5 Things You Should Know About Moses
మోషే గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
26/03/2026
5 Things You Should Know About Moses
మోషే గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు
26/03/2026

రూతు ఎవరు?

Who Was Ruth?

పాత నిబంధనలో తన పేరిట ఉన్న గ్రంథంలోని ప్రధాన పాత్ర అయిన రూతు, క్రైస్తవులందరికీ ఎంతో సుపరిచితమైన వ్యక్తి. ఈమె చరిత్ర పెద్దలు, పిల్లలు అనే తేడా లేకుండా అందరూ ఎంతగానో ఇష్టపడే కథ. అయితే, ఈ చరిత్ర మనకు తెలిసినదే అయినప్పటికీ, అసలు రూతు ఎవరు అని మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవడం ఎంతో ప్రయోజనకరం. అది మనల్ని మన విశ్వాస జీవితంలో స్థిరంగా కొనసాగేలా మనల్ని ప్రోత్సహించడమే కాకుండా, రూతు జీవితం ఎవరినైతే మనకు సూచిస్తుందో, ఆ రక్షకుడైన క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించేలా చేస్తుంది.

అన్యదేశస్థురాలు

రూతును గురించి మనం మొదటగా తెలుసుకునే విషయం ఏమిటంటే, ఆమె ఒక మోయాబీయురాలు. యూదాలోని బెత్లెహేముకు చెందిన ఎలీమెలెకు, నయోమిల కుమారులలో ఒకరిని ఆమె వివాహం చేసుకుంది (రూతు 1:1-4). ఇది కేవలం ఒక చారిత్రక వివరమే కాదు, ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ఎందుకంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు వారికి సహాయం చేయనందుకు, పైగా దేవుని ప్రజలను శపించడానికి బిలామును కూలికి పిలిపించినందుకు, మోయాబీయులు “యెహోవా సమాజములో ప్రవేశించకూడదని” దేవుని వాక్యం సెలవిస్తోంది (ద్వితీ. 23:3-5). అంతేకాక, ఇశ్రాయేలీయులు మోయాబీయుల “క్షేమమునైనను మేలునైనను ఎన్నడును కోరకూడదని” కూడా ఆజ్ఞాపించబడింది (ద్వితీ. 23:6).

విధవరాలు

రెండవదిగా, రూతు భర్త మోయాబు దేశంలో మరణించడంతో, ఆమె సంతానం లేని విధవరాలిగా మిగిలిపోయింది (రూతు 1:5). ఆమెకు కేవలం భర్తను కోల్పోయిన దుఃఖమే కాకుండా, మామగారు మరియు మరిదిని కూడా కోల్పోయిన తీరని వేదన మిగిలింది. ఆ శ్రమల కాలంలో, కరువు తీరి ఆహారం దొరుకుతున్నదన్న వార్త విని బెత్లెహేముకు బయలుదేరిన తన అత్తగారికి తోడుగా ఉండేందుకు, రూతు తన సొంత దేశాన్ని విడిచిపెట్టింది (రూతు 1:6-7).

విశ్వాసపాత్రురాలైన కోడలు

మూడవదిగా, వారు బెత్లెహేముకు చేరుకోకముందే తన స్వదేశమైన మోయాబుకు తిరిగి వెళ్ళమని ఆమె అత్త పట్టుబట్టినప్పటికీ, రూతు అందుకు నిరాకరించింది. ఆ క్రమములో ఆమె తోటి కోడలు వెనుదిరిగి వెళ్ళిపోయింది కానీ, రూతు మాత్రం “నయోమిని హత్తుకుంది” (రూతు 1:14). ఇది ఆమె తీసుకున్న ఎంతో భారమైన, సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే రూతుకు భర్తగా ఇవ్వడానికి నయోమికి వేరే కుమారులు లేరు. ఒకవేళ రూతు ఆమెతోనే ఉండిపోతే, జీవితాంతం సంతానం లేని విధవరాలిగానే ఉండిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఆమె ఇలా ప్రత్యుత్తరమిచ్చింది: “నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను” (రూతు 1:16).

విశ్వాసము గల స్త్రీ

బెత్లెహేముకు వెళ్లే మార్గంలో రూతు, “నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు” (రూతు 1:16) అని తన విశ్వాస ప్రకటన చేసింది. ఆమె చేసిన ఈ ప్రకటన కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆ తర్వాతి రోజుల్లో ఆమె కనబరిచిన దైవభక్తి గల ప్రవర్తన ద్వారా ధృవీకరించబడింది. విశ్వాసముతో ఆమె తనకూ, నయోమికి కావలసిన పోషణ నిమిత్తం చొరవ తీసుకుని: “ఎవని కటాక్షము నామీద నుండునో వాని వెనుక పరిగె ఏరుకొనుటకు పొలమునకు వెళ్లనిమ్మని” కోరింది (రూతు 2:2). అదే విశ్వాసంతో ఆమె పొలంలో కష్టపడి పనిచేసింది (రూతు 2:7). నయోమి పట్ల ఆమె చేసిన వాటన్నింటినీ బట్టి బోయజు ఆమెను ప్రశంసిస్తూ: “యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును” అని ఆశీర్వదించాడు (రూతు 2:12). విశ్వాసముతో రూతు, తనను విమోచించమని బోయజును అడగాలన్న నయోమి ప్రణాళికకు లోబడింది. అంతేకాక, ఎంతో ధైర్యంతో కళ్లమునకు వెళ్లి, తనను వివాహం చేసుకోమని (విమోచకునిగా బాధ్యత చేపట్టమని) బోయజును అర్థించింది (రూతు 3:1-13). విశ్వాసముతో ఆ కార్యం సక్రమంగా పరిష్కరించబడే వరకు ఆమె ఎంతో వివేకముతో వేచి ఉంది (రూతు 3:18).

