ఆమోసు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
26/06/2025
3-Things-About-Proverbs
సామెతల గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
03/07/2025
ఆమోసు గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
26/06/2025
3-Things-About-Proverbs
సామెతల గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
03/07/2025

యోబు గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

3-Things-About-Job

ఆంథోనీ సెల్వాగియో

  1. యోబు ఒక అన్యజన పితరుడి గురించిన పురాతన పుస్తకం.

యోబు గ్రంథం పాత నిబంధనలోని ఎస్తేరు మరియు కీర్తనల గ్రంథాల మధ్య భాగంలో ఉంచబడింది. ఈ అమరిక కొన్నిసార్లు యోబు ఎవరు, అతను ఎప్పుడు జీవించాడు అనే దాని గురించి తప్పుడు అవగాహనలకు దారితీస్తుంది.

మొదట, యోబు ఇశ్రాయేలీయుడు కాదని చాలా మంది పండితులు అంగీకరిస్తారు. అతను కనాను దేశంలో కాకుండా ఊజు దేశంలో నివసించాడనే వాస్తవం నుండి ఈ నిర్ధారణ వచ్చింది (యోబు 1:1). విలాపవాక్యములు ఏదోము ఊజు దేశంతో సంబంధం కలిగి ఉన్నట్లు సూచిస్తున్నందున, యోబు ఏదోము ప్రాంతంలోనే నివసించి ఉండవచ్చు(విలాపవాక్యములు 4:21). యోబు ఇశ్రాయేలీయుడు కానప్పటికీ, అతను ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించి సేవించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. యోబు ఇశ్రాయేలు దేశం వెలుపల జీవించడం వల్ల, సామెతల మాదిరిగానే యోబు గ్రంథంలోని జ్ఞానం విశ్వవ్యాప్తంగా వర్తిస్తుందని తెలియజేస్తుంది, ఇది మానవులందరూ పోరాడుతున్న సమస్యల గురించి (బాధ వంటివి) మాట్లాడుతుంది అనే వాస్తవాన్ని సూచిస్తుంది.

రెండవ తప్పుడు అభిప్రాయం ఏమిటంటే యోబు సంఘటనల కాలక్రమానికి సంబంధించినది, అది ఎస్తేరు గ్రంథంలో చెప్పబడిన సంఘటనల సమయంతో (క్రీ.పూ. 486–485) ఏమాత్రం ఏకీభవించదు. బదులుగా, ఈ సంఘటనలు అబ్రహాము కాలానికి మరియు పితరుల కాలానికి (సుమారుగా క్రీ.పూ. 2100–1800) దగ్గరగా ఉంటాయి. నిజానికి, చాలా మంది పండితులు యోబు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కాలానికి పూర్వమే, అంటే ఆ కాలానికి ముందే జీవించాడని నమ్ముతారు. యోబు పితరుల కాలంలోనే జీవించి ఉన్నాడనే వాదనను బలపరిచే అనేక ఆధారాలు ఉన్నాయి. మొదటిది, యోబు గ్రంథంలో దేవునికి ఉపయోగించిన దైవిక పేర్లు పితరుల కాలం నాటి గ్రంథాలలో కనిపించే పేర్లకు  సమానంగా ఉంటాయి. రెండవది, యోబు సంపద (అంటే పశువుల సంఖ్య, దాసుల సంఖ్య, విలువైన లోహాలు) గురించిన వర్ణన కూడా పితరుల కాలానికి అనుగుణంగా ఉంది. మూడవది, యోబు జీవితకాలం 140 సంవత్సరాలు (యోబు 42:16) పితరుల జీవితకాలానికి అనుగుణంగా ఉంటుంది. నాల్గవది, అత్యంత నమ్మదగిన అంశం ఏమిటంటే, యోబు తన కుటుంబానికి యాజకునిగా వ్యవహరించడం, ఇది లేవీయుల యాజకత్వం ఇంకా స్థాపించబడలేదని స్పష్టంగా సూచిస్తుంది (యోబు 1:5).

  1. యోబు గ్రంథం దేవుడు తన జ్ఞానయుక్తమైన ఉద్దేశ్యాల ప్రకారం నీతిమంతులను బాధలు అనుభవించడానికి అనుమతిస్తాడని మనకు బోధిస్తుంది.

