
పాప క్షమాపణ నిశ్చయత అంటే ఏమిటి?
07/04/2026పాప ఒప్పుకోలు అంటే ఏమిటి?
మీరు ఒక సంస్కరించబడిన(Reformed) సంఘారాధనలో పాలుపంచుకుంటున్నప్పుడు, దైవసేవకుడు మిమ్మల్ని పాపపు ఒప్పుకోలు ప్రక్రియలోకి నడిపించడం మీరు గమనించవచ్చు. ఈ క్రమంలో అతను దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించవచ్చు, ఆ తర్వాత పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయవచ్చు లేదా క్రీస్తు అమూల్యమైన రక్తం ద్వారా లభించే పాపక్షమాపణను అధికారికంగా ప్రకటించవచ్చు. అసలు ఈ ‘పాపపు ఒప్పుకోలు’ అంటే ఏమిటి? క్రైస్తవ ఆరాధనలో దీని ప్రాముఖ్యత ఏమిటి? శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆరాధన పద్ధతి యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఒక విశ్వాసిగా ఈ పవిత్రమైన ఘట్టంలో మీరు మరింత భక్తిశ్రద్ధలతో, ఆత్మీయ నిశ్చయతతో ఎలా పాలుపంచుకోవచ్చు? ఈ ప్రశ్నల వెనుక ఉన్న లోతైన వేదాంత సత్యాలను మనం పరిశీలిద్దాం.
పాప ఒప్పుకోలు యొక్క అంతరార్థం
మొదటి యోహాను 1:9 ఇలా సెలవిస్తోంది: “మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును.” ఇక్కడ “ఒప్పుకొనుట” అనే పదానికి యోహాను ఉపయోగించిన గ్రీకు పదానికి “ఏకీభవించుట” లేదా “దేవుడు చెప్పినట్లే చెప్పడం” అని అర్థం. అంటే, మన పాపములను ఒప్పుకోవడం అంటే దేవుని వాక్యం మన దోషాలను ఏ విధంగానైతే వర్ణిస్తుందో, మనం కూడా ఎటువంటి సాకులు చెప్పకుండా దేవుని తీర్పుతో ఏకీభవిస్తూ, ఆయన వాక్య వెలుగులో వాటిని ఒప్పుకోవడం.
సామూహిక ఆరాధనలో, పాపపు ఒప్పుకోలు అనేది ఆరాధన క్రమంలో నిర్దేశించబడిన ఒక ప్రత్యేక ఘట్టం. ఈ నిర్ణీత సమయంలో దైవసేవకుడు క్రీస్తు శరీరమైన సంఘమంతటినీ వారి పాపములను హృదయపూర్వకముగా అంగీకరించేలా నడిపిస్తాడు. అనంతరం, క్రీస్తుయేసు నందు దేవుడు వాగ్దానం చేసిన కనికరాన్ని విశ్వాసులు విశ్వాసముతో పొందుకోవాలని అతను ప్రార్థిస్తాడు.
పాపపు ఒప్పుకోలు యొక్క మూలం
పాత నిబంధన కాలంలోని ప్రత్యక్ష గుడారం మరియు దేవాలయ ప్రాకార ద్వారం తూర్పు ముఖంగా ఉండాలని యెహోవా ఆజ్ఞాపించాడు (నిర్గమ 27:13). ఆదాము హవ్వలు పాపంలో పడిపోయిన తర్వాత ఏదెను తోట నుండి తూర్పు దిశగా వెలివేయబడినందున, దేవుడు ఉద్దేశపూర్వకంగానే ఈ దిశను నిర్ణయించాడు (ఆది 3:24). కాబట్టి, ఆ ప్రవేశ ద్వారం ఇశ్రాయేలీయులు తిరిగి దేవుని యొద్దకు రావాలని ఆయన కృపతో అందించిన ఒక ఆహ్వానానికి చిహ్నంగా నిలిచింది.
