
యూదా పత్రిక గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
15/07/2025
ఎజ్రా గ్రంథం గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు
22/07/2025యోనా గురించి మీరు తెలుసుకోవలసిన 3 విషయాలు

యోనా సాహసయాత్ర లేఖనంలో బాగా తెలిసిన కథలలో ఒకటి. సంఘంలోని ఏ పిల్లవాడిని అడిగినా, దాని గురించి మీకు స్పష్టమైన సమాధానం లభిస్తుంది. అదే హబక్కూకు లాంటి వేరే చిన్న ప్రవక్తల గురించి అడిగితే, అంత స్పష్టమైన జవాబు దొరకదు. కానీ ఈ గ్రంథం గుర్తుండిపోయేదే అయినప్పటికీ, చాలామందికి దాని పూర్తి అర్థం తెలియదు. మొండి ప్రవక్త, పెద్ద చేప ఇందులో ముఖ్యమైనవి కావు. నిజానికి, ప్రశ్నార్థకంతో ముగిసే ఈ పుస్తకం దేవుని మహిమ మరియు కృప వెలుగులో మన జీవితాల అర్థాన్ని లోతుగా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతుంది.
1. యోనా దేవుణ్ణి విధేయతతో అనుసరించడంలో మనకు సహాయం చేయగలడు
విధేయత చూపవలసిన దేవునికి ఎలా వ్యతిరేకంగా ప్రవర్తించకూడదో యోనా మనకు ఒక పాఠాన్ని నేర్పుతాడు. ఈ గ్రంథం ప్రభువును సార్వభౌమాధికారిగా వెల్లడిస్తుంది. ఆయన సలహాలు ఇవ్వడు; ఆజ్ఞలిస్తాడు. అన్యజనులైన నావికులు కూడా దేవుని సర్వశక్తిని అంగీకరిస్తూ “యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి” (యోనా 1:14) అని అంటున్నారు. దేవుడు స్పష్టంగా, ఖచ్చితంగా చర్య తీసుకుంటాడు. ఆయన “సముద్రము మీద పెద్ద గాలిని వీచేలా చేశాడు” (యోనా 1:4). ఆయన “ఒక గొప్ప మత్స్యమును యోనాను మ్రింగవలెనని సిద్ధపరిచాడు” (యోనా 1:17). కథ దృఢంగా దేవుని నియంత్రణలో ఉంది.
దేవుని ఆజ్ఞలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన ఇచ్చిన సాధారణ ఆదేశాలు ఓ చిన్న పిల్లవాడితో మాట్లాడినట్లుగా అనిపిస్తాయి: “లేచి”, “వెళ్ళు”, మరియు “పిలువు”. యోనా అవిధేయత చూపింది అతనికి సమాచారం లేకనో, తొందరపాటుతోనో, లేదా బయటి ఒత్తిడుల వల్లనో కాదు. అతనికి కేవలం విధేయత చూపాలని లేదు, అతని తిరుగుబాటు విపత్తుకు కారణమైంది. మన తిరుగుబాటు ద్వారా మనం కూడా దేవుని ఆశీర్వాదాన్ని కావాలనే తిరస్కరించి, ఆయన కఠినమైన శిక్షను కొని తెచ్చుకుంటాము.
కానీ విధేయత నిజమైన భక్తికి ఒక నిదర్శనమైతే, దేవుని పట్ల ప్రేమగల హృదయం నుండి సమర్పణ కలుగుతుంది. యోనా తన మతపరమైన నేపథ్యం గురించి గొప్పగా చెప్పుకున్నాడు, మంచి వేదాంతాన్ని బోధించాడు, కానీ దేవుని పట్ల తన భయాన్ని మాత్రం అతిశయోక్తిగా వివరించాడు (యోనా 1:9). అతని హృదయంలో మరియు అతని చర్యల ద్వారా, అతను “యెహోవా సన్నిధిలో నుండి” పారిపోతున్నాడు (యోనా 1:3, 10). యోనా ఆత్మీయంగా అనారోగ్యంతో ఉన్నాడు. గొప్ప చేప కడుపులో నుండి యోనా చేసిన ప్రార్థన పైకి భక్తిగా అనిపించినా అది ఆత్మస్తుతితో కూడినది, అలాగే గ్రంథం చివర్లో కనిపించే అతని కోపంతో కూడిన దృక్పథం చూస్తే నీనెవెలో వచ్చినంతటి నిజమైన హృదయ మార్పు యోనాకు కూడా అవసరమని తెలుస్తుంది.
