How-to-Read-Apocalyptic-Literature_2560
అలౌకిక సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
21/10/2025
How-to-Read-Apocalyptic-Literature_2560
అలౌకిక సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
21/10/2025

యేసు ఎలా జీవాహారము?

How-Is-Jesus-the-Bread-of-Life

జాషువా ఓవెన్

 

యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనంలో, ప్రభువైన యేసు తనను తాను గూర్చి చేసిన ఏడు “నేను” అనే ప్రకటనలలో మొదటిది మనకు కనిపిస్తుంది. ఈ విశేషమైన ప్రకటనలలో ఆరు యేసును ఒక ప్రత్యేకమైన నామవాచకంతో, ఒక విశేషమైన పాత్రతో పరిచయం చేస్తాయి. అవి: జీవాహారము నేనే (యోహాను 6:48), నేను లోకమునకు వెలుగును (యోహాను 8:12; 9:5), గొఱ్ఱెలు పోవు ద్వారమును నేనే (యోహాను 10:7, 9), నేను గొఱ్ఱెలకు మంచి కాపరిని (యోహాను 10:11, 14), పునరుత్థానమును జీవమును నేనే (యోహాను 11:25), నేనే మార్గమును, సత్యమును, జీవమును (యోహాను 14:6). ఈ నామాలు యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఈ లోకంలో నెరవేర్చిన అద్భుతమైన కార్యాన్ని మనకు వివరిస్తాయి. 

 

అయితే, యోహాను 8:58లోని ఏడవ ప్రకటన మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే అందులో ఏ విధమైన ప్రత్యేకమైన నామవాచకం లేదు. అక్కడ యేసు తనను తాను దేవుని దైవ నామంతో సమానంగా ప్రకటించుకున్నాడు. ప్రవక్త మోషే దేవుని పేరు అడిగినప్పుడు, ప్రభువు “నేను ఉన్నవాడను” అని తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు (నిర్గమకాండము 3:14). అదేవిధంగా, యేసు “అబ్రాహాము పుట్టకముందే నేను ఉన్నాను” అని చెప్పడం ద్వారా, తాను నిత్యమైన దేవుడే అని స్పష్టంగా తెలియజేశాడు. ఈ సంపూర్ణ ప్రకటన ద్వారా యేసు చేసిన అన్ని “నేను” అనే వాక్య ప్రకటనలు ఆయన దైవత్వానికి సాక్ష్యం ఇస్తున్నాయి.

 

యూదుల మత నాయకులు యేసును మెస్సీయగా నమ్మకపోవడంతో, ఈ ప్రకటనను వారు దైవదూషణగా పరిగణించారు. అందువల్ల “వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి” (యోహాను 8:59). యేసు తన దైవ స్వభావం గురించి చెప్పిన సత్యాన్ని వారు అర్థం చేసుకున్నప్పటికీ, దానిని నమ్మలేదు. కాబట్టి మనం ఈ మొదటి “నేను ఉన్నాను” అనే ప్రకటనను పరిశీలించేటప్పుడు, అవిశ్వాసం ఎంత తీవ్రమైన విషయమో గ్రహించాలి. ఎందుకంటే యేసు మాటలు నిజంగా జీవన్మరణ విషయాలు.

 

యేసు తన అనుచరులతో సుదీర్ఘంగా సంభాషిస్తున్నప్పుడు, “నేనే జీవాహారము” (యోహాను 6:48) అని చెప్పాడు. ఈ సంభాషణ, ఐదు రొట్టెలు మరియు రెండు చేపలతో ఐదు వేల మందికి ఆహారం పెట్టిన అద్భుతము జరిగిన తర్వాత (యోహాను 6:5–14), పస్కా పండుగకు మరియు తర్వాత రాబోయే పర్ణశాలల పండుగకు ముందుగా జరిగింది (యోహాను 6:4). ఈ రెండు సంఘటనలు, యేసు జీవాహారముగా ఉండటం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన సందర్భాన్ని అందిస్తాయి. 

 

పర్ణశాలల పండుగలో, ఐగుప్తు బానిసత్వం నుండి విమోచింపబడి అరణ్యంలో ప్రయాణించిన ఇశ్రాయేలీయులపై దేవుడు చూపిన అద్భుతమైన సంరక్షణను ప్రజలు ఆనందంతో జ్ఞాపకం చేసుకున్నారు. ఆ ఎడారి ప్రాంతం నివసించడానికి ఏమాత్రం అనుకూలమైనది కాదు. అక్కడ ఆహారం, నీరు, పగటివేళ నీడ, రాత్రిపూట వెలుగు వంటి ప్రాణావసరాలు లేవు. అయినప్పటికీ, ఆ నిస్సారమైన భూమిలో వారి ప్రయాణకాలమంతా, సర్వలోక ప్రభువు క్రీస్తుయేసులో తన మహిమైశ్వర్యం ద్వారా వారి అవసరాలన్నింటినీ తీర్చి,  ఉదార స్వభావం గల పోషకుడు అని నిరూపించుకున్నాడు (ఫిలిప్పీయులకు 4:19; 1 కొరింథీయులకు 10:1–4). దేవుడు వారికి ప్రతిరోజు ఆహారాన్ని సమకూర్చడం ఆయన చేసిన మొదటి పోషణ అద్భుతాలలో ఒకటి. వారు మొదటిసారి ఆ రొట్టెను చూసినప్పుడు, అది ఏమిటో తెలియక, దానిని మన్నా (అనగా “ఇది ఏమిటి?”) అని పిలిచారు. అరణ్యంలో ఆహారాన్ని అందించి తన మంచితనాన్ని, కృపను చూపించిన ప్రభువును కీర్తన 78:23-25 ఇలా గుర్తుచేస్తుంది:

అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను.

