
హబక్కూకు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
10/07/2025యూదా పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

నేడు చాలా మంది ప్రజలు సంపూర్ణ సత్యం కోసం పోరాటాన్ని వదులుకోవడానికి, యేసు మాత్రమే పరలోకానికి ఏకైక మార్గం అనే నమ్మకాన్ని విడిచిపెట్టడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మత విశ్వాసాలను రక్షణకు సరైన మార్గాలుగా అంగీకరించడానికి శోదించబడుతున్నారు. విచారకరంగా, సంఘాలు కూడా ఈ తప్పుడు బోధలకు అతీతంగా ఉండలేకపోతున్నాయి, వాస్తవానికి కొన్ని సంఘాలు ఒత్తిడికి లొంగిపోయి, సత్యాన్ని తిరస్కరించి తప్పుడు బోధలను స్వీకరించాయి. ఈ సమస్యల గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పే యూదా పత్రిక తరచుగా నిర్లక్ష్యం చేయబడింది. ఈ పత్రిక క్లుప్తంగా ఉన్నప్పటికీ, అర్థం చేసుకోవడంలో గందరగోళానికి గురిచేసే కష్టమైన వాక్యాలతో నిండి ఉండటం బహుశా దీనికి కారణం కావచ్చు. అయితే, యూదా సందేశం ఈ రోజుల్లో ప్రత్యేకంగా అవసరం, ఎందుకంటే ఇది “తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారు” (యూదా 1) విశ్వాసం కోసం పోరాడాలని మరియు విశ్వాసంలో కొనసాగాలని గుర్తు చేస్తుంది.
యూదా పత్రిక రచయిత యేసు మరియు యాకోబుల తమ్ముడు యూదా. వీరిలో రెండవ వాడైన యాకోబు ఆదిమ సంఘంలో ముఖ్యమైన నాయకుడు, అతని పేరు మీద ఉన్న పత్రికను కూడా అతనే రాశాడు (మార్కు 6:1–6; అపొస్తలుల కార్యములు 15:13–21; గల. 2:9; యాకోబు 1:1). ముఖ్యమైన విషయం ఏమిటంటే యూదా యేసు భూసంబంధమైన జీవితం మరియు పరిచర్య సమయంలో ఆయన అనుచరుడు కాదు (యోహాను 7:5), కానీ, యేసు పునరుత్థానం తర్వాత రక్షణ పొంది విశ్వాసంలోకి వచ్చాడు (అపొస్తలుల కార్యములు 1:12–14). యూదా పత్రికలోని విషయాలు 2 పేతురు పత్రికతో ఎంతో పోలికలు కలిగి ఉన్నందున, ఇది కూడా 2 పేతురు పత్రిక వలే క్రీ.శ. 60వ దశకం మధ్య కాలంలోనే వ్రాయబడి ఉండవచ్చు.
యూదా పత్రికను అతను ఒక నిర్దిష్ట సంఘానికో లేదా సంఘాల సమూహానికో వ్రాస్తున్నాడని అతని పత్రిక వెల్లడిస్తుంది, ఆ సంఘాలలో “కొందరు రహస్యముగా జొరబడియున్నారు… వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు”(యూదా 4). పాత నిబంధన మరియు యూదు సాహిత్యానికి సంబంధించిన అనేక సూచనల కారణంగా, యూదా పాఠకులు బహుశా యూదు క్రైస్తవులు కావచ్చు, అయితే కొంతమంది పండితులు ఈ సూచనలు అతని ప్రేక్షకుల కంటే యూదా స్వంత నేపథ్యం గురించి ఎక్కువగా చెబుతాయని నమ్ముతారు.
ముఖ్యంగా దేవుని నిబంధన ప్రేమలో యూదా తన కార్యాచరణకు పిలుపునిచ్చాడు. మొదట, దేవుడు ఎవరో దాని వెలుగులో వారు ఎవరో విశ్వాసులకు అతను చెబుతాడు. ఆ తర్వాత, విశ్వాసులను విశ్వాసం కోసం పోరాడమని మరియు దానిలో కొనసాగమని అతను పిలుస్తున్నాడు. యూదా తన పాఠకుల ఆలోచనలను త్రియేక దేవుని మహిమ, ఘనత, ఆధిపత్యం మరియు అధికారంపై కేంద్రీకరిస్తాడు, తద్వారా వారు విశ్వాసం కోసం పోరాడటానికి మరియు దానిలో స్థిరంగా ఉండటానికి సన్నద్ధులవుతారు.
- విశ్వాసులు దేవునిచే పిలువబడ్డవారు
యూదా తన పత్రికను “పిలువబడినవారికి” (యూదా 1) అని సంబోధిస్తాడు. దేవుడు ప్రజలను తన వద్దకు పిలిచినప్పుడు, వారి కళ్ళు తెరవబడతాయి తద్వారా “వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరుగుతారు” (అపొస్తలుల కార్యములు 26:18). విశ్వాసులు విశ్వాసం ద్వారా క్రీస్తుతో ఐక్యమై, “తండ్రియైన దేవునియందు ప్రియమైనవారు” (యూదా 1). క్రీస్తులో “జగత్తు పునాది వేయబడకమునుపే” ఎన్నుకోబడినవారు(ఎఫె. 1:4), వారు “యేసుక్రీస్తు నందు భద్రము చేయబడినవారు” (యూదా 1). దేవునిచే పిలువబడిన వారు ఆయనచేత నీతిమంతులుగా ప్రకటించబడ్డారు మరియు మహిమపరచబడ్డారు కూడా (రోమా 8:30). కాబట్టి దేవుడు మాత్రమే “తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలబెట్టగలడు” (యూదా 24).