గాలి, అలలు, మొక్కలు, జంతువులు, చివరికి అన్యజనుల విధేయత సైతం గర్విష్ఠి ప్రవక్త మొండితనానికి పూర్తి విరుద్ధంగా నిలుస్తాయి. అతడు మనందరికీ ఒక హెచ్చరికగా ఉండాలి.
2. యోనా గ్రంథం మిషనరీల కోసం మార్గదర్శకం వంటిది.
ఇది కొందరికి స్పష్టంగా అనిపించవచ్చు, మరికొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. స్పష్టంగా, యోనా గ్రంథం దేవుని మిషన్ గురించే. పాపంలో ఉన్న వారి పట్ల తనకున్న జాలి వల్లే దేవుడు తన రాబోయే ఉగ్రత గురించి నీనెవె ప్రజలను హెచ్చరించడానికి యోనాను పంపాడు (యోనా 4:2, 11). కానీ దేవుడు తప్పు మిషనరీని ఎంచుకున్నట్లు అనిపించింది కదా! ఈ కథలో యోనా గురించి దాదాపు ఏమీ ఆదర్శప్రాయంగా కనిపించదు, కానీ బహుశా అదే ఇక్కడ ముఖ్య విషయం అనిపిస్తుంది. “అన్యజనులకు వెలుగై యుండునట్లు”గా (యెషయా 49:6) ఉండాల్సిన పిలుపు, యోనా మిషనరీగా చూపిన అయిష్టత వల్ల అతని జీవితంలో ఎలా కనిపించకుండా పోయిందో అతని గ్రంథం చదివిన వారికి అర్థమై సిగ్గుపడేలా చేయాలి. కరుణ పొందిన మనమంతా, కరుణామయుడైన దేవుని ఈ సందేశాన్ని ప్రపంచంతో పంచుకోవడానికి ఆసక్తిగా ఉండాలి.
మరింత ముఖ్యంగా, యోనా వైఫల్యం మిషనరీ వీరుడు అతడు కాదని, ఆ వీరుడు దేవుడేనని నిరూపిస్తుంది. యోనా అయిష్టతతో కూడిన ఈ పని ఇశ్రాయేలీయులను, ఇష్టపూర్వకంగా నశించిన వారిని వెదకి రక్షించే గొప్ప ప్రవక్త కోసం ఎదురుచూసేలా సిద్ధం చేసింది (లూకా 19:10). “భూమియొక్క సమస్తవంశములను” ఆశీర్వదిస్తానని దేవుడు చేసిన సాహసోపేతమైన వాగ్దానాన్ని క్రీస్తు మాత్రమే నెరవేర్చగలడు (ఆది. 12:3). నీనెవె పునరుజ్జీవం, పెంతెకొస్తు దినాన జరిగే సంఘ పుట్టుకను మరియు సాతానుకు దేశాలపై ఉన్న పట్టును దేవుడు తెంచడాన్ని ముందుగానే సూచించింది. దేవుడు క్రీస్తును వర్ణించలేని బహుమతిగా ఇచ్చినందున, ఒక రోజు “కోటానుకోట్ల మంది, వేలవేల మంది” విమోచించబడిన ప్రజలు వధించబడిన గొర్రెపిల్ల యొక్క సాటిలేని విలువను కీర్తిస్తారు (ప్రక. 5:11–12). నిజంగా, “యెహోవా యొద్దనే రక్షణ దొరుకును” (యోనా 2:9).
నశించిన వారిని రక్షించాలనే దేవుని ప్రేమగల హృదయాన్ని యోనా స్పష్టంగా వెల్లడిస్తాడు. ప్రవక్త తన స్వంత సద్గుణాల వల్ల కాదు, క్రీస్తును సూచించే ఒక రూపంగా దేవుని చేతిలో ఉపయోగించబడ్డాడు. క్రీస్తు తానే నిజమైన పరిపూర్ణ ప్రవక్త అని చూపించేందుకే దేవుడు యోనాను క్రీస్తుకు పూర్వఛాయగా నిలిపాడు. యోనా దైవభక్తికి ఆదర్శం కాదు, కానీ అతనిలాగే మనందరికీ అతను చూపించిన క్రీస్తు అవసరం కాబట్టి మనం అతనిపై శ్రద్ధ వహించాలి.
