Who Wrote the Bible?
బైబిల్‌ను ఎవరు రాశారు?
12/03/2026
5 Things You Should Know About Fighting Sin
పాపంతో పోరాటం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
19/03/2026
Who Wrote the Bible?
బైబిల్‌ను ఎవరు రాశారు?
12/03/2026
5 Things You Should Know About Fighting Sin
పాపంతో పోరాటం గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
19/03/2026

క్రైస్తవ జీవితం ఒక పరలోక యాత్ర

The Christian Life as Pilgrimage

నిజమైన ఆత్మీయ పరాక్రమాన్ని చూడగోరే వారు,
ఇక్కడికి రండి; 
ఎలాంటి గాలులు వీచినా, వాతావరణం ఎలా ఉన్నా, 
ఇక్కడ ఒకడు స్థిరంగా నిలుస్తాడు. 
ఏ నిరుత్సాహమూ అతడిని వెనక్కి తగ్గించదు; 
ఒక యాత్రికుడిగా కొనసాగాలన్న 
తన మొదటి దృఢ సంకల్పం నుండి 
ఏదీ అతడిని మళ్లించలేదు.

అర్ధ శతాబ్దం క్రితం, రాల్ఫ్ వాన్ విలియమ్స్ (Ralph Vaughan Williams) స్వరపరిచిన సంగీతంతో ఈ మాటలను నేను పాఠశాల ప్రార్థన కూటములలో పాడేవాడిని. ఈ పద్యం జాన్ బన్యన్ రచించిన ‘ది పిల్‌గ్రిమ్స్ ప్రోగ్రెస్’ (యాత్రికుని ప్రయాణం) రెండవ భాగంలో, ‘మిస్టర్ వాలియంట్-ఫర్-ట్రూత్’ (సత్యం కోసం పోరాడే యోధుడు) తన సాక్ష్యాన్ని పంచుకునే సందర్భంలో కనిపిస్తుంది. అంతకుముందే, వాలియంట్ తనను తాను ‘మిస్టర్ గ్రేట్-హార్ట్’ మరియు అతని సహచరులకు పరిచయం చేసుకుంటూ, “నేను ఒక యాత్రికుడిని, నేను పరలోక నగరానికి (Celestial City) ప్రయాణిస్తున్నాను” అని తెలియజేశాడు.

క్రైస్తవులందరూ పరలోక నగరమే గమ్యంగా సాగిపోతున్న యాత్రికులు. జాన్ బన్యన్ తాను ఎంతగానో ప్రేమించిన బైబిల్ సత్యాలనే ఇక్కడ ప్రతిబింబించాడు. క్రైస్తవులు యాత్రికులని లేఖనాలు స్పష్టంగా రూఢీపరుస్తున్నాయి. మన పితరుడైన అబ్రాహాముతో చేసిన ఆదర్శప్రాయమైన నిబంధనలో, దేవుడు కనాను దేశాన్ని అతనికి “నీవు పరదేశివై యున్న దేశము” (ఆదికాండము 17:8) గా వాగ్దానం చేశాడు. అలాగే కొత్త నిబంధనలో, పేతురు తన పాఠకులను “ఏర్పరచబడిన పరదేశులు” అని సంబోధిస్తూ ఇదే భావాన్ని వ్యక్తం చేశాడు (1 పేతురు 1:1; 1:17 కూడా చూడండి: “మీ పరవాస కాలము”). అదేవిధంగా, పాత నిబంధన చరిత్రలోని విశ్వాస వీరులను గురించి వివరిస్తూ, హెబ్రీ పత్రిక రచయిత వారిని ఈ భూమి మీద “అన్యులును పరదేశులును” (హెబ్రీ 11:13) అని పేర్కొన్నాడు.

క్రైస్తవ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం; అది అత్యంత ఉత్సాహభరితమైన యాత్ర. దీనికి ఒక ప్రారంభ స్థానం ఉంది, అలాగే ఒక ఖచ్చితమైన అంతిమ గమ్యమూ ఉంది. ఇది నిరంతర చలనాన్ని (movement) సూచించే ఒక రూపకం. క్రైస్తవులు ఒకే చోట ఎక్కువ కాలం నిలిచిపోరు, ఎందుకంటే వారు వేరొక గమ్యస్థానానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నారు. అందుకే, ఆదిమ క్రైస్తవులను “ఈ మార్గమున ఉన్నవారు” అని పిలిచేవారు—తాము ఒక భిన్నమైన బాటలో పయనించాలని వారు ఎంతటి దృఢ నిశ్చయంతో ఉన్నారో ఇది స్పష్టం చేస్తుంది (అపొస్తలుల కార్యములు 9:2; 24:14).

దీని నుండి కొన్ని ముఖ్యమైన అంశాలు తలెత్తుతాయి. మొదటిది, ‘సాహసం’ (Adventure) అనే భావన. అవును, ఇది ఒక సాహసయాత్రే. ‘ద హాబిట్’ (The Hobbit) కథలో బిల్బో బాగిన్స్, తన దైనందిన జీవితంలోని నిలకడను సాహసం దెబ్బతీస్తుందనే భయంతో మొదట్లో దానిని నిరాకరించాడు. కానీ ఆ తర్వాత, ఊపిరి బిగబట్టేలా సాగే తన అసాధారణ ప్రయాణాన్ని “అక్కడికి మరియు తిరిగి ఇక్కడికి” (There and Back Again) అనే ఉపశీర్షికతో ఒక అద్భుతమైన గాథగా నమోదు చేశాడు.