దైవభక్తి గల భార్య మరియు తల్లి

రూతు తన జీవితంలో ఎన్నో శ్రమలను అనుభవించినప్పటికీ, ఆమె చేసిన సత్కార్యాలకు మరియు చూపిన నమ్మకత్వానికి యెహోవా ప్రతిఫలమివ్వాలని ఎవరైతే ప్రార్థించారో, అదే బోయజును ప్రభువు ఆమెకు బహుమానంగా అనుగ్రహించాడు (రూతు 2:12). బోయజు న్యాయబద్ధంగా అన్ని విషయాలను పరిష్కరించిన తర్వాత, రూతును తన భార్యగా స్వీకరించాడు (రూతు 4:10). అప్పుడు బెత్లెహేములోని పెద్దలు మరియు ప్రజలు వారిని ఈ విధంగా ఆశీర్వదించారు:

యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక.. యెహోవా యీ యౌవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి (రూతు 4:11-12). 

యెహోవా బోయజు మరియు రూతులకు ఒక కుమారుడిని అనుగ్రహించాడు (రూతు 4:13). విశేషమేమిటంటే, ఆ పట్టణంలోని స్త్రీలు ఆ బాలుడిని “విమోచకుడు” అని, “జీవితాన్ని పునరుద్ధరించినవాడు” అని కొనియాడారు (రూతు 4:14-15). అతని పేరు “ఇశ్రాయేలులో ప్రసిద్ధి చెందాలని” వారు ప్రార్థించారు (రూతు 4:14). వారు ఆ బాలునికి ‘ఓబేదు’ అని పేరు పెట్టారు; ఓబేదు అనగా “సేవకుడు” అని అర్థం (రూతు 4:17).

యేసుక్రీస్తు వంశావళి

రూతు కుమారుడైన ఓబేదు, యెషయి తండ్రియు దావీదు తండ్రియు అయ్యాడు (రూతు 4:17). రూతు గ్రంథం దావీదు వంశావళితో ముగియడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం, మన దృష్టిని యేసుక్రీస్తు వంశావళి వైపు మళ్లించడమే:

అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి… శల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదును కనెను(మత్తయి 1:1, 5-6).

బోయజు మరియు ఓబేదుల కంటే యేసుక్రీస్తు అత్యున్నతమైన విమోచకుడు మరియు శ్రేష్ఠుడైన సేవకుడు. ఆయన రాజైన దావీదు కంటే మహోన్నతమైన రాజు. ఆయన కీర్తి నేడు జగమంతటా వ్యాపించి ఉన్నది:

కట్టడను నేను వివరించెదను; 
యెహోవా నాకీలాగు సెలవిచ్చెను – నీవు నా కుమారుడవు; 
నేడు నిన్ను కనియున్నాను. 
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను
భూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను (కీర్తనలు 2:7-8).

రూతు యొక్క విశ్వాస ప్రకటనను, ఆమె దైవిక గుణగణాలను మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని ప్రజల విమోచకుడైన యేసుపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మనం విశ్వాసపాత్రులం కావాలని ప్రోత్సహించబడతాము. ఎందుకంటే ఆ ప్రభువు, “పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయ ధనముగా తన ప్రాణమ నిచ్చుటకును వచ్చెను” (మత్తయి 20:28).

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్ (Ligonier Ministries Blog) లో ప్రచురించబడింది.

సారా ఇవిల్
సారా ఇవిల్
సారా ఐవిల్ (దల్లాస్ థియోలాజికల్ సెమినరీ నుండి థియాలజీలో మాస్టర్ - ThM) బైబిల్ బోధకురాలు మరియు క్రైస్తవ సభల వక్త. ఈమె తన భర్త మరియు నలుగురు పిల్లలతో కలిసి ఉత్తర కరోలినాలోని మాథ్యూస్‌లో నివసిస్తున్నారు, మరియు క్రీస్తు ఒడంబడిక చర్చి (Christ Covenant Church - PCA) లో సభ్యురాలుగా ఉన్నారు. ఈమె అనేక పుస్తకాలు, బైబిల్ అధ్యయనాలను రచించారు, వాటిలో ది గాడ్ హూ హియర్స్ (The God Who Hears) మరియు లూకా: దట్ యు మే హావ్ సర్టెయిన్టీ కన్సర్నింగ్ ది ఫెయిత్ (Luke: That You May Have Certainty Concerning the Faith) ముఖ్యమైనవి. మరింత సమాచారం కోసం, దయచేసి www.sarahivill.com ను సందర్శించండి.