3. యోనా గ్రంథం క్రీస్తును గురించి చెప్తుంది
యేసు విమర్శకులు ఆయన చెప్పుకున్న గుర్తింపును ధృవీకరించడానికి ఒక సూచన కోరినప్పుడు, ఆయన తన తరానికి యోనాను ఉదాహరణగా చూపించాడు (మత్తయి 12:39). యేసు యోనా కథలోని కీలకమైన ఘట్టాన్ని, అంటే చేప కడుపులో మూడు రోజులు, మూడు రాత్రులు ఉండటాన్ని, తన సొంత మరణం మరియు పునరుత్థానానికి ఒక చిత్రంగా అర్థం చేసుకున్నాడు. యోనాను సముద్రంలోకి విసిరేయడం ద్వారా నావికులు అతను మరణిస్తున్నాడని విశ్వసించారు, అందువల్ల, యోనా ప్రతీకాత్మకంగా మరణించినట్లే (యోనా 1:14). ఓడను పగులగొట్టేంతటి “బలమైన తుఫాను” నుండి లేదా చేప కడుపులో మూడు రోజులు గడిపిన తర్వాత యోనా ప్రాణాలతో బయటపడి ఉండకూడదు (యోనా 1:4). చేప కడుపు యోనాకు నీటి సమాధిగా మారింది; కానీ తీరాన అతన్ని వేయడం ద్వారా అతని కొత్త జీవితం ప్రారంభమైంది. పాత యోనా, అన్యజనులను ద్వేషించి, స్వార్థపూరితమైన సుఖాన్ని కోరుకున్నవాడు కాబట్టి, అతను”పాత స్వభావాన్ని” సూచిస్తాడు (ఎఫెసీయులకు 4:22). కొత్త యోనా ఇంకా పూర్తిగా మారకపోయినా, లోపాలు ఉన్నవాడే అయినప్పటికీ, “నూతన స్వభావాన్ని” (లేదా “కొత్త మనిషి”ని) స్థూలంగా సూచిస్తాడు (ఎఫెసీయులకు 4:23-24). యేసు కూడా మరణించి తిరిగి లేస్తాడు. మనం క్రీస్తుతో ఏకత్వం పొందినప్పుడే క్రొత్త సృష్టులమవుతాము, మరియు దేవుని బహుమానాన్ని (లేదా ప్రతిఫలాన్ని) పొందగలుగుతాము (రోమా 6:8).
యోనాకు జరిగిన ప్రతీకాత్మక మరణం మరియు పునరుత్థానం కూడా నీనెవె ప్రజలకు ఆయన ప్రకటించిన పశ్చాత్తాప సందేశాన్ని ధృవీకరించాయి. యేసు సువార్తకు మనం ప్రతిస్పందించడంలో మనం విఫలమైతే మనకు మినహాయింపు చెప్పుకునే అవకాశం మరింత తక్కువగా ఉంటుంది: “నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితోకూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.” (లూకా 11:32).
యోనా గ్రంథం క్రీస్తును గురించి చెప్తుంది(లూకా 24:44–47). దేవుని ముందు నిలబడటానికి అవసరమైన విధేయతను మరియు మన స్వంత దైవిక నడకను ప్రారంభించడానికి సహాయాన్ని క్రీస్తులో మాత్రమే మనం కనుగొంటాము. ఆయనలో, మనం దేవుని కరుణను అనుభవిస్తాము, అది మాత్రమే ఇతరులపై కరుణను చూపడానికి మనల్ని ప్రేరేపించగలదు.
ఈ వ్యాసం “బైబిల్‌లోని ప్రతి గ్రంథం గురించి తెలుసుకోవలసిన మూడు ముఖ్యమైన విషయాలు” అనే శ్రేణిలో భాగంగా ఉంది.
రెవరెండ్ విలియం బోకెస్టీన్ మిచిగన్‌లోని కలమజూలో ఉన్న ఇమ్మాన్యుయేల్ ఫెలోషిప్ చర్చికి పాస్టర్. ఆయన వై క్రైస్ట్ కేమ్, ది గ్లోరీ ఆఫ్ గ్రేస్, గ్లోరిఫైయింగ్ అండ్ ఎంజాయ్యింగ్ గాడ్, మరియు ఫైండింగ్ మై వొకేషన్: ఎ గైడ్ ఫర్ యంగ్ పీపుల్ సీకింగ్ ఎ కాలింగ్ వంటి అనేక పుస్తకాలకు రచయిత మరియు సహ రచయితగా ఉన్నారు.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.