క్రైస్తవులు కొంత భిన్నమైన యాత్రను సాగిస్తారు—బహుశా దానిని “ఇక్కడి నుండి అక్కడికి” (పరలోక గమ్యానికి) చేసే ప్రయాణమని అనవచ్చు. అయినప్పటికీ, ఇది కూడా అంతే ఉత్సాహభరితమైనది; వీరోచిత గాథలతోనూ, ప్రమాదకరమైన సవాళ్లతోనూ నిండినది. నిజానికి క్రైస్తవ జీవితంలో ఒక అద్భుతమైన ఉత్సాహం ఉంది. ప్రతి మలుపులోనూ దేవుని పోషణ, ఆయన జోక్యం, మరియు ఆయన రక్షణలను కొత్త కోణాల్లో దర్శించే క్షణాలు మన కోసం వేచి ఉన్నాయి. రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు (సామెతలు 27:1); కానీ మన పరలోకపు తండ్రి చిత్తం లేకుండా ఏదీ జరగదని మనం నిశ్చయంగా నమ్మవచ్చు. మన యజమాని మనలను ఎక్కడికి నడిపించినా—అవి పచ్చిక బయళ్లయినా, ప్రశాంతమైన జలధారలైనా, లేదా శత్రువుల సమక్షంలో మరణాంధకారపు లోయలైనా—ఆయనను అనుసరించడానికే మనం పిలువబడ్డాము (కీర్తన 23).

నేను ప్రస్తుతం సేవ చేస్తున్న సంఘంలో నా ఆప్తమిత్రుడు, నాకంటే ముందుగా పరిచర్య చేసిన వారు మరియు ‘టేబుల్‌టాక్’ (Tabletalk) పాఠకులకు సుపరిచితులైన సింక్లెయిర్ ఫెర్గూసన్ (Sinclair Ferguson), తరచుగా తన ప్రసంగాలను ఎంతో ఉత్సాహంతో, “క్రైస్తవుడిగా ఉండటం ఎంత అద్భుతం కదా!” అనే ఆశ్చర్యార్థక వాక్యంతో ముగించేవారు. అవును, అది నిజంగానే మహా ఆశ్చర్యకరమైన విషయం; ఈ ప్రయాణంలోని ప్రతి క్షణమూ ఎంతో ఉత్సాహాన్నిచ్చే ఒక గొప్ప సాహసయాత్ర.

రెండవది, యాత్ర (Pilgrimage) అనే పదం ఈ లోక జీవితం యొక్క తాత్కాలిక లేదా అనిత్య స్వభావాన్ని మనకు గుర్తుచేస్తుంది. “స్థిరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, రాబోవుచున్న పట్టణమును వెదకుచున్నాము” (హెబ్రీ 13:14). అలాగే, “కనిపించునవి అనిత్యములు” (2 కొరింథీ 4:18). ఈ జీవితాన్ని “అనిత్యమైనది” అనడంలో అర్థం ఏమిటి? దీనికి సమాధానం—క్రొత్త నిబంధనలో మనం చూసే “ఇప్పుడు” (Now) మరియు “ఇంకా సంపూర్ణం కాలేదు” (Not Yet) అనే రెండు వాస్తవికతల మధ్య ఉన్న ఆధ్యాత్మిక ఒత్తిడిలో (Tension) దాగి ఉంది. క్రైస్తవులు ఎవరంటే, “యుగముల అంతము ఎవరి మీదికి వచ్చియున్నదో” అటువంటి వారు (1 కొరింథీ 10:11). రాబోయే నిత్యలోకపు వాస్తవికత ఇప్పటికే మన కాల-స్థల ఉనికిలోకి (Spacetime existence) చొచ్చుకువచ్చి, మనలను వేరొక రాజ్యపు పౌరులుగా మార్చివేసింది (ఫిలిప్పీ 3:20).

ఈ దృక్పథం మనలో కొన్ని మౌలికమైన సంఘర్షణలను (Tensions) కలిగిస్తుంది. ఒక కోణంలో చూస్తే, ఈ లోక పౌరులుగా మనం ఇక్కడ విభిన్నమైన బాధ్యతలను కలిగి ఉన్నాము. లోకం నుండి పూర్తిగా వేరుపడి, అన్నింటినీ త్యజించి ఏకాంతంగా గడపడం అనేది బైబిలు సంబంధమైన ప్రపంచ దృక్పథం కాదు. జీవితం గురించిన ఈ వింతైన ధోరణికి ‘సిమియోన్ స్టైలైట్స్’ (Simeon Stylites the Elder) జీవితం ఒక ఉదాహరణ—అతడు క్రీ.శ. 423లో సిరియాలో ఒక స్తంభం పైకి ఎక్కి, తాను మరణించే వరకు ముప్పై ఏడు సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయాడు. ఇది క్రైస్తవ్యాన్ని చాటిచెప్పే విధానం కాదు, నిజానికి అది క్రైస్తవ్యాన్ని నిరాకరించడమే.