తరచుగా, యోబు గ్రంథం మానవ బాధల రహస్యాన్ని వివరిస్తుందని ప్రజలు అనుకుంటారు; కానీ అది నిజం కాదు. అయితే, యోబు ఎందుకు బాధపడ్డాడో మాత్రం అది మనకు స్పష్టంగా వివరిస్తుంది (ఆ కారణం యోబుకు ఎన్నడూ తెలియజేయబడలేదు). యోబు దేవుణ్ణి ఆరాధించడానికి ఏకైక కారణం దేవుడు యోబును ఆశీర్వదించినందుకేనని సాతాను వాదించడం వల్ల యోబు బాధపడ్డాడు. దేవుడు ఈ ఆశీర్వాదాలను తొలగిస్తే, యోబు దేవుని నామాన్ని శపిస్తాడని సాతాను ఊహించాడు (యోబు 1:9–11).  దేవుడు తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని ప్రదర్శిస్తూ, సాతాను తన వాదనను పరీక్షించుకోవడానికి అనుమతిస్తాడు, అయితే ఆ పరీక్షలో సాతాను తప్పు అని నిరూపించబడ్డాడు, తద్వారా దేవుని న్యాయం మరియు యోబు యథార్థతమైన జీవితమూ తేటతెల్లమయ్యాయి. దేవుడు తాను ఎవరో అనే కారణంతోనే ఆరాధనకు అర్హుడని నిరూపించబడ్డాడు, మరియు యోబు యథార్థత గల వ్యక్తి అని నిరూపించబడ్డాడు.

కానీ యోబు కథలోని పాఠాలు ఊజు దేశంలో నివసించిన ఆ పురాతన వ్యక్తికి మాత్రమే పరిమితం కాకూడదు. ఈ కథ ద్వారా దేవుని సార్వభౌమాధికారం, మానవ బాధలు, మరియు వ్యక్తిగత నీతి మధ్య ఉన్న మర్మమైన సంబంధం వెలుగులోకి వస్తుంది. ఈ అద్భుత వృత్తాంతం మానవ జీవితాల్లో ఎదురయ్యే అనేక ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడమే కాకుండా, తప్పుడు వేదాంతానికి ఇది ఒక దిద్దుబాటు మార్గాన్ని చూపుతుంది. బాధ ఎల్లప్పుడూ పాపంతో ముడిపడి ఉండదనే సూత్రాన్ని స్థాపించడం ద్వారా యోబు కథ ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తుంది. యోబు కథ మనకు బోధించే కీలకమైన సత్యం ఏమిటంటే, ఈ పతనమైన లోకంలో నీతిమంతులు కూడా బాధలు పడతారు. యోబు 1:1 మనకు తెలియజేసినట్లుగా, యోబు యథార్థవంతుడు, నిందారహితుడు, మరియు నీతిమంతుడు. అయినప్పటికీ, గ్రంథంలో మిగిలిన భాగం స్పష్టం చేస్తున్నట్లుగా, అతను తీవ్రమైన బాధలు అనుభవించాడు.

బాధలు అనుభవించే నీతిమంతుడి ఉదాహరణను మన ముందు ఉంచడం ద్వారా, యోబు గ్రంథం “ప్రతీకార వేదాంతశాస్త్రం” అని పిలువబడే దానికి సహాయకరమైన దిద్దుబాటును అందిస్తుంది. ప్రజలు తమ అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనగా బాధపడతారని మరియు వారి నీతిమంతమైన చర్యలకు ప్రతిఫలం పొందుతారని ప్రతీకార వేదాంతశాస్త్రం చెబుతుంది. యోబు స్నేహితులు ఈ తప్పుడు వేదాంతాన్ని స్వీకరించారు, మరియు ఆధునిక విశ్వాసులైన మనం కూడా అలాగే చేయడానికి శోధింపబడవచ్చు. కృతజ్ఞతగా, యోబు గ్రంథం అలాంటి ఆలోచనలోని అబద్ధాన్ని బయటపెడుతుంది, దేవుడు తన మంచి మరియు జ్ఞానవంతమైన ఉద్దేశ్యాల కోసం నీతిమంతులు కూడా బాధపడటానికి అనుమతిస్తాడని అది మనకు గుర్తుచేస్తుంది, అయితే అలాంటి బాధలను భరించే వారికి ఆ ఉద్దేశ్యాల వివరాలు తరచుగా తెలియజేయబడవు.