ఆరాధకులు ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించగానే వారికి మొదటగా కనిపించేది బలిపీఠం. లోపలికి ప్రవేశించిన వెంటనే వారు అక్కడ నిలిచి, తాము తెచ్చిన బలి పశువుపై తమ చేతులు ఉంచి, యాజకుడు దానిని పరిశుద్ధుడైన దేవునికి అర్పించే సమయంలో తమ పాపాలను వినయంతో ఒప్పుకొనేవారు. “రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” (హెబ్రీ 9:22; లేవీ 17:11) అనే గంభీరమైన సత్యాన్ని ఈ ఆచారం వారికి నిరంతరం జ్ఞాపకం చేసేది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9:10-22 వచనాలు ఈ పాత నిబంధన బలులను ప్రస్తావిస్తూ, ఆ జంతువుల రక్తానికి పాపాలను సంపూర్ణంగా శుద్ధిచేసే శక్తి లేదని స్పష్టం చేస్తున్నాయి. దీనికి భిన్నంగా, క్రీస్తు రక్తము యొక్క శ్రేష్ఠత గురించి లేఖనం ఇలా సెలవిస్తోంది: “నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను నిష్కళంకునిగా దేవునికి అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, జీవముగల దేవుని సేవించుటకు మృతక్రియలనుండి మీ మనస్సాక్షిని ఇంక ఎంత ఎక్కువగా శుద్ధిచేయును!” (హెబ్రీ 9:14).
పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి చేరువవ్వడానికి క్రీస్తు రక్తము ఎంతటి ఆవశ్యకమో చాటిచెప్పడానికి, అనేక సంస్కరించబడిన(Reformed) ఆరాధన క్రమాల్లో (Liturgies) సామూహిక పాపపు ఒప్పుకోలు అనే ఘట్టం ఆరాధన ప్రారంభంలోనే ఉంటుంది. సంస్కర్త జాన్ కాల్విన్ జెనీవా మరియు స్ట్రాస్‌బర్గ్ నగరాల్లోని సంఘాల ఆరాధనను, ఈ క్రింది ‘దేవుని సహాయమును కోరే లేఖన విన్నపము’తో ప్రారంభించేలా క్రమమును ఏర్పాటు చేశారు:
ఆకాశమును భూమిని సృజించిన యెహోవా నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది. ఆమేన్. (కీర్తన 124:8)
ఈ ఆరంభ విన్నపం తర్వాత సామూహిక పాప ఒప్పుకోలు ప్రక్రియ జరిగేది. దీని ప్రాముఖ్యతను వివరిస్తూ జాన్ కాల్విన్ ఈ విధంగా పేర్కొన్నారు:
“వాస్తవానికి, క్రమబద్ధమైన అన్ని సంఘాలలో ఒక ప్రయోజనకరమైన ఆచారంగా, ప్రతి ప్రభువు దినమున దైవసేవకుడు తన తరపున మరియు ప్రజలందరి తరపున ఒక ఒప్పుకోలు ప్రార్థనను రూపొందిస్తారు. అందులో ఆయన అందరి తరపున ఉమ్మడిగా అపరాధములను ఒప్పుకుంటూ, ప్రభువు నుండి క్షమాపణను వేడుకుంటారు.” (ఇన్‌స్టిట్యూట్స్ 3.4.11)
కాల్విన్ మరియు ఇతర సంస్కర్తల ప్రభావం వల్ల ఈ పద్ధతి విస్తృతంగా వ్యాప్తి చెందింది. వెస్ట్‌మినిస్టర్ డైరెక్టరీ ఆఫ్ పబ్లిక్ వర్షిప్ (Westminster Directory of Public Worship) ప్రకారం, ఆరాధనలు ఈ క్రింది విధంగా ప్రారంభం కావాలి: “దేవుని అపరిమితమైన గొప్పతనాన్ని మరియు మహోన్నతమైన ప్రభావాన్ని (ఎవరి సన్నిధిలోనైతే వారు ఒక ప్రత్యేక రీతిలో నిలబడి ఉన్నారో ఆయనను) అంగీకరిస్తూ, ఆయన సన్నిధికి చేరువవ్వడానికి తమకున్న హీనస్థితిని మరియు అయోగ్యతను వినయంతో ఒప్పుకుంటూ ఆరాధనను ప్రారంభించాలి.” ఆ తర్వాత, ఏయే రీతులలో పాపాలను ఒప్పుకోవాలో ఆ డైరెక్టరీ వివరంగా నిర్దేశించింది. వారి ఆత్మీయ వారసులుగా, ఈ సంస్కరణాత్మక (Reformed) ఆరాధన పద్ధతి నేడు మనకు ఒక అమూల్యమైన వారసత్వంగా సంక్రమించింది.
