఒక ఉదాహరణ మార్కు 1:1లో చూడవచ్చు, “దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం.” సువార్త అనే పదం యొక్క ఈ ఉపయోగం యేసు బోధన మరియు పని గురించి మార్కు మనకు చెప్పే ప్రతిదాన్ని సూచిస్తుంది. ప్రకటన 14:6–7లో మన౦ మరో విస్తృత ఉపయోగాన్ని చూస్తా౦:

అప్పుడు మరియొక దూతను చూచితిని. అతడు భూనివాసులకు, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆ యా భాషలు మాటలాడువారికిని ప్రతి ప్రజకును ప్రకటించునట్లు నిత్యసువార్త తీసికొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు “మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి” అని గొప్ప స్వరముతో చెప్పెను.

పశ్చాత్తాపపడి దేవుణ్ణి ఆరాధించాలని ఇక్కడ సువార్త పిలుపు.

తరచుగా, సువార్త అనే పదం సంకుచితంగా ఉపయోగించబడుతుంది మరియు దాని విషయం పేర్కొనబడుతుంది. 1 కొరి౦థీయులు 15:1–4లో మన౦ దీన్ని చూస్తా౦:

మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశరూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను.

ఇక్కడ, సువార్త యేసు యొక్క రక్షించే మరణం మరియు పునరుత్థానం యొక్క సందేశం.

మరోచోట పౌలు “అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త” గురి౦చి వ్రాశాడు, ఆ సువార్త ఏమిటో ఆయన ఇలా పేర్కొన్నాడు:

 పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై యున్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్యజీవము నిమిత్తము తనను విశ్వసింప బోవువారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధానపాపినైన నాయందు కనుపరచునట్లు నేను కనికరింపబడితిని. (1 తిమోతి 1:11, 15-16)

ఇక్కడ, సువార్త పాపుల కొరకు క్రీస్తు చేసిన రక్షించే కార్యం.

పౌలు 2 తిమోతిలో కూడా ఇలా వ్రాశాడు:

కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చియైనను, ఆయన ఖైదీనైన నన్నుగూర్చి యైనను సిగ్గుపడక, దేవుని శక్తినిబట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలివాడవై యుండుము. మన క్రియలనుబట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు, అనాదికాలముననే క్రీస్తుయేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షతవలన బయలుపరచబడి నదియునైన తన కృపనుబట్టియు, మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తుయేసు, మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్తవలన వెలుగులోనికి తెచ్చెను.. . . నా సువార్త ప్రకారము, దావీదు సంతానములో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకముచేసికొనుము. (2 తిమోతి 1:8-10; 2:8)

పదహారవ శతాబ్దపు సంస్కర్తల రచనలలో సువార్త అనే పదం యొక్క ఈ సంకుచిత ఉపయోగం చాలా సాధారణం. జాన్ కెల్విన్ ఆలోచనలో ఇది మనం చూడవచ్చు:

మెటోనిమి (ఒక భావన యొక్క పేరును మరొక భావనకు ఉపయోగించడం) ద్వారా వాగ్దానము యొక్క వాక్యముకు  విశ్వాసం యొక్క వాక్యము అనబడుతుంది, అంటే సువార్త అని అనబడుతుంది, ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించినది. ధర్మశాస్త్రానికి, సువార్తకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఈ భేదాన్ని బట్టి, ధర్మశాస్త్రం పనిని కోరుతున్నట్లే, దేవుని కృపను పొందడానికి మానవులు విశ్వాసాన్ని తీసుకురావాలని మాత్రమే సువార్త కోరుతుంది.

ఇది జకారియాస్ ఉర్సినస్ లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. హైడెల్బెర్గ్ కాటెచిజంపై తన వ్యాఖ్యానం ప్రారంభంలో, ఉర్సినస్ సిద్ధాంతం మొత్తాన్ని ధర్మశాస్త్రము మరియు సువార్తగా విభజించాడు:

సంఘము యొక్క సిద్ధాంతం రెండు భాగాలను కలిగి ఉంటుంది: ధర్మశాస్త్రము, సువార్త; దీనిలో మనం పవిత్ర లేఖనాల మొత్తాన్ని మరియు విషయాన్ని అర్థం చేసుకున్నాము. ధర్మశాస్త్రాన్ని డెకలాగ్ అని పిలుస్తారు, మరియు సువార్త అనేది మధ్యవర్తి అయిన క్రీస్తుకు సంబంధించిన సిద్ధాంతం, మరియు విశ్వాసం ద్వారా పాపాలను స్వేచ్ఛగా ఉపశమనం చేయడం.