క్రైస్తవులు సమాజంలో మమేకమవుతారు; వారు సమాజాన్ని పునర్నిర్మిస్తారు. వారు చీకటిలో ప్రకాశించే వెలుగులు. క్రైస్తవులలో ఒక “నూతనమైన అనురాగం” (New Affection) చోటుచేసుకుంది; ఆ ప్రేమ ముందు మిగతావన్నీ అల్పమైనవిగా, విలువలేనివిగా కనిపిస్తాయి. థామస్ చామర్స్ (Thomas Chalmers) మాటల్లో చెప్పాలంటే, క్రైస్తవ జీవితం “నూతన ప్రేమ కలిగించే బహిష్కరణ శక్తి” (Expulsive Power of a New Affection) చేత ప్రజ్వలింపబడుతుంది.

యాత్రలోని మూడవ అంశం—ఒక స్పష్టమైన దిశ, ఒక ఉన్నతమైన లక్ష్యం, మరియు ఒక అంతిమ గమ్యం. ఈ ప్రయాణానికి ఒక ఖచ్చితమైన గమ్యస్థానం ఉంది. క్రైస్తవ్యం మనకు ‘షాలోమ్’ (Shalom)—అంటే దైవికమైన సమాధానాన్ని, సంపూర్ణతను మరియు సమగ్రతను అనుగ్రహిస్తుంది. క్రైస్తవులకు తాము ఎవరో, మరియు తాము ఎటు వైపు పయనిస్తున్నారో పూర్తి అవగాహన కలిగి ఉంటారు. క్రీస్తు ప్రేమను ఆలింగనం చేసుకోని జీవితాలు ఎక్కువగా గమ్యం లేకుండా, దిశానిర్దేశం లేని ప్రవాహంలో కొట్టుకుపోయే నావల్లే ఉంటాయి.

క్రైస్తవులు “కనిపించని వాటిని” నిలకడగా నిదానించి చూస్తారు (2 కొరింథీ 4:18; ఇక్కడ ఉపయోగించిన గ్రీకు పదం ‘తీవ్రమైన మరియు ఏకాగ్రతతో కూడిన చూపును’ సూచిస్తుంది). ఇది ఒక విరోధాభాసంలా (Paradox) అనిపించవచ్చు—అంటే కనిపించని దాని కోసం వెదకడం. కానీ ఆత్మీయ మహిమ మన కోసం వేచి ఉంది; అందుకే క్రైస్తవ యాత్రికులు తమ చూపును వెనక్కి మళ్లించకుండా, కేవలం ముందరికే చూసే ఒక దృఢమైన ఆత్మీయ క్రమశిక్షణను కలిగి ఉంటారు. మన ముందున్న ఆ గమ్యం మన దృష్టిని ఆకర్షిస్తూ, మనల్ని నిరీక్షణతో నింపుతుంది. నిలకడగా సాగిపోయే ఆ యాత్రికుల కోసం సిద్ధపరచబడిన ఆ మహిమ, మన ఊహలకు అందనిది మరియు మాటలకు మించినది.

“ముందుకు సాగండి, ఉన్నతమైన దాని వైపు పయనించండి! నార్నియా వైపు, ఉత్తర దిశ వైపు!”—సి.ఎస్. లూయిస్ రచించిన ‘నార్నియా’ (Narnia) కథల్లోని ‘ద హార్స్ అండ్ హిస్ బాయ్’ (The Horse and His Boy) లోని ప్రసిద్ధ నినాదం ఇది. సిలువను మోసే క్రీస్తు యాత్రికులందరూ ఏకగ్రీవంగా అంగీకరించే సత్యం ఇదే: మరింత ముందుకు… మరింత ఉన్నతముగా!.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

డెరెక్ థామస్
డెరెక్ థామస్
డాక్టర్ డెరెక్ డబ్ల్యూ.హెచ్. థామస్ (Dr. Derek W.H. Thomas) లిగోనియర్ మినిస్ట్రీస్‌లో 'టీచింగ్ ఫెలో'గా (Teaching Fellow) సేవ చేస్తున్నారు. ఆయన రిఫార్మ్డ్ థియోలాజికల్ సెమినరీ (RTS) లో సిస్టమాటిక్ మరియు పాస్టోరల్ థియాలజీ విభాగానికి 'ఛాన్సలర్స్ ప్రొఫెసర్'గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లిగోనియర్ వారి 'రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం' (Romans 8) బోధనా శ్రేణిలో ఆయన ముఖ్య బోధకులు. అలాగే, హెవెన్ ఆన్ ఎర్త్ (Heaven on Earth), స్ట్రెంత్ ఫర్ ద వియరీ (Strength for the Weary), మరియు లెట్ అస్ వర్షిప్ గాడ్ (Let Us Worship God) వంటి అనేక విశిష్ట గ్రంథాలను ఆయన రచించారు.