  1. యోబు యేసుక్రీస్తు విమోచన కార్యాన్ని ముందుగానే సూచిస్తున్నాడు.

యోబు గ్రంథం యేసుక్రీస్తు కార్యాన్ని మనకు సూచించే ఒక మార్గం ఏమిటంటే, తనకు మరియు దేవునికి మధ్యవర్తిత్వం వహించడానికి ఎవరో ఒకరు ఉండాలని యోబు తీవ్రంగా ఆకాంక్షించడం. కథ సాగిన కొద్దీ యోబు దేవుణ్ణి ప్రశ్నించడం ప్రారంభిస్తాడు మరియు ఒకానొక సమయంలో అతను విసిగిపోయి తన పక్షాన దేవుని ముందు నిలబడటానికి ఒక మధ్యవర్తి కావాలని తీవ్రంగా కేకలు వేస్తూ  కలత చెందుతాడు(యోబు 9:32–35). నిస్సందేహంగా, దేవుడు యేసుక్రీస్తులో అలాంటి మధ్యవర్తిని అందించాడని కొత్త నిబంధన మనకు వెల్లడిస్తుంది (1 తిమో. 2:5–6).

అయితే యోబు గ్రంథం క్రీస్తు విమోచన కార్యాన్ని ముందుగానే సూచించే ప్రాథమిక విధానం ఏమిటంటే, దేవుని జ్ఞానయుక్తమైన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి ఒక నీతిమంతుడు గొప్ప శ్రమలను ఎదుర్కోవచ్చు అని మనకు బోధిస్తుంది. మనం చూసినట్లుగా దేవుని నీతిని మరియు యోబు యథార్థతను న్యాయపరంగా నిలబెట్టేందుకు, దేవుడు నీతిమంతుడైన యోబు బాధపడటానికి అనుమతించాడు. నిస్సందేహంగా, యేసుక్రీస్తు ప్రతి విషయంలోనూ పరిపూర్ణ నీతిమంతుడైనప్పటికీ, దేవుని జ్ఞానవంతమైన ఉద్దేశ్యాలను నెరవేర్చడానికి, మరియు తన ప్రజల రక్షణ ప్రణాళికను సుస్థిరం చేయడానికి దేవుని ఉగ్రతను అనుభవించడానికి అనుమతించబడ్డాడు. యోబు కథ సిలువ కథను ముందుగానే సూచిస్తుంది, నిజానికి, సిలువ కథలోనే మనం బాధ యొక్క అసలైన అర్థాన్ని, దాని ప్రాముఖ్యతను కనుగొంటాము.

ఈ వ్యాసం బైబిలులోని ప్రతి పుస్తక౦లో భాగ౦: తెలుసుకోవాల్సిన 3 విషయాలు .

రెవరెండ్ ఆంథోనీ టి. సెల్వాగియో రోచెస్టర్, ఎన్.వై.లోని రోచెస్టర్ క్రిస్టియన్ రిఫార్మ్డ్ చర్చికి సీనియర్ పాస్టర్. ఆయన ఫ్రమ్ బాండేజ్ టు లిబర్టీ: ది గోస్పెల్ అకార్డింగ్ టు మోసెస్ మరియు ఎ సామెతలు డ్రైవెన్ లైఫ్ అండ్ కన్సిడరింగ్ జోబ్ వంటి అనేక పుస్తకాల రచయిత లేదా సంపాదకుడు.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.        
ఆంథోనీ సెల్వాగియో
ఆంథోనీ సెల్వాగియో
Rev. Anthony T. Selvaggio is senior pastor of Rochester Christian Reformed Church in Rochester, N.Y. He is author or editor of several books, including From Bondage to Liberty: The Gospel according to Moses and A Proverbs Driven Life and Considering Job.