సువార్తపై ఇటువంటి ప్రతిబింబాలు సంస్కరించబడిన వేదాంతశాస్త్రంలో సర్వసాధారణంగా ఉన్నాయని, గొప్ప డచ్ వేదాంతవేత్త హెర్మన్ బావింక్ యొక్క ఈ సుదీర్ఘమైన, ఆకర్షణీయమైన ఉల్లేఖన నుండి మనం చూస్తాము:

కాని దేవుని వాక్యము, ధర్మశాస్త్రముగాను మరియు  సువార్తగాను, దేవుని చిత్తము యొక్క ప్రత్యక్షత, క్రియల నిబంధనను మరియు కృప యొక్క నిబంధనను ప్రకటించుట . . . . స్థూలమైన అర్థంలో “ధర్మశాస్త్రం” మరియు “సువార్త” అనే పదాలు కృప యొక్క పాత మరియు క్రొత్త విధానాన్ని సూచించడానికి ఉపయోగించినప్పటికీ, వాటి వాస్తవ ప్రాముఖ్యతలో అవి ఖచ్చితంగా దైవిక సంకల్పం యొక్క రెండు విభిన్న వెల్లడిలను వివరిస్తాయి (బావింక్ ఇక్కడ అనేక కొత్త నిబంధన రుజువు గ్రంథాలను ఉదహరించాడు). . . ఈ గ్రంధాలలో ధర్మశాస్త్రం మరియు సువార్తను డిమాండ్ మరియు వారముగా, ఆజ్ఞ మరియు వాగ్దానంగా, పాపము మరియు కృపగా, అనారోగ్యం మరియు స్వస్థతగా, మరణం మరియు జీవితంగా పోల్చారు . . . ధర్మశాస్త్రము దేవుని పరిశుద్ధత నుండి వస్తుంది, సువార్త దేవుని కృప నుండి వస్తుంది; ధర్మశాస్త్రం ప్రకృతి నుండి తెలుస్తుంది, సువార్త ప్రత్యేక ప్రత్యక్షత  నుండి మాత్రమే తెలుస్తుంది; ధర్మశాస్త్రము పరిపూర్ణ నీతిని కోరుతుంది, కాని సువార్త దానిని ప్రసాదిస్తుంది; ధర్మశాస్త్రము క్రియల  ద్వారా ప్రజలను నిత్యజీవమునకు నడిపిస్తుంది, మరియు సువార్త విశ్వాసముతో ప్రసాదించబడిన నిత్యజీవము యొక్క సంపద నుండి మంచి కార్యములను ఉత్పత్తి చేస్తుంది; ధర్మశాస్త్ర౦ ప్రస్తుతం ప్రజలను ఖ౦డిస్తు౦ది, సువార్త వారిని నిర్దోషులుగా ప్రకటిస్తో౦ది; ధర్మశాస్త్ర౦ ప్రజల౦దరికీ దానిగురించి అది ప్రసంగిస్తు౦ది, మరియు సువార్త దాని వినికిడిలో జీవి౦చేవారిని మాత్రమే సూచిస్తు౦ది.

సువార్త యొక్క ఈ ప్రదర్శన ఎంత స్పష్టమైనది, విలక్షణమైనది, వాక్యానుసారమైనది మరియు విలువైనది.

సంఘము సువార్తను దాని విస్తృత మరియు సంకుచిత అర్థాలలో బోధించాల్సిన అవసరం ఉంది. సువార్త యొక్క గ్రీకు పదం ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచానికి సువార్తీకరణ అనే పదాన్ని ఇచ్చింది. మత్తయి 28:18-20లో యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞ ప్రకార౦, నిజమైన సువార్త అనేది శిష్యులను తయారుచేసే విషయ౦: మొదటిది, యేసును నమ్మమని స్త్రీపురుషులను పిలిచే సంకుచిత అర్థ౦ వున్నది, రెండవది, యేసు తన ప్రజలకు బోధి౦చిన అన్ని విషయాలను ఆచరి౦చమని వారికి బోధి౦చడ౦ అనే విస్తృత అర్థ౦ వున్నది. సువార్త కోస౦, మనమ౦దర౦ నిజమైన సువార్తీకరణను ప్రోత్సహిద్దా౦.

 

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

W. రాబర్ట్ గాడ్ఫ్రే
W. రాబర్ట్ గాడ్ఫ్రే
డాక్టర్ W. రాబర్ట్ గాడ్‌ఫ్రే లిగోనియర్ బోర్డ్‌కు చైర్మన్, అలాగే కాలిఫోర్నియాలోని వెస్ట్‌మిన్‌స్టర్ సెమినరీలో చర్చి చరిత్రకు సంబంధించిన ప్రెసిడెంట్ ఎమెరిటస్ మరియు ప్రొఫెసర్ ఎమెరిటస్. అతను సేవింగ్ ది రిఫార్మేషన్ మరియు లెర్నింగ్ టు లవ్ ది పామ్స్ వంటి అనేక పుస్తకాల రచయిత.