2. విశ్వాసులు విశ్వాసం కోసం పోరాడాలి
యూదా తాను ప్రసంగించిన విశ్వాసులకు “వ్రాయవలసిన అవసరముందని భావించాడు”, “పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ కొరకు తీవ్రంగా పోరాడమని” వారిని ప్రోత్సహించాడు (యూదా 3). యూదా, విశ్వాసులు తమ అత్యంత ప్రియమైన విశ్వాసం కోసం పోరాడాలని గుర్తుచేస్తున్నాడు, ముఖ్యంగా వారి సంఘాలలోకి ఎవరూ గుర్తించకుండా చొరబడిన కృప యొక్క వక్రీకృత బోధనల మధ్య ఇది చాలా అవసరం అని నొక్కిచెబుతున్నాడు. విశ్వాసం కోసం పోరాడమని వారిని ప్రోత్సహించడానికి, యూదా తన పాఠకులకు భక్తిహీనులపై వచ్చే దేవుని తీర్పు గురించి గుర్తుచేస్తున్నాడు, భవిష్యత్తులో భక్తిహీనులపై వచ్చే తీర్పు గురించి హెచ్చరించడానికి గతంలోని ఉదాహరణలను ఉపయోగిస్తాడు (యూదా 5–16).
3. విశ్వాసులు విశ్వాసంలో కొనసాగాలి
విశ్వాసులు సత్యం పట్ల మొద్దుబారిపోవచ్చు, తప్పును సులభంగా అంగీకరించవచ్చు, దేవుని నిజమైన కృపను వక్రీకరించవచ్చు, మరియు క్రీస్తును తమ యజమానిగా, ప్రభువుగా తిరస్కరించవచ్చు కాబట్టి యూదా వారిని “అతిపరిశుద్ధమైన దానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి” (యూదా 20–21) అని పిలుస్తున్నాడు. అంతేకాకుండా,సందేహపడువారిమీద కనికరము చూపాలి, సత్యాన్ని గుర్తు చేయడం ద్వారా వారు తప్పులో పడకుండా సహాయం చేయాలి (యూదా 22–23).
బహుశా మీరు నేడు విశ్వాసం కోసం పోరాటాన్ని విరమించుకుని, ఇతర మత విశ్వాసాలను స్వీకరించాలనే మన సంస్కృతి పిలుపును మెల్లగా అంగీకరించి ఉండవచ్చు. లేదా విశ్వాసం యొక్క కేంద్ర సిద్ధాంతాలపై మీ నమ్మకం నుండి జారిపోయి, బదులుగా వేరే మార్గాన్ని అనుసరిస్తుండవచ్చు. జీవితంలో కష్టతరమైన కాలం కారణంగా మీరు బైబిల్ అధ్యయనాన్ని వదులుకుని ఉండవచ్చు మరియు మళ్ళీ లేఖనాల స్థిరమైన అధ్యయనానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. లేదా నేటికీ తప్పుడు బోధలు సంఘలలోకి చొరబడుతున్నాయని మీకు కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం ఉండవచ్చు. మతపరంగా ఇతర మత విశ్వాసాల సమాజం మధ్యలో త్రియేక దేవుడు ఎంత గొప్పవాడో మీరు గుర్తుంచుకోవాలి. ఏదేమైనా, యూదా మనందరికీ ఒక సమయోచిత సందేశాన్ని అందిస్తున్నాడు. విశ్వాసం కోసం పోరాడాలని మరియు దానిలో కొనసాగాలని ఆయన మనల్ని పిలుస్తున్నాడు, అదే సమయంలో మనకు లభించిన రక్షణపై నిశ్చయతను కలిగి ఉండాలని, మరియు దేవుని మహిమ, ఘనత, ఆధిపత్యం, అధికారం ఎంతో గొప్పవి, శాశ్వతమైనవి అని మనల్ని స్థిరపరుస్తున్నాడు.
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
సారా ఇవిల్ (ThM, డల్లాస్ థియోలాజికల్ సెమినరీ) బైబిల్ బోధకురాలు, సమావేశాలలో వక్త, ఆమె తన భర్త నలుగురు పిల్లలతో నార్త్ కరోలినాలోని మాథ్యూస్‌లో నివసిస్తూ, క్రైస్ట్ కోవెనెంట్ చర్చి (PCA)లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ది గాడ్ హూ హియర్స్ అండ్ లూక్: దట్ యు మే హావ్ సర్టెనిటీ కన్సర్నింగ్ ది ఫెయిత్ వంటి అనేక పుస్తకాలు, బైబిల్ అధ్యయనాలను రచించారు. మరింత తెలుసుకోవడానికి, దయచేసి www.sarahivill.com ని సందర్శించండి.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.