అంతరిక్షద్వారములను తెరచెను

ఆహారమునకై ఆయన వారిమీద మన్నాను కురిపించెను

ఆకాశధాన్యము వారి కనుగ్రహించెను.

దేవదూతల ఆహారము నరులు భుజించిరి

భోజనపదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను.

 

యోహాను 6వ అధ్యాయంలో, యూదులు యేసును సవాలు చేస్తూ, తమ పితరులకు మోషే మన్నాను ఇచ్చినట్లే, ఆయన కూడా ఒక అద్భుతం చేసి తనను తాను రుజువు చేసుకోవాలని కోరారు. దానికి యేసు, మన్నాను ఇచ్చింది మోషే కాదు, నా తండ్రే అని స్పష్టంగా చెప్పి, వారి ఆలోచనను సరిదిద్దాడు. అంతేకాక, ఆత్మలను పోషించడానికి పరలోకం నుండి దిగివచ్చిన నిజమైన మన్నా తానేనని, జీవాహారము తానేనని వారికి వివరించాడు. మన్నా అనేది వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు, నలభై సంవత్సరాలపాటు ఇశ్రాయేలీయుల శరీరాలను పోషించిన దేవుని గొప్ప బహుమతి. అయినప్పటికీ, ఆ మన్నా తిన్న వారందరూ చివరికి మరణించారు. కానీ యేసు, “నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్యజీవము పొందును” అని ప్రకటించారు (యోహాను 6:54). 

 

యేసు ఐదు వేల మందికి ఆహారం ఇచ్చినప్పుడు, మోషే కాలంలో దేవుడు చేసిన అద్భుతాన్ని తిరిగి చేసి చూపించి, తానే సర్వము సమకూర్చే దేవుడని తెలియజేశాడు. అయితే, ప్రజలు మళ్ళీ ఆయనను వెతుక్కుంటూ వచ్చినప్పుడు, వారు సరైన ఉద్దేశంతో రాలేదని ఆయన హెచ్చరించాడు. వారు కేవలం నశించిపోయే ఆహారం కోసమే శ్రమిస్తున్నారని, బదులుగా నిత్యజీవమునకు నిలిచి ఉండే ఆహారం కోసం పాటుపడాలని బోధించాడు. అప్పుడు, యేసు తానే ఆ జీవాహారమని స్పష్టంగా వివరించాడు.

 

రొట్టెను గురించి, తన శరీరాన్ని తినడం మరియు రక్తాన్ని త్రాగడం గురించి యేసు చెప్పిన మాటలు ఆయన మానవ స్వభావాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. యేసును నమ్మడం అంటే, మనకోసం ఆయన చేసిన మానవ జీవిత త్యాగాన్ని స్వీకరించడమే. అయితే, యేసు పలికిన “నేను” అనే వాక్య ప్రకటనలు ఆయన దైవ స్వభావాన్ని కూడా ప్రకటిస్తున్నాయి. కాబట్టి, మనం కేవలం ఆయన సిలువ త్యాగంపై విశ్వాసం ఉంచడమే కాకుండా, ఈ లోకంలో అవతరించిన దేవునిగా ఆయనకున్న నశించని, నిత్యజీవంపై కూడా విశ్వాసం ఉంచాలి. రక్షించే విశ్వాసాన్ని వర్ణించడానికి “తినడం” అనే పదం ఒక శక్తివంతమైన రూపకం. ఎందుకంటే, మనం తినే ఆహారం శరీరంలోనికి వెళ్లి మనల్ని పోషించి, ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. అలాగే, యేసుక్రీస్తులో మనం కలిగి ఉన్న విశ్వాసం మన ఆత్మకు జీవం పోస్తుంది. అయితే, శరీరానికి ఇచ్చే ఆహారంలా కాకుండా, విశ్వాసిలో ఉన్న క్రీస్తు యొక్క జీవం ప్రేమ కార్యాల ద్వారా ఎప్పటికీ నశించదు. ఆయన ఇచ్చే నిత్యజీవం దేవుని వైపు దృష్టి పెట్టిన మన జీవితాలను శాశ్వతంగా నిలబెడుతుంది.

 

ఈ వ్యాసం యేసు చెప్పిన “నేను ఉన్నాను” అనే వాక్యాలు అనే సేకరణలో భాగం. 

 

డాక్టర్ జాషువా ఓవెన్ ఫ్లోరిడా రాష్ట్రంలోని పోర్ట్ ఆరెంజ్ పట్టణంలో ఉన్న స్ప్రూస్ క్రీక్ ప్రెస్బిటేరియన్ చర్చ్లో సీనియర్ పాస్టర్‌గా సేవలందిస్తున్నారు.




 

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్‌లో ప్రచురించబడింది.

      1.