
ప్రేమ బంధం
13/02/2026
పరిశుద్ధుడైన దేవునితో యుద్ధం మరియు సమాధానం
24/02/2026క్రిస్మస్ వృత్తాంతపు మూలాల అన్వేషణ
క్రిస్మస్ వృత్తాంతంలోని అంతరార్థాన్ని మనం సంపూర్ణంగా గ్రహించాలంటే, మనం కాల గమనంలో వెనక్కి వెళ్ళాలి. కేవలం రెండు వేల సంవత్సరాల క్రితం బెత్లెహేము సత్రంలో జరిగిన యేసు జననం దగ్గరకు మాత్రమే కాదు, అంతకంటే మరెంతో వెనక్కి అంటే మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల వరకు మనం వెళ్ళాలి. దేవుడు వారిని అత్యంత రమణీయమైన, ఏ లోటు లేని ఏదెను వనంలో ఉంచాడు. వారికి కావలసినవన్నీ అక్కడ సమృద్ధిగా ఉన్నాయి; ఆ సృష్టి యావత్తూ పరిపూర్ణంగా ఉండేది. అయితే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు. దాని పర్యవసానంగా, దేవుడు వారిని ఆ తోట నుండి వెలివేశాడు. అప్పటి నుండి ఆదాము హవ్వలు పాపపు శాపం క్రింద జీవించాల్సి వచ్చింది. అయితే, పరలోకం నుండి ఆ శాప తీర్పును ఉచ్చరిస్తున్న తరుణంలోనే, దేవుడు తన అపారమైన కృపతో వారికి ఒక మహిమకరమైన వాగ్దానాన్ని కూడా అనుగ్రహించాడు.
దేవుడు ఆదాము హవ్వలకు ఒక ‘సంతానం’ గూర్చిన వాగ్దానాన్ని ఇచ్చాడు; ఆ సంతానం ఒక స్త్రీ గర్భవాసమున జన్మిస్తాడని ఆయన సెలవిచ్చారు. పాపం వల్ల తలకిందులైన వాటన్నింటినీ ఆ సంతానమే తిరిగి సరిచేస్తాడు. విచ్ఛిన్నమైపోయిన ప్రతిదానిని ఆయన మళ్ళీ సంపూర్ణ స్థితికి చేరుస్తాడు. ఎక్కడైతే కలహాలు, వైషమ్యాలు అల్లకల్లోలమైన సముద్రపు అలలవలె ఉధృతంగా పోటెత్తుతాయో, అక్కడ ఈ సంతానమే దైవికమైన శాంతిని, సామరస్యాన్ని పునరుద్దిస్తాడు.
పాత నిబంధనలోని మొట్టమొదటి పుస్తకమైన ఆదికాండము మూడవ అధ్యాయం మానవ చరిత్రలో ప్రవేశించిన ఘర్షణను, శత్రుత్వాన్ని మనకు పరిచయం చేస్తుంది. అప్పటి వరకు కేవలం ప్రశాంతతను మాత్రమే రుచిచూసిన ఆదాము హవ్వలు, ఇకపై చేదు కలహాలతో పోరాడవలసి వచ్చింది. చివరకు వారు సాగు చేసే భూమి సైతం వారికి సవాలుగా మారింది; నేల మొలిపించే ముండ్ల తుప్పలు వారు పొందిన శాపానికి నిరంతర జ్ఞాపికలుగా మిగిలాయి. కవులు వర్ణించినట్లుగా, ప్రకృతి ఇప్పుడు క్రూరమైనదిగా, రక్తసిక్తమైనదిగా మారిపోయింది. వాగ్దానం చేయబడిన ఆ ‘సంతానం’ సైతం ఈ పోరాటంలోకి ప్రవేశించాల్సి వస్తుంది; సమస్తాన్ని పాడుచేసే ఆ ఘటసర్పంతో యుద్ధం చేయాలి. అయితే, ఆ సంతానమే సర్పం యొక్క తలను నలగగొట్టి, తుది విజయాన్ని స్థిరపరుస్తుందని ఆదికాండము 3వ అధ్యాయం మనకు వాగ్దానం చేస్తోంది. ఆ విజయమే సముద్రపు అలల వలె ఒకదాని వెంట ఒకటిగా ఉప్పొంగే అనంతమైన శాంతిని మనకు చేకూరుస్తుంది.
అయితే, ఆ వాగ్దాన సంతానం రావడానికి చాలా కాలం పట్టింది.
ఆదాము హవ్వలకు కయీను, హేబేలు జన్మించారు; కానీ వీరిద్దరిలో ఎవరూ ఆ ‘సంతానము’ కాలేదు. కయీను చేతిలో హేబేలు హతమార్చబడినప్పుడు, అల్లకల్లోలమైన ఆ లోకంలో దేవుడు ఆదాము హవ్వలకు ‘షేతు’ను అనుగ్రహించి తన కృపను చాటుకున్నారు. కానీ షేతు కూడా ఆ వాగ్దాన పుత్రుడు కాదు. ఆ తర్వాత మరెంతో మంది కుమారులు జన్మించారు, ఎన్నో తరాలు గడిచిపోయాయి, కానీ ఆ విమోచకుడు రాలేదు.
అనంతర కాలంలో, అబ్రాహాము ప్రపంచ వేదికపైకి వచ్చాడు. నిరీక్షణ కోల్పోయి అంధకారంలో ఉన్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించే ఒక గొప్ప జనమును అబ్రాహాము, శారాల ద్వారా నిర్మించాలని దేవుడు సంకల్పించి, అతనిని పిలిచాడు. దేవుడు మరొకసారి ఈ దంపతులకు ఒక ‘సంతానమును’ – ఒక కుమారుడిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలమే ఇస్సాకు అని వారు భావించారు. కానీ కాలక్రమేణా ఇస్సాకు కూడా మరణించాడు.
తరతరాలుగా ఈ వృత్తాంతం ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతూనే ఉంది. సమస్తాన్ని సరిదిద్ది, భూమిపై శాంతిని పునరుద్ధరించబోయే ఆ ‘మెస్సయ్య’ రాక కోసం నిరీక్షణ నానాటికీ బలపడసాగింది. ఈ గొప్ప విమోచన చరిత్రలో నయోమి అనే ఒక విధవరాలు, ఆమె కోడలైన రూతు కూడా భాగస్వాములయ్యారు. వారు అత్యంత దయనీయమైన, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రాచీన ప్రపంచంలో, సమాజపు అంచులకు నెట్టివేయబడిన ఇటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి ఎటువంటి సామాజిక భద్రతా వలయాలు ఉండేవి కావు.
భర్తలు, కుమారులు లేక.. కనీస హక్కులు, జీవనాధారం కరువై.. ఆ విధవరాండ్రు పూట గడవడమే కష్టమైన స్థితిలో బ్రతుకులీడ్చారు. ఒక సన్నని ఆశాతంతువు మాత్రమే వారిని ముందుకు నడిపించింది. అటువంటి తరుణంలో బోయజు వారి జీవితాల్లోకి ప్రవేశించాడు; ఆ పైన జరిగినది ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం. బోయజు రూతును కలుసుకున్నాడు, వారు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రూతు గ్రంథం ముగింపు దశకు చేరుకుంటుండగా, దేవుని కృపవల్ల ఆమెకు ఒక కుమారుడు ఒక సంతానము జన్మించాడు. ఆ కుమారుడు నయోమికి ప్రాణప్రదాతగా, ఒక విమోచకుడుగా నిలిచాడు. అయితే, అతను రాబోయే అసలైన ‘సంతానము’నకు కేవలం ఒక ఛాయ మాత్రమే. కాలక్రమేణా, అతను కూడా మరణానికి లొంగిపోయాడు.
రూతు బోయజులకు పుట్టిన ఆ కుమారుని పేరు ఓబేదు. ఓబేదుకు యెష్షయి జన్మించాడు. యెష్షయికి పుట్టిన అనేకమంది కుమారులలో ఒకడు సామాన్యమైన గొర్రెల కాపరి. ఒకనాడు ఈ యవ్వన కాపరి గుప్పెడు రాళ్లను చేతబూని ఒక రాక్షసుడిని (గొల్యాతును) నేలకూల్చాడు; క్రూరమైన సింహాలను సైతం ఎదిరించాడు. అంతేకాదు, అతను హృదయాన్ని హత్తుకునే కీర్తనలను ఆలపించగల శ్రేష్ఠమైన సంగీతకారుడు. తన తండ్రితో సహా అందరినీ విస్మయానికి గురిచేస్తూ – రూతు బోయజుల మునిమనుమడైన ఈ యెష్షయి కుమారుడే ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా అభిషేకించబడ్డాడు.
దావీదు రాజ్య సింహాసనంపై ఆసీనుడై ఉన్నప్పుడు, దేవుడు స్వయంగా ఆయనకు మరొక మహిమకరమైన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఇది కూడా ఒక కుమారుడిని గూర్చిన వాగ్దానమే. దావీదు సంతానమున ఉదయించబోయే ఆ కుమారుడు యుగయుగములు రాజుగా ఏలుతాడని, ఆయన రాజ్యానికి ఇక ఎన్నటికీ అంతము ఉండదని దేవుడు సెలవిచ్చాడు. దేవుని నోట నుండి వచ్చిన ఆ సత్య వాగ్దానం మారనిది.
ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.