పాపపు ఒప్పుకోలు: ఆచరణాత్మక అన్వయింపులు
మన పాపాలను మరింత యథార్థంగా, భక్తిశ్రద్ధలతో ఒప్పుకోవడానికి ఇక్కడ మూడు ఆచరణాత్మక సూచనలు ఉన్నాయి:
1. మన పాపం యొక్క తీవ్రతను గుర్తించండి
అనేక సందర్భాల్లో మనం కేవలం పాపపు ‘క్రియ’ గురించి మాత్రమే ఆలోచిస్తుంటాము. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ‘ఎవరికి విరోధముగా’ ఆ పాపం చేశాము అనేది.
దీనిని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. నేను గీసిన ఒక సాధారణ చిత్రపటం మీద మీరు సరదాగా మీసం గీశారనుకోండి, అది పెద్ద నేరం అనిపించుకోదు. ఎందుకు? ఎందుకంటే నేను గొప్ప చిత్రకారుడిని కాకపోవచ్చు. కానీ, మీరు పారిస్‌లోని లౌవ్రే (Louvre) మ్యూజియానికి వెళ్లి, డా విన్సీ గీసిన అమూల్యమైన ‘మోనాలిసా’ చిత్రంపై అదే మీసం గీస్తే, మీరు తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చేసిన చర్య ఒక్కటే కావచ్చు, కానీ దాని పరిణామం ఎందుకు మారిపోయింది? ఎందుకంటే, అక్కడ మీరు అవమానించి, అపవిత్రం చేసింది ఒక సామాన్యమైన బొమ్మను కాదు, ప్రపంచం గర్వించే ఒక అద్భుత కళాఖండాన్ని!
అదేవిధంగా, సమస్త సృష్టికి కర్తయు, ప్రభువునైన దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం అత్యంత భయంకరమైన నేరం. బత్షెబతో వ్యభిచరించి, దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆమె భర్తను హతమార్చిన తన ఘోర పాపాన్ని దావీదు ఒప్పుకున్నప్పుడు, ఆయన తన అంతరంగాన్ని ఇలా ఆవిష్కరించాడు: ‘నీకు విరోధముగా, నీకు మాత్రమే విరోధముగా నేను పాపము చేసియున్నాను’ (కీర్తన 51:4). ఇద్దరు వ్యక్తులకు హాని చేసినప్పటికీ, తన నేరం ప్రాథమికంగా పరిశుద్ధుడైన దేవుని మహిమకు వ్యతిరేకంగా జరిగిందని దావీదు ఇక్కడ గుర్తించాడు.
2. సంఘంగా మన పాప స్వభావాన్ని బట్టి పశ్చాత్తాపపడండి
ప్రభువు నేర్పిన ప్రార్థనలో మనం, “మా రుణములు క్షమించుము” (మత్తయి 6:12) అని వేడుకుంటాము. ఇక్కడ ‘మా’ అనే పదం యొక్క ప్రాముఖ్యతను గమనించండి. క్రీస్తు ఆత్మ ద్వారా మనం సంఘములోని ఇతర విశ్వాసులతో ఐక్యపరచబడ్డాము. మన వ్యక్తిగత పాపం కేవలం మనకే పరిమితం కాకుండా, స్థానిక సంఘంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, మనం క్రీస్తు శరీరముగా కలిసికట్టుగా మన పాపాలను ఒప్పుకోవాలి.
