5 Things You Should Know About Holiness
పరిశుద్ధత గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
24/03/2026
5 Things You Should Know About Holiness
పరిశుద్ధత గురించి మీరు తెలుసుకోవలసిన 5 విషయాలు
24/03/2026

మోషే గురించి మీరు తెలుసుకోవాల్సిన 5 ముఖ్య విషయాలు

5 Things You Should Know About Moses

బైబిల్‌లో మనకు కనిపించే అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో మోషే ఒకరు. ఆయన జీవితానికి సంబంధించి మీరు బహుశా గమనించి ఉండని ఐదు ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి:

1. ముగ్గురు తోబుట్టువులందరిలో మోషే అందరికంటే చిన్నవాడు

మోషే తన కుటుంబంలో మూడవ సంతానం. అతని అక్క అయిన మిర్యాము, మోషే శిశువుగా ఉన్నప్పుడు నైలు నదిలో ఏమి జరుగుతుందో కనిపెట్టి గమనించేంత వయస్సు కలిగినది. అంతేకాకుండా, ఆమె ఫరో కుమార్తె వద్దకు వెళ్లి, తన తల్లిని దాదిగా నియమించేలా సమయోచితంగా మధ్యవర్తిత్వం వహించింది (నిర్గమ. 2:1-10). ఇక మోషే అన్నయైన అహరోను, మోషే కంటే మూడు సంవత్సరాలు పెద్దవాడు (సంఖ్యా. 33:39 మరియు ద్వితీయో. 34:6 వచనాలను పోల్చి చూస్తే ఇది స్పష్టమవుతుంది).

2. మోషే జీవితం నలభై సంవత్సరాల చొప్పున మూడు కాలాలుగా విభజించబడింది.

మోషే జీవిత కాలాన్ని మనం గమనిస్తే, అది ఖచ్చితమైన మూడు దశలుగా విభజించబడి ఉండటం కనిపిస్తుంది. నిర్గమకాండము రెండవ అధ్యాయం ఈ వివరాలను నేరుగా ప్రస్తావించనప్పటికీ, లేఖనాల్లోని ఇతర భాగాల ద్వారా ఈ కాలక్రమం మనకు స్పష్టమవుతుంది. మోషే ఒక ఐగుప్తీయుడిని చంపినప్పుడు ఆయన వయస్సు నలభై ఏళ్లని అపొస్తలుల కార్యములు 7:23 వివరిస్తోంది. ఇది ఆయన ఐగుప్తు రాజభవనంలో గడిపిన మొదటి 40 ఏళ్ల కాలం. దేవుడు మండుచున్న పొదలో మోషేకు ప్రత్యక్షం కావడానికి ముందు, అతను మిద్యాను అరణ్యంలో గొర్రెల కాపరిగా మరో నలభై ఏళ్లు గడిపాడు (అపొస్తలుల కార్యములు 7:30). ద్వితీయోపదేశకాండము 34:7 (మరియు 34:6 సందర్భం) ప్రకారం, మోషే తన 120వ ఏట మరణించారు. అంటే దేవుని ప్రజలను అరణ్యంలో ఇశ్రాయేలీయుల నాయకుడిగా నడిపించడానికి అతను మరో నలభై ఏళ్లు వెచ్చించాడు. దీనిని బట్టి, మోషే తన జీవితంలో మొదటి నలభై ఏళ్లు ఐగుప్తులోనూ, తదుపరి నలభై ఏళ్లు అరణ్యంలో గొర్రెలను కాస్తూ, చివరి నలభై ఏళ్లు అదే అరణ్యంలో ఇశ్రాయేలీయులను నడిపిస్తూ (కాస్తూ) గడిపాడు.

3. మోషే ఒక కూషీయురాలిని వివాహం చేసుకున్నాడు (సంఖ్యాకాండము 12:1)

మోషే మిద్యాను యాజకుని కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకున్నారని లేఖనాలు మనకు స్పష్టం చేస్తున్నాయి (నిర్గమకాండము 2:16, 21). అయితే, సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ప్రస్తావించబడిన ఈ “కూషీయురాలు” నిజానికి సిప్పోరానేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయంలో వేదాంతుల మధ్య రెండు ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి: అగస్టిన్ మరియు జాన్ కాల్విన్ వంటి ప్రముఖ వేదాంతవేత్తలు, సిప్పోరా మరియు ఈ కూషీయురాలు ఒకే వ్యక్తని భావించారు. సిప్పోరా నివసించిన ప్రాంతం ఆధారంగా ఆమెను అలా పిలిచి ఉండవచ్చని వారి అభిప్రాయం. మరికొందరు పండితుల ప్రకారం, కూషు అనేది సాధారణంగా ఎథియోపియా ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి, మోషే వివాహం చేసుకున్న రెండవ భార్య ఈమె అయి ఉండవచ్చు. ఈ అంశంపై పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో అంతకంటే ఎక్కువ సమాచారాన్ని మనకు అందించలేదు. కాబట్టి, దేవుని వాక్యం మౌనంగా ఉన్న చోట మనం కూడా వినయపూర్వకంగా ఆ మౌనాన్ని గౌరవించి, దీనిని ఒక అపరిష్కృత అంశంగానే వదిలివేయడం శ్రేయస్కరం.