అపొస్తలుడైన పౌలు ఇలా అంటున్నాడు: “మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?” (1 కొరింథీ 3:16). ఇక్కడ “మీరు” అనేది కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించినది కాదు; అది సంఘమంతటినీ ఉద్దేశించిన బహువచనం. పరిశుద్ధుడైన దేవుడు నివసించే క్రీస్తు శరీరంలో పాపం ప్రవేశించడం అనేది అత్యంత ఆయాసకరమైన విషయం. సంఘం దేవుని అపురూప ‘కళాక్షేత్రం’ (Art Museum) వంటిది; మనల్ని అందంగా తీర్చిదిద్ది, పవిత్రపరిచే ఆ అమూల్యమైన రంగు క్రీస్తు రక్తం (హెబ్రీ 10:28-31). ప్యూరిటన్ దైవజనుడు థామస్ వాట్సన్ అన్నట్లుగా: “భక్తిహీనుల పాపాలు దేవునికి ఆగ్రహం కలిగిస్తే, ఆయన సొంత ప్రజల పాపాలు ఆయనను ఎంతో దుఃఖపరుస్తాయి.”
3. మన పాపం పట్ల యథార్థమైన పశ్చాత్తాపాన్ని ప్రకటించండి
దేవుని ప్రజలు తమ పాపాలను బహిరంగంగా ఒప్పుకున్న అనేక సందర్భాలను లేఖనాలు మనకు వివరిస్తాయి. ఉదాహరణకు, అరణ్య ప్రయాణంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా ఫిర్యాదు చేసినప్పుడు, యెహోవా వారి మధ్యకు తాపకరమైన సర్పాలను పంపగా వారు పశ్చాత్తాపపడ్డారు (సంఖ్యా 21:7). అలాగే, చెర నుండి తిరిగి వచ్చిన యూదులు యెరూషలేము ప్రాకారాలను నిర్మిస్తూ, దేవుని వాక్య వెలుగులో తమ పితరుల అపరాధాలను, తమ దోషాలను ఒప్పుకొని విలపించారు (నెహెమ్యా 9:1-3). ఈ వృత్తాంతాలన్నీ దేవుని ప్రజల హృదయాల్లోని గాఢమైన పశ్చాత్తాపాన్ని మనకు వినిపిస్తాయి.
నేడు మీ సంఘం అంతటి పతన స్థితిలో లేకపోవచ్చు; అయినప్పటికీ, పరిశుద్ధుడైన ప్రభువుకు వ్యతిరేకంగా చేసే ఏ పాపమైనా మనలో యథార్థమైన దుఃఖాన్ని కలిగించాలి. మన ఆరాధనల్లో తరచుగా చదివే లేదా పాడే అనేక కీర్తనలు, మన అతిక్రమణల పట్ల మనం చెందాల్సిన హృదయపూర్వకమైన విలాపాన్ని ప్రతిధ్వనిస్తాయి. ఇటువంటి పాపపు ఒప్పుకోలు అనేది ప్రతి సంఘారాధనలో క్రమం తప్పకుండా జరిగే ఒక సహజ ఆత్మీయ ప్రక్రియగా ఉండాలి. సంస్కర్త మార్టిన్ లూథర్ అన్నట్లుగా: “మిమ్మల్ని మీ పాపాలను ఒప్పుకోమని నేను హెచ్చరిస్తున్నానంటే, మిమ్మల్ని ఒక నిజమైన క్రైస్తవునిగా జీవించమని హెచ్చరిస్తున్నాననే అర్థం.”
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్ (Ligonier Ministries Blog) లో ప్రచురించబడింది.