4. మోషే “భూమి మీద ఉన్న వారందరిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు” (సంఖ్యాకాండము 12:3)

మోషే స్వయంగా రాసినట్లుగా భావించబడే ఈ మాట, ఒక విరుద్ధమైనదిగా అనిపించవచ్చు. అసలు సాత్వికము లేదా వినయం కలిగిన వ్యక్తి తన సొంత వినయాన్ని గురించి తానే ఇలా రాసుకోగలడా? ఈ కారణం చేతనే, విమర్శనాత్మక పండితులు ఈ వాక్యాన్ని మోషే స్వయంగా రాసి ఉండకపోవచ్చని వాదిస్తుంటారు. కానీ, ఈ మాట వెనుక ఉన్న సందర్భాన్ని మనం పరిశీలిస్తే, దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది.  మిర్యాము మరియు అహరోను మోషే నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ అతనిపై ధ్వజమెత్తారు. అటువంటి క్లిష్ట సమయంలో కూడా మోషే కోపంతో గానీ, కక్షతో గానీ వారిని ఎదురించలేదు. తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించకుండా, తన పక్షాన దేవుడే మాట్లాడేలా అతను మౌనంగా ఉండిపోయాడు. ప్రఖ్యాత బైబిల్ వ్యాఖ్యాతలు కీల్ మరియు డెలిట్జ్‌ష్ (Keil and Delitzsch) వివరించినట్లుగా, “అతడు అందరికంటే మిక్కిలి సాత్వికుడు గనుకనే, తనపై జరిగిన ఈ దాడిని సర్వజ్ఞానియు, నీతిమంతుడైన న్యాయాధిపతికి ప్రశాంతంగా  విడిచిపెట్టగలిగాడు. తనను ఆ పదవికి పిలిచి, అర్హతనిచ్చిన కల్పించిన దేవుడే తనకు న్యాయం చేస్తాడని అతడు నమ్మాడు.”

5. రూపాంతర పర్వతంపై యేసు ప్రభువుతో పాటు మోషే, ఏలీయాలు ప్రత్యక్షమయ్యారు

(మత్తయి 17:1–8; మార్కు 9:2–8; లూకా 9:28–36)

పాత నిబంధనలోని ఎందరో భక్తులు ఉండగా, కేవలం మోషే మరియు ఏలీయాలు మాత్రమే రూపాంతర పర్వతంపై యేసుతో కలిసి కనిపించడం వెనుక ఉన్న ఉద్దేశంపై వేదాంతపరంగా ఆసక్తికరమైన చర్చలు ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రానికి, ఏలీయా ప్రవక్తలకు ప్రతినిధులుగా ఉన్నారని చాలామంది అభిప్రాయపడతారు. ఈ విధంగా, వారు వ్యక్తిగత రూపంలో అక్కడ ఉండటం ద్వారా మొత్తం పాత నిబంధనకే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరికొందరు, పాత నిబంధన కాలంలో అద్భుతాలు అత్యంత శక్తివంతంగా జరిగిన రెండు ప్రధాన ఘట్టాలకు వీరు సూచికలని భావిస్తారు. అయితే వ్యక్తిగతంగా నా అభిప్రాయం ప్రకారం, పాత నిబంధనలో సీనాయి పర్వతంపై యెహోవాను కలుసుకున్న ఇద్దరు వ్యక్తులు వీరే. ఆనాడు కొండపై మహిమను చూసిన వారు, నేడు రూపాంతర పర్వతంపై సాక్షాత్తు ప్రభువైన యేసు మహిమను చూస్తూ ఆయనను కలుసుకోవడం ఎంతో సముచితంగా అనిపిస్తుంది. ఈ కలయిక యేసుక్రీస్తే వాగ్దానం చేయబడిన మెస్సీయ అనే సత్యాన్ని అత్యంత శక్తివంతంగా ధృవీకరిస్తోంది.

ఈ వ్యాసం మొదట లిగోనియర్ మినిస్ట్రీస్ బ్లాగ్ (Ligonier Ministries Blog) లో ప్రచురించబడింది.

డాక్టర్ బెన్జమిన్ షా
డాక్టర్ బెన్జమిన్ షా
డాక్టర్ బెన్జమిన్ షా ఫ్లోరిడాలోని సాన్‌ఫర్డ్‌లో ఉన్న రిఫార్మేషన్ బైబిల్ కాలేజీ (Reformation Bible College) లో పాత నిబంధన విభాగపు ఆచార్యులుగా (Professor) సేవలు అందిస్తున్నారు. ఆయన రచించిన "ప్రసంగి: పతనమైన లోకంలో జీవితం" (Ecclesiastes: Life in a Fallen World) అనే గ్రంథం ఎంతో ప్రసిద్ధి